బొబ్బిలి ఎమ్మెల్యే సిఫారసులకు, మాజీ మంత్రి సుజయ్ అడ్డం
సోదరుడు ఎమ్మెల్యే అయినా మాజీ మంత్రి అనుచరులదే హవా
తమ్ముడు తమ్ముడే..పేకాట.. పేకాటే అన్నట్లు తయారైంది ఆ అన్నదమ్ముల మధ్య వ్యవహారం. అన్న మాజీ మంత్రి..తమ్ముడు తాజా ఎమ్మెల్యే..అన్న పదవిలో ఉండగా తమ్ముడెలా అన్ని వ్యవహారాల్లో వేలు పెట్టి అన్నకు తలనొప్పి తెప్పించాడో? ఇప్పుడు తమ్ముడు పదవిలో ఉండగా అన్న కూడా అదేరీతిన వ్యవహరిస్తుండడంతో అన్నదమ్ముల మధ్య బయటకు కనిపించని యుద్ధం సాగుతోంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్‌సీపీని వదిలి రాష్ట్ర మంత్రి పదవి అనుభవించిన మాజీ మంత్రి ఆర్‌వీ సుజయ్‌కృష్ణ రంగారావుకు, బొబ్బిలి తాజా ఎమ్మెల్యే ఆర్‌వీ కుమారకృష్ణ రంగారావు (బేబీనాయన)కు మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగుల బదిలీలు, గనుల శాఖలో అనుమతుల కోసం మంత్రిగా సుజయ్ సిఫారసు చేస్తే తమ్ముడు బేబీ నాయన అడ్డుపుల్ల వేస్తుండడం అప్పట్లో చర్చనీయాంశమయ్యేది. అదే సమయంలో మంత్రి సోదరుడిగా చక్రం తిప్పుతూ బేబీ నాయన చేసిన పైరవీలకు మంత్రి సుజయ్ అనుచరులు అడ్డుపడేవారు. మళ్లీ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో బొబ్బిలి నుంచి బేబీ నాయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సుజయ్‌తో కోల్డ్‌వార్ మళ్లీ మొదలైంది. అన్నదమ్ముల రాజకీయ క్రీడలో అధికారులు, సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు.
సుజయ్ అడ్డుచక్రం..
బేబీ నాయన పేరుకు› బొబ్బిలి ఎమ్మెల్యే అయినా పెత్తనం మాత్రం అన్న సుజయ్‌కృష్ణదేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల (సీఐల) బదిలీల్లో రాష్ట్రవ్యాప్తంగా కేటాయించిన స్టేషన్లలో అందరూ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఒక్క బొబ్బిలి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ కె.నారాయణరావు తప్ప. పార్వతీపురం మన్యం జిల్లా కొటియా నుంచి బొబ్బిలి రూరల్ సీఐగా ఆయనకు బదిలీ అయ్యింది. విధుల్లో వారం రోజుల క్రితమే ఆయన చేరాల్సి ఉంది. కానీ బొబ్బిలి రాజుల మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్ ఆయన పోస్టింగ్‌కు చేటు తీసుకొచి్చంది. వాస్తవానికి బొబ్బిలి రూరల్ స్టేషన్‌లో సీఐ పోస్టులో నారాయణరావు చేరడానికి ఎమ్మెల్యే బేబీ నాయన సానుకూలత వ్యక్తంచేస్తూ సిఫారసు లేఖ రాశారు. ఆ లేఖనే నారాయణరావు తమ శాఖ ఉన్నతాధికారులకు సమర్పించుకోగా ఆయనను బొబ్బిలి రూరల్ సీఐగా నియమిస్తూ బదిలీల జాబితాలో పేరు ఖరారైంది. తీరా ఆయన బాధ్యతలు తీసుకునే సమయానికి సుజయ్ అడ్డుచక్రం వేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
‘కులం’ సాకుతో..
బొబ్బిలి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తో లేదా అనుకూల వర్గం వ్యక్తో సీఐగా వస్తే బాగుంటుందని స్థానిక టీడీపీ నాయకులు సుజయ్ చెవిలో ఊదినట్లు సమాచారం. నారాయణరావు కాళింగ సామాజికవర్గానికి వ్యక్తి కాబట్టి తాము ఆశించిన పనులు చేయకపోవచ్చని వాదించారట. ఆయన పోస్టింగ్ కోసం ఎమ్మెల్యే బేబీనాయన స్వయంగా లేఖ ఇచ్చారని చెప్పారట. అంతకుమించి ఆ సిఫారసు లేఖను మాజీ తెంటు లక్ష్ము నాయుడు ఇప్పించారనీ చెప్పేశారట. అప్పటికే తెంటు అంటే వైరం, సోదరుడు బేబీ నాయనతో కోల్డ్‌వార్ నేపథ్యంలో సుజయ్ వెంటనే స్పందించి నారాయణరావు చేరికకు అడ్డుపుల్ల వేశారని తెలిసింది.
పోలీసు అధికారులను సుజయ్ అనుచరులు స్వయంగా కలిసి ఆయన మాటగా అసలు విషయం చెప్పారట. బొబ్బిలి నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న కొప్పుల వెలమ లేదా కాపు సామాజికవర్గానికి చెందిన సీఐని రూరల్ స్టేషన్‌కు ఇవ్వాలని, నారాయణరావు కాళింగ సామాజిక వర్గానికి చెందినవారని, తమకు పనిచేయాలంటే స్థానికంగా కొంత అవగాహన ఉండాలని చెప్పారట. తమకు అనుకూలమైన సీఐని తెచ్చుకునేవరకూ నారాయణరావు బాధ్యతలు తీసుకోకుండా ఆపాలని కరాఖండిగా చెప్పినట్లు తెలిసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే నారాయణరావును విధుల్లో చేరవద్దని చెప్పేశారట. ఇప్పుడు ఆయన పరిస్థితి డోలాయమానంలో ఉంది.
అన్నదముల సవాల్‌తో సమస్య..
బొబ్బిలి రూరల్ సీఐ పోస్టు ఖాళీగా ఉండడంతో గ్రామీణ మండలాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. పలు గ్రామాల్లో దొంగతనాలు, హత్యాయత్నాలు, అత్యాచార యత్నాలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యే బేబీనాయన, సోదరుడు సుజయ్ మధ్య సవాళ్లు తమకు సమస్యగా మారాయని పోలీసులు, సామాన్య ప్రజలు లోలోన రగిలిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment