Vizianagaram District News
-
జమ్ములో డయేరియా
● ఆరు కేసులు నమోదు గుర్ల: మండలంలోని జమ్ము గ్రామంలో డయేరియా విజృంభించింది. ఒక్కసారిగా ఆరు డయేరియా కేసులు నమోదు కావడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. జమ్ము సత్యనారాయణమ్మ డయేరియాతో విజయనగరం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, కొల్లూరి అనురాధ, నడిపిల్లి సన్యాసప్పుడు, వెంపడాపు రామునాయుడు, గొర్లె స్వామినాయుడు చీపురుపల్లిలోని సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. వెంపడాపు శ్రీను తెట్టంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం తీసుకుంటున్నాడు. గ్రామంలో తాగునీరు కలుషితం కావడం వల్లే డయేరియా కేసులు నమోదవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని డయేరియా ప్రబలకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు. గురువుల వినూత్న నిరసన సీతంపేట: సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంపై గిరిజన గురుకులాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆందోళన వ్యక్తంచేశారు. సీతంపేట ఐటీడీఏ ముఖద్వారం వద్ద ఉన్న అడవితల్లి విగ్రహం ముందు బుధవారం జోరువానలో ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. 36 రోజులుగా నిరసన దీక్షలు చేపట్టి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని కోరారు. డీఎస్సీలో తమ పోస్టులు మినహాయించి సీఆర్టీగా మార్పు చేయాలని, 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బి.గణేష్, ఎస్.మోహన్‌రావు, కె.భవాని తదితరులు పాల్గొన్నారు. వరి కుప్పలపై ఏనుగుల దాడిగరుగుబిల్లి: ఓ వైపు తుఫాన్ వర్షాలు పంటను తడిసిముద్దచేస్తుండగా, మరోవైపు గజరాజులు పంటను నాశనం చేస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంట మట్టిలో కలిసిపోతోందంటూ ఆవేదన చెందుతున్నారు. వారం రోజుల నుంచి సంతోషపురం, సుంకి, మరుపెంట గ్రామాల్లో గజరాజులు సంచరిస్తున్నాయి. మంగళవారం రాత్రి సుంకి గ్రామానికి చెందిన గొల్లు అన్నపూర్ణ, గొల్లు చంద్రమౌళి, గులిపిల్లి కమల తదితర రైతులకు చెందిన పంట పొలంలో వేసిన వరి కుప్పలను చెల్లాచెదురుగా విసిరేశాయి. పైప్లైన్లను ధ్వంసం చేశాయి. ఏడు ఏనుగుల గుంపు ఎవరిపైన ఎప్పుడు దాడిచేస్తాయోనని రైతులు భయాందోళన చెందుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న ఆలిండియా యూనివర్సిటీ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారులు అర్హత సాధించారు. ఇటీవల విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీలో జరిగిన ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు క్రీడాకారులు ఈనెల 26 నుంచి ఒడిశా రాష్ట్రంలో జరగబోయే ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికయ్యారు. విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన పి.వసంత 100, 200 మీటర్ల పరుగు పోటీలో అర్హత సాధించగా..సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ఎం.హరీష్ 5000 మీటర్లు, 10000 మీటర్ల పరుగు పోటీలో, విజయనగరం ఎంఆర్ కళాశాలలో చదువుతున్న ఎస్.శ్రావణి 200మీటర్లు, 400 మీటర్ల పరుగు పోటీలో, శ్రీనివాస కళాశాలలో చదువుతున్న వి.భార్గవి 100 మీటర్ల పరుగు పోటీలో అర్హత సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధి లీలాకృష్ణ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు బుధవారం పయనం కాగా..వారిని అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పతకాలు సాధించి విజయనగరం ఖ్యాతిని చాటి చెప్పాలని ప్రోత్సహించారు. -
వాన.. కన్నీరు
బొబ్బిలిరూరల్: కారాడ గ్రామంలో వర్షపునీటిలోనే ఉన్న వరి చేను కుప్పలు విజయనగరం ఫోర్ట్: వాన.. రైతన్నను కన్నీరుపెట్టిస్తోంది. పంట సాగు సమయంలో కురవని వర్షం.. చి‘వరి’లో తుఫాన్ల రూపంలో కురుస్తుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షపు నీరు ముంచెత్తిన పొలాలను చూసి గగ్గోలు పెడుతున్నారు. కష్టమంతా నీటిపాలైందంటూ రోదిస్తున్నారు. వరుసగా ఏర్పడిన ఫెంగల్, అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో రోజుల తరబడి వర్షాలు కురుస్తున్నాయి. పంట పొలాల్లో నీరు చేరింది. రోజుల తరబడి వరి పనలపై నీరు నిల్వ ఉండిపోయింది. కుప్పలు సైతం నీటిలోనే 15 రోజులుగా నానుతున్నాయి. కొన్నిచోట్ల ధాన్యం రంగు మారి, మొలకలు వచ్చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలతో కోతలు వాయిదా వేసినా.. చేనంతా పండిపోయి కుళ్లిపోతోంది. 880 ఎకరాల్లో వరి పంటకు నష్టం గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు వరి పంట తడవడంతో జిల్లా వ్యాప్తంగా 880 ఎకరాల్లో కుప్పలు, పనలపై ఉన్న వరి పంటకు నష్టం వాటిల్లింది. పంటను నూర్పు చేయడానికి కూడా రైతులకు అవకాశం లేని పరిస్థితి. రైతన్నను వీడని వర్షం తడిసి ముద్దవుతున్న వరి పంట వర్షానికి పాడైన ఉద్యానవన పంటలు 15 రోజులుగా తడుస్తున్న వరిచేను ఆవేదనలో అన్నదాత -
బతుకంతా బరువే..
రామభద్రపురం: రామభద్రపురం అంతర్రాష్ట్ర మార్కెట్లో దొరికిన పనిపైనే సుమారు 30 కళాసీ కుటుంబాలు ఆధారపడి జీవిస్తాయి. కూరగాయల బస్తాలు, సిమెంట్, ఐరన్‌ను బస్సులు, లారీలకు లోడింగ్, అన్లోడింగ్ చేయడం, దుకాణాలకు తరలించడం వీరి దినచర్య. 30 మంది కళాసీలు రెండు బ్యాచ్‌లుగా విడిపోయి రోజుకో బ్యాచ్ చొప్పున పనిలో పాల్గొంటారు. వీరు వేకువజాము నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తే చేతికొచ్చేది రూ.600. ఒక్కో బ్యాచ్‌కు 15 రోజులే పని ఉండడంతో నెలకు వచ్చిన రూ.9000 సంపాదనతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. అన్‌సీజన్‌లో అయితే ఆర్థిక కష్టాలే ఎదురవుతాయి. కొన్నిసార్లు బస్సులకు బరువైన బస్తాలను ఎక్కించే సమయంలో ప్రమాదాల పాలై కాళ్లు, చేతులకు గాయాలైన ఘటనలు కోకొల్లలు. అలాంటి సమయంలో వీరిని ఆదుకునేవారూ కరువే. మార్కెట్ ఆదాయం రూ.లక్షల్లో వస్తున్నా పంచాయతీ అధికారులు, ప్రభుత్వం వీరి సంక్షేమం గురించి ఆలోచించే దాఖలా లేవు. దీంతో ప్రతినిత్య బతుకు పోరాం సాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
జూనియర్స్ కబడ్డీలో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన కబడ్డీ పోటీ్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జరిగిన 50వ అంతర్ జిల్లాల జూనియర్స్ కబడ్డీ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన బాల, బాలికల జట్లు ఉత్తమ ప్రతిభ కనబరిచాయి. మూడు రోజుల పాటు జరిగిన పోటీల్లో ఇరు జట్లు ద్వితీయ స్థానాలు దక్కించుకుని విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పాయి. రాష్ట్రస్థాయి పోటీల్లో అద్భుత క్రీడా ప్రతిభతో రాణించి విజేతలుగా నిలిచిన క్రీడాకారులను జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ఐవీపీ రాజు, అధ్యక్షుడు రంగారావుదొర, కార్యదర్శి కేవీ.ప్రభావతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిపేన లక్ష్మణరావు, కోశాధికారి శివకుమార్‌లు అభినందించారు. ద్వితీయస్థానం సాధించిన బాల, బాలికల జట్లు -
పేదోడి సొంతింటి కల సాకారంలో రాజన్నదొర ముద్ర
సాలూరు: గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో సొంత ఇల్లు అంటే పేద, మధ్య తరగతి కుటుంబాలకు చాలా కష్టమైన పనే. అటువంటి పేదవాడి సొంతింటి కలను సాలూరు పట్టణంలో సాకారం చేసిన అంశంలో మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెరగని ముద్ర వేసుకున్నారు. ఓ వైపు టిడ్కో ఇళ్లతో పాటు మరోవైపు నెలిపర్తి , గుమడాం తదితర ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు మంజూరుచేయించి పేదవానికి సొంత గూడుకు తనవంతు ప్రయత్నాన్ని రాజన్నదొర చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి పాలనలో నాటి ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర కృషితో ఇళ్లతో పాటు పూర్తి మౌలిక వసతుల కల్పనతో పట్టణంలోని గుమడాం సమీపంలో టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
● నిలకడగా ‘తోటపల్లి’
గరుగుబిల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు తోటపల్లి ప్రాజెక్టు నీటి ప్రవాహం నిలకడగా ఉంది. నాగావళి నదిలో తోటపల్లి ప్రాజెక్టు వద్ద బుధవారం సాయంత్రానికి 105 మీటర్లకు 104.49 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం నదిపై భాగం నుంచి ప్రాజెక్టుకు 410 క్యూసెక్కుల నీరు రాగా అధికారులు ఒక గేటును ఎత్తివేసి 695 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టు నీటిసామర్థ్యం 2.5 టీఎంసీలకు, 2.210 టీఎంసీలు ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు వద్ద నీటిపరిస్థితిని ఇంజినీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. -
‘సంకల్పం’ నెరవేరేలా...
విజయనగరం క్రైమ్: జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు తలపెట్టిన ‘సంకల్పం’ నెరవేరేలా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నట్టు ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంకల్ప రథం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలలు, పాఠశాలలు, ప్రజలకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నట్టు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ ఒక మండలంలోని ఒక కళాశాల, ముఖ్య కూడళ్లలో వాహనాన్ని నిలిపి, మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై వీడియోలు ప్రదర్శించి వివరిస్తున్నారన్నారు. జనవరి మాసాంతానికి జిల్లాలోని అన్ని మండలాలను సంకల్పరథం సందర్శించేలా షెడ్యూల్ రూపొందించామని తెలిపారు. ● మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రచారం ● ఎస్పీ వకుల్ జిందాల్ -
ఆదుకోని సర్కారు
రాజాం: ఆరుగాలం పుడమి తల్లిని నమ్ముకుని సేద్యం చేసే రైతన్నను ఆదుకోవడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంచేస్తోంది. ఖరీఫ్ సాయంలో అందజేయాల్సిన పెట్టుబడిసాయం అందజేయలేదు. కనీసం తుఫాన్ల సమయంలో పంటను రక్షించుకునేందుకు అవసరమైన టార్పాలిన్లను సైతం పంపిణీ చేయలేక చేతులెత్తేసింది. రైతన్నను నిలువునా ముంచేసింది. తుఫాన్ వర్షాలకు వందలాది ఎకరాల్లో పంట తడిసిపోతుంటే ఆర్‌ఎస్‌కేకు(ఆర్బీకే)కు రెండు చొప్పన జిల్లా మొత్తం 1000 టార్పాలిన్లు మాత్రమే అందజేయడంపై రైతులు మండిపడుతున్నారు. కొన్నిచోట్ల రెండు టార్పాలిన్లను ఎవరికి ఇవ్వాలో తెలియక వ్యవసాయ సిబ్బంది పంపిణీ చేయడమే మానేశారు. ఇదీ పరిస్థితి... జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.31 లక్షల ఎకరాల్లో 1.90 లక్షల మంది రైతులు వరి పంటను సాగుచేశారు. 50 శాతం మేర రైతులు పంట కోసం నూర్పిడి పనులు పూర్తిచేశారు. కొందరు ధాన్యంను కొనుగోలుకేంద్రాలకు తరలించగా, మరికొంత మంది కళ్లంలో భద్రపరిచారు. పంట చేతికొచ్చే సమ యంలో వరుసగా తుఫాన్లు సంభవించడం, వర్షాలు జోరందుకోవడంతో రైతుల్లో కలవరం మొదలైంది. పంటను రక్షించాలంటూ అధికారులు పదేపదే చెప్పారే తప్ప అవసరమైన టార్పాలిన్లు అందజేయ లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా మొత్తంపై రూ.18 లక్షలు వెచ్చించి ఇటీవల 1000 టార్పాలిన్లు మాత్రమే కొనుగోలుచేశారు. జిల్లాలో ఉన్న 510 రైతు సేవా కేంద్రాలకు వీటిని సమానంగా రెండేసి చొప్పున పంపిణీ చేశారు. కొన్నింటికి అందజేయలేదు కూడా. వాస్తవంగా ఒక్కో రైతు సేవా కేంద్రం పరిధిలో రెండు నుంచి మూడు గ్రామాలు ఉన్నాయి. 30 నుంచి 40 మంది రైతులకు వరి పంట సంరక్షణకు టార్పాలిన్లు అవసరం. వచ్చిన ఒకటిరెండు టార్పాలిన్లను ఎవరికి పంపిణీచేయాలో తోచక వ్యవసాయ శాఖ సిబ్బంది మిన్నకుండిపోయారు. మరోవైపు టార్పాలిన్ కూడా ఒక రోజు తీసుకెళ్లే మరుసటి రోజు తిరిగి ఇచ్చేయాలన్న నిబంధన పెట్టడం రైతులను ఆవేదనకు గురిచేసింది. ఇదే విషయాన్ని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీటీ రామారావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా జిల్లా వ్యాప్తంగా 1000 టార్పాలిన్లు మాత్రమే పంపిణీ చేశామన్నారు. మార్కెట్ యార్డుల వద్ద 63 టార్పాలిన్లు ఉంచామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని, పంటలను భద్రపరుచుకునేలా చూడాలని వ్యవసాయశాఖ సిబ్బందికి సూచించామన్నారు. దిగదుడుపుగా తుఫాన్ ప్రణాళికలు జిల్లా మొత్తంపై 1000 టార్పాలిన్ల మాత్రమే పంపిణీ ఒక్కో రైతు సేవాకేంద్రానికి రెండేసి చొప్పున అందజేత గ్రామాల్లో 30 నుంచి 40 మంది వరకూ తుఫాన్ బాధిత రైతులు టార్పాలిన్లు ఎవరికి ఇవ్వాలో తెలియక కొన్నిచోట్ల ఎవరికీ పంచిపెట్టని వైనం -
సర్వమానవాళికి యేసే రక్షకుడు
● ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు ప్రేమానందంవిజయనగరం టౌన్: సర్వమానవాళికి యేసే లోకరక్షకుడని ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పి.ప్రేమానందం తెలిపారు. ఈ మేరకు స్థానిక వీటీ అగ్రహారంలో ఉన్న న్యూ టెస్ట్‌మెంట్ చర్చి ఆవరణలో క్రిస్మస్ వేడుకలను బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తుప్రేమను ప్రతి ఒక్కరూ పొందాలన్నారు. మన పాపాల నుంచి విముక్తి కల్పించి శాంతిమార్గంలో నడిపించే దేవుడని కొనియాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రెవరెండ్ నికొడెమస్ మాట్లాడుతూ దేవుని సువార్తను విశ్వజనీనం చేయాలన్నారు. అనంతరం 36వ డివిజన్ కార్పొరేటర్ బాలి పద్మావతి కేక్ కట్ చేశారు. 47వ వార్డు కార్పొరేటర్ పట్నాన పైడిరాజు క్యాండిల్స్ వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. రెవరెండ్ సుకుమార్ చౌదరి అద్భుతమైన సాక్ష్యాన్ని, దైవసందేశాన్ని అందించారు. ఎన్టీసీ చర్చి క్వయర్ టీమ్ ఆలపించిన క్రీస్తు గీతాలాపన ఆద్యంతం ఆహూతులను ఆకట్టుకుంది. ఏంజెల్, చార్లెస్ డాని ప్రేమ్సన్, టి.సారమ్మ, జామి అప్పలనాయుడు, కోరాడ శ్రీరాములు, బి.సంతోష్, బి.రాంబాబు, ఎన్.లక్ష్మి, ఎస్.కాంతారావు, ఎస్.హరీష్, డి.కృష్ణ, జి.శామ్యూల్, ఎన్.ప్రభుకుమార్, అధిక సంఖ్యలో క్రైస్తవులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మక్కువకు ప్రయాణం సాహసమే
సాలూరు: సాలూరు నుంచి బాగువలస మీదుగా మక్కువకు ప్రయాణమంటే ప్రజల గుండెల్లో గుబులు రేగుతుంది. గోతులు, గుంతలతో ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే నరకయాతనగా మారింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మార్గం గుండా ప్రయాణమంటే సాహసమేనని ప్రజలు భావిస్తున్న పరిస్థితి ఏర్పడింది. పెద్దపెద్ద గుంతల్లో దిగిపోయి లారీల వంటి పెద్ద వాహనాలు పాడైపోతుండగా, ద్విచక్రవాహనాలు పొరపాటున ఈ గుంతల్లో దిగుతూ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఈ గోతుల్లో వర్షపునీరు నిండిపోవడంతో గుంతల లోతు అంచనా వేయలేక పలువురు వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మక్కువ రోడ్డుకు మోక్షపెప్పుడో ? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ప్రత్యేక కృషితో సాలూరు నుంచి మక్కువ వరకు 19.60 కి.మీ రోడ్డు వెడల్పు, పటిష్ట పరిచేందుకు సుమారు రూ.55 కోట్ల 56 లక్షల అంచనా విలువతో ఈ రోడ్డు మంజూరైంది. రూ.38 కోట్ల 52 లక్షల పని విలువతో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో 2021 మార్చి 1వ తేదీన ఈ రోడ్డు పనులు ప్రారంభించారు. పనుల్లో భాగంగా 6 కి.మీ మెటల్ లేయర్ వేశారు. 32 కల్వర్టులకు గాను 16 కల్వర్టులు, 8 మైనర్ బ్రిడ్జిలకు గాను 3 బ్రిడ్జిల నిర్మాణం పూర్తయింది. మిగిలిన పనులు చేపట్టాల్సి ఉంది. రోడ్డు నిర్మాణం పూర్తిచేయరా? ఇకనైనా ప్రభుత్వం, అఽధికారులు స్పందించి ఈ రోడ్డునిర్మాణం పూర్తి చేయించి తమ రహదారి కష్టాలు తీర్చాలని సాలూరు,మక్కువ మండలాల ప్రజలు కోరుతున్నారు.ఇటీవల ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఈ మార్గం గుండా కాకుండా సాలూరు నుంచి మామిడిపల్లి, శంబర మీదుగా మక్కువకు ప్రయాణించిన విషయం పాఠకులకు విదితమే. గుండెల్లో గుబులు రేపుతున్న బాగువలస మీదుగా ప్రయాణం అధ్వానంగా తయారైన రోడ్డు -
టిడ్కో ఇళ్లకు గ్రహణం
పార్వతీపురంటౌన్: గత ప్రభుత్వం 95 శాతం నిర్మించిన టిడ్కోఇళ్లకు గ్రహణం పట్టింది. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఇళ్ల పంపిణీ నిలిచిపోయింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపించి సకాలంలో ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి చేశారు. టిడ్కో గృహ సముదాయాల వద్ద పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించారు. అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ గృహాలను అందించాలని శరవేగంగా పనులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కనీసం వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. టిడ్కో ఇళ్లు అందక అద్దె ఇళ్లలోనే అవస్థలు పడుతున్నారు.పేదల వద్ద వసూలు పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు, పార్వతీపురంలలో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి లబ్ధి దారులను గుర్తించి 2017లో వారి వాటాగా రూ.500 కేటగిరిలో 300 చదరపు అడుగులు, రూ.25000 కేటగిరిలో 365 చదరపు అడుగులు, రూ.50వేల కేటగిరిలో 430 చదరపు అడుగుల్లో ఇళ్ల నిర్మాణానికి నిర్ణయించారు. ఈ మేరకు లబ్ధిదారుల నుంచి పార్వతీపురంలో రూ.1.75 కోట్లు, సాలూరులో రూ.1.08 కోట్లు వసూలు చేశారు. పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన టీడీపీ ప్రభుత్వం కనీసం పనులు ప్రారంభించలేదు.పేదల ఇళ్లపై వివక్ష తగదు నూతన ప్రభుత్వం రావడంతో టిడ్కో ఇళ్ల మిగులు పనులు ప్రారంభించ లేదు. గత వైఎస్సార్సీపీ ఐదేళ్ల పరిపాలనా కాలంలో దాదాపు పూర్తి చేశాం. లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేశాం. జిల్లాలో పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో 1898 ఇళ్లు నిర్మించాం. పార్వతీపురంలో తాగునీరు, డ్రైనేజీ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిని పూర్తి చేసేందుకు గత ప్రభుత్వం రూ. 11 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై వివక్ష చూపడం సరికాదు. మిగులు పనులు పూర్తి చేసి పేదలకు అందజేయాలి – జమ్మాన ప్రసన్నకుమార్, ఏపీ టిడ్కో మాజీ చైర్మన్కూటమి ప్రభుత్వం చొరవ చూపడం లేదు 2017లో నాకు టిడ్కో ఇల్లు మంజూరు చేశారు. అప్పుడు రూ.500 చెల్లించాను. కేవలం శంకుస్థాపనకే పరిమితమైంది. టీడీపీ ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేదు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇళ్లు పనులు ప్రారంభించి దాదాపు పూర్తి చేశారు. నా పేరు మీద రిజిష్ట్రేషన్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 6 నెలలు గడుస్తున్నా మిగులు పనులు ప్రారంభించలేదు. – పి. మార్కండేయులు, లబ్ధిదారు పార్వతీపురం సొంతిల్లు లేక అద్దె ఇంటిలో ఉంటున్నాం20 ఏళ్లుగా అద్దె ఇంటిలో ఉంటున్న నాకు టిడ్కో ఇల్లు దక్కింది. 2017వ సంవత్సరంలో సొంతిల్లు అందుతోందన్న ఆశతో అప్పు చేసి తొలివిడతలో రూ.12,500 వేలు చెల్లించాను, ఇప్పటివరకు ఇల్లు కేటాయించక పోవడంతో ఒక వైపు రుణానికి వడ్డీ, మరో వైపు అద్దె చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. – కె.స్వామి, లబ్ధిదారు, పార్వతీపురంవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయికే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయికే పేదలకు ఇల్లు అందించేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సాలూరు మున్సిపాలిటీ పరిధిలో 1100, పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో 798 టిడ్కో ఇళ్ల పంపిణీకి చర్యలు చేపట్టారు. ఐదేళ్ల కాలంలో శరవేగంగా పనులు చేపట్టి 95 శాతం పూర్తి చేశారు. మిగులు పనులు పూర్తి చేసేందుకు ఎన్నికల ముందు రూ.11 కోట్లు మంజూరు చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా పనులు నిలిపివేశారు. గృహ సముదాయాల వద్ద పూర్తిస్థాయిలో మౌలిక వసతులు, ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు పార్కులు, తాగునీటి సౌకర్యం పూర్తిస్థాయిలో కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు టిడ్కో గృహాల ఊసెత్తడం లేదు. -
ఏనుగుల విధ్వంసం
భామిని:మండల కేంద్రానికి చెందిన రైతు పోత ల చంద్రభూషణ్ నిల్వ చేసిన వరిచేను కుప్ప ను ఏనుగుల గుంపు మంగళవారం రాత్రి తిని వేసి ధ్వంసం చేశాయి. దీంతో రెండు ఎకరాల్లో ని సుమారు రూ.80వేల విలువైన వరిపంట పాడైందని బాధిత రైతు వాపోతున్నాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. కన్యకాపరమేశ్వరికి వెండి సింహాసనంవిజయనగరం టౌన్: పట్టణంలో కొలువైన కన్యకాపరమేశ్వరి అమ్మవారికి వెండి సింహాసనాన్ని ప్రముఖ వ్యాపారవేత్త కీర్తిశేషుడు నారాయణం విశ్వనాథం కుటుంబసభ్యులు బుధవారం మార్గశిర మాసం దశమి సందర్భంగా సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వెండి సింహాసనంలో ఆసీనులును చేసి వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సీఏ.నారాయణం వెంకటరమణమూర్తి, వెంకట చలమాజీ, కామేశ్వరరావు, ఈశ్వర్‌కుమార్, శేఖర్, ఏడుకొండలు, రాంజీ, అనంతపల్లి కృష్ణారావు, గణపతిరావు, పాలకమండలి సభ్యులు కుమ్మరిగుంట శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. జాతీయపోటీల్లో రాణించిన గురుకుల పాఠశాల విద్యార్థిసాలూరు: పట్టణ పరిధిలోని పీఎన్ బొడ్డవలసలో గల డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థి జాతీయస్థాయి పోటీల్లో రాణించినట్లు ప్రిన్సిపాల్ ఆశీర్వాదం బుధవారం తెలిపారు. ఈ నెల 19 నుంచి 24 వరకు జమ్ముకశ్మీర్‌లో జరిగిన జాతీయస్థాయి సబ్ జూనియర్ క్రీడాపోటీల్లో సాఫ్ట్‌బాల్ విభాగంలో ఆంద్రప్రదేశ్ జట్టు తరఫున ఆడిన జట్టులో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నితిన్‌సాయి మనోహర్ బ్రాంజ్ మెడల్ సాధించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని ప్రిన్సిపాల్‌తో పాటు పీడీ విద్యాసాగర్, పీఈటీ నాయుడులు అభినందించారు. నేడు అండర్–17 ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపికవిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అండర్–17 బాల, బాలికల ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక ఈనెల 26న నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధి డీవీ చారిప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి నగర శివారుల్లో గల విజ్జీ స్టేడియంలో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో 2008 జనవరి 1 నుంచి 2011 డిసెంబర్ 21వ తేదీ మధ్య జన్మించిన క్రీడాకారులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 28, 29 తేదీల్లో కాకినాడ జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని వెల్లడించారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి ● సీపీఎం నాయకుడు రామారావు నెల్లిమర్ల: వరి పంట రైతులను తక్షణమే ప్రభుత్వం ఆడుకోవాలని సీపీఎం నాయకుడు కిల్లంపల్లి రామారావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంట పూర్తిగా నాశనమైందన్నారు. ముఖ్యంగా తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు వరి పనలకు మొలకలు వచ్చాయని చెప్పారు. ఎకరా వరి పంట సాగుకు రూ. 50 వేలు ఖర్చవ్వగా.. ఒక్క పైసా కూడా చేతికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులను ఆదుకోవాలని కోరారు. -
నారాయణ..నారాయణ..!
● ఉనికి కోల్పోతున్న ఆనకట్ట ● ఊడిపోయిన తలుపులు ● శిథిలావస్థకు చేరిన సాగునీటి వనరుసంతకవిటి: మండలంలో 18,807 ఎకరాల్లో వ్యవసాయానికి ఆధారంగా ఉన్న ప్రధానమైన సాగునీటి వనరు నారాయణపురం ఆనకట్ట. దశాబ్దాల క్రితం నిర్మించిన ఆనకట్ట ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఆనకట్ట కుడి, ఎడమ ప్రధాన కాలువలు ద్వారా కొన్ని వేల ఆయకట్టు ఉంది. నారాయణపురం ఆనకట్టలో షట్టర్ల వ్యవస్థ కీలకం. మొత్తం 118 షట్టర్లు ఉండగా వాటిలో అధికశాతం షట్టర్లు పాడైపోవడంతో రాళ్లను ఆధారంగా పెట్టి తలుపులు నిలబెట్టారు. దీంతో ఆనకట్టలో నీరు నిలవడం గగనంగా ఉంది. కొన్ని షట్టర్లు పూర్తిగా లేకపోవడం కొసమెరుపు. 50.50 కిలోమీటర్ల పొడవున్న కుడి ప్రధాన కాలువ ద్వారా సంతకవిటి, పొందూరు, ఎచ్చెర్ల మండలాలకు సాగునీరు అందాల్సి ఉండగా ఆనకట్టలో పూర్తిస్థాయిలో నీరు నిలవక పోవడం, కాలువల పరిస్థితి బాగా లేక పోవడంతో శివారు ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో నీరు అందడం మృగ్యంగా ఉంది. దీంతో ప్రతి ఏటా పంటను కోల్పోవలసి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జైకా నిధులు మంజూరైనా..సాగని పనులు నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణకు రూ.112.10 కోట్లు మంజూరైనా ఇప్పటి వరకు 25శాతం పనులు మాత్రమే చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం నిధుల్లో దాదాపు రూ.2.5 కోట్లు షట్టర్లు మార్చడానికి, ఆనకట్టలో కాంక్రీట్ పనులకు మంజూరవగా ఇప్పటివరకు కనీసం పని జరగక పోవడం విశేషం. 118 షట్టర్ల స్థానంలో 108 షట్టర్లు ఏర్పాటు కావాల్సి ఉంది. కొంతమేర కాలువలో లైనింగ్ పనులు మాత్రమే చేపట్టినట్లు అధికారులు తెలిపారు.నోటీసులు అందించాం జైకా నిధుల ద్వారా పనులు దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్‌కు నోటీసులు పంపించాం. పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటాం. –బి.రాంబాబు, ఏఈఈ, కుడి ప్రధాన కాలువగట్టు కొట్టేసే ప్రమాదం ఉన్నా.. సంతకవిటి మండలంలోని రంగారాయపురం, వాసుదేవపట్నం గ్రామాల మధ్య ఆనకట్టకు కూతవేటు దూరంలో కాలువకు గండి పడే ప్రమాదం ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులే స్వయంగా ఇసుక బస్తాలతో కొంతమేర గట్టును పటిష్ట పరుచుకుని వారి పంటలను కాపాడుకున్నారు. -
ఎస్సీ, ఎస్టీలపై బిల్లుల భారం
వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ వర్గాలపై విద్యుత్‌చార్జీల భారం వేసి వారి జీవితాలను ఛిద్రం చేస్తోందని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 200 యూనిట్లు లోపు విద్యుత్ వినియోగించేవారి నుంచి ఎలాంటి బిల్లులు వసూలు చేయలేదని, కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన పాత బకాయిలతో కలిపి చార్జీలు వసూలు చేయడం విచారకరమన్నారు. 60 నుంచి 70 యూనిట్లు వినియోగించిన వినియోగదారులకు రూ.3వేల నుంచి రూ.6వేల చొప్పున బిల్లులు ఇస్తున్నారన్నారు. జిల్లాలోని మెంటాడ మండలం లోతుగెడ్డ ప్రాంతానికి చెందిన ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఇదే తరహాలో బిల్లులు వచ్చాయన్నారు. త్వరలో వికసిత్ భారత్ పేరిట పట్టణ ప్రజలపై యూజర్‌చార్జీల భారం మోపేందుకు కూటమి సర్కారు సన్నద్ధమవుతోందన్నారు. ఇప్పటికే తల్లికివందనం (అమ్మ ఒడి) అందక చాలా మంది పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని, మహిళలకు పథకాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. -
ప్రపంచాన్ని శాసిస్తున్నది వినియోగడారుడే
విజయనగరం అర్బన్: ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్నది వినియోగదారుడేనని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అన్నారు. వినియోగదారులంతా తమ హక్కులను తెలుసుకోవాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వినియోగదారుడు వస్తు, సేవలపై సంతృప్తి చెందకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు ఉందన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్య క్షుడు, న్యాయమూర్తి ఆర్.వెంకట నాగసుందర్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను వివరించారు. జిల్లా కమిషన్ పరిధిలో సుమారు రూ.50 లక్షల విలువైన వ్యాజ్యాలు వేసే అవకాశం ఉందన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, నిర్మాణం, రవాణా, గ్యాస్, విద్యుత్ తదితర రంగాలకు చెందిన సేవా లోపాలపై కమిషన్‌ను ఆశ్రయించవచ్చన్నారు. జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యురాలు బి.శ్రీదేవి మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు, చట్టాలను వివరించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి మధుసూదనరావు మాట్లాడుతూ వినియోగదారుల న్యాయపాలనకు వర్చువల్ విచారణ, డిజిటల్ సౌలభ్యం ఇతివృత్తంగా ఈ ఏడాది వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. సైబర్ క్రైమ్ ఎస్ఐ ప్రశాంత్‌కుమార్, ఐఓసీ సేల్స్ ఆఫీసర్ యోగేష్ కుమార్, జిల్లా ఔషధ నియంత్రణశాఖ ఏడీ రజిత, జిల్లా ఆహార భద్రతాధికారి వెంకటరమణ, సీడీపీఓ ప్రసన్న, తూనికల కొలతల శాఖ డీసీ దామోదరనాయుడు, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ సురేష్, ఆశరా జాయింట్ సెక్రటరీ ఎం.చంద్రశేఖర్, డీసీఐసీ జిల్లా కార్యదర్శి ఎస్.కామేశ్వరరావు వినియోగదారుల హక్కులను తెలియజేశారు. మేలుకొలువు మాసపత్రికను ఆవిష్కరించారు. వివిధ అంశాలపై నిర్వహించిన పోటీల విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను తిలకించారు. కార్యక్రమంలో వివిధ వినియోగదారుల సంఘాలు ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సేతు మాధవవన్ ఘనంగా వినయోగదారుల దినోత్సవం -
నమ్మకం కలిగించే పాలన అవసరం
విజయనగరం రూరల్: ప్రభుత్వం ఏదైనా అది ప్రజలకు అండగా ఉంటూ నమ్మకం కలిగించాలే తప్ప ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పాలన ఉండరాదని ఉమ్మడి విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో పెన్షన్ల తొలగింపు, తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతన్నలను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన స్థాయీ సంఘ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ముందుగా 3వ స్థాయీ సంఘ సమావేశం వైస్ చైర్మన్ బాపూజీనాయుడు అధ్యక్షతన, 4వ స్థాయీ సంఘ సమావేశం సింహాచలం అధ్యక్షతన జరిగాయి. ఆయా సంఘాల్లోని వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో చర్చించారు. పెన్షన్లు తొలగించబోమని భరోసా ఇవ్వాలి ఇటీవల పెన్షన్ల తొలగింపుపై వస్తున్న ఆరోపణలపై డీఆర్డీఏ జిల్లా అధికారులతో చర్చసాగింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని చైర్మన్ వారిని కోరగా జిల్లాలో పింఛన్లు తొలగించాలని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం అందలేదని, జిల్లాలో పూసపాటిరేగ మండలం వెల్దూరు గ్రామంలో మాత్రం పెన్సన్ పంపిణీపై సర్వే చేపట్టామన్నారు. దాని తరువాత మళ్లీ యథావిధిగానే పెన్షన్లు పంపిణీ చేసినట్టు పీడీ తెలిపారు. బాడంగి జెడ్పీటీసీ సభ్యుడు మాట్లాడుతూ నూతన పెన్షన్లు ఇప్పటివరకూ మంజూరుకాలేదని, కొంతమందికి ఆన్లైన్లో చూపుతున్నాయే తప్ప మంజూరు కాలేదని సభ దృష్టికి తెచ్చారు. దీనిపై అధికారులు సమాధానమిస్తూ కొత్త ప్రభు త్వం వచ్చాక కొత్తగా ఒక్క పింఛన్ కూడా ఇవ్వలేదన్నారు. నవంబర్ నెల నుంచి భర్తను కోల్పోయిన వితంతువులకు మాత్రమే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్స్ వచ్చాయన్నారు. ఎస్సీ, బీసీ, గిరిజన కార్పొరేషన్ నుంచి సాయం శూన్యం ఎస్సీ, బీసీ, గిరిజన కార్పొరేషన్ల నుంచి అర్హులకు ఎలాంటి సాయం అందించారో చెప్పాలని సబంధిత అధికారులను జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించగా... యాక్షన్ ప్లాన్ వచ్చిందే తప్ప ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందించాలని గైడ్‌లైన్స్ రాలేదని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారని, వారికి అండగా స్వయం ఉపాధి కోసం రుణాలు అందజేసేందుకు ప్రభుత్వం చొరవ చూపకపోవడంపై జెడ్పీ చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి యువతను ఆదుకునేలా చూడాలన్నారు. ● ఆర్‌డబ్ల్యూస్ అధికారులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన అసంపూర్తిగా ఉన్న జల్‌జీవన్‌మిషన్ (జేజేఎం) పనుల్లో కొన్నింటిని రద్దుచేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందన్నారు. ఇప్పటివరకు నూతన పనులు ప్రారంభించలేదని, పాతవాటిని పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, రెండు జిల్లాల జెడ్పీటీసీలు, అధికారులు, కమిటీ మెంబర్లు, జెడ్పీ సిబ్బంది పాల్గొన్నారు. రైతులను ఆదుకోండి ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం వల్ల పంటలను నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. ధాన్యం తడిసిపోయినా ఎలాంటి పరిహారం అందజేయకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. పంట నష్టం వివరాలు నమోదు చేయాలని కోరారు. గజపతినగరం జెడ్పీటీసీ సభ్యుడు గార తవుడు మాట్లాడుతూ గ్రామాల్లో మినీ గోకులాలను అధికార పార్టీ నేతలు చెప్పినవారికే ఇస్తున్నారని, వాటి నిబంధనలు ఏమిటో, ఎవరు అర్హులో తెలియజేయాలని కోరారు. దీనిపై అధికారులు స్పందిస్తూ అనర్హులకు మంజూరు చేసినట్టు మా దృష్టికి తెస్తే పరిశీలించి రద్దుచేస్తామన్నారు. ఆవులకు బీమా చేసిన వారికి మాత్రమే గోకులాలు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా వరి, మొక్కజొన్న పంటలకు కేవలం ఆరువేల మంది రైతులే బీమా ప్రీమియం చెల్లించినట్టు జామి జెడ్పీటీసీ సభ్యురాలు గొర్లె సరయు ప్రశ్నకు వ్యవసాయ అధికారులు సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం అమలుచేసి రైతులకు ప్రయోజనం కల్పించిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రయోజనాన్ని తొలగించడంపై పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. పెన్షన్ల తొలగింపుపై స్పష్టత ఇవ్వండి తుఫాన్ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఎస్సీ, ఎస్టీ, గిరిజన కార్పొరేషన్ల నుంచి కానరాని భరోసా జెడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో పలు అంశాలను చర్చించిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనువాసరావు -
రూ.15,485 కోట్ల విద్యుత్ భారం...
విజయనగరం: ప్రజలపై విద్యుత్ చార్జీల మోతకు నిరసనగా వైఎస్సార్సీపీ సమరశంఖం పూరించింది. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం.. వినియోగదారులే విద్యుత్ ఉత్పత్తి చేసి డిస్కింలకు అమ్ముకునేలా ప్రోత్సహిస్తాం, ప్రజలకు చార్జీల నుంచి ఉపశమనం కలిగిస్తాం అంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోరుబాటకు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్లను ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకుని నేడు వంచనకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై చేపడుతున్న పోరుబాటలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆ రోజు నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టి పెంచిన విద్యుత్ చార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్‌శాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. ● రైతులను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదు... దేశానికి వెన్నెముకగా చెప్పుకునే రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కూటమి సర్కారు రైతులను ఆదుకునే విషయంలో అన్ని రంగాల్లో విఫలం చెందిందని మండిపడ్డారు. ఖరీఫ్ సాగుకు అవసరమయ్యే పెట్టుబడి సాయం అందించకపోగా... ఎరువులు, విత్తనాలు బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసుకునే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఇంటికి చేరాల్సిన పంట సైతం నీటి పాలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరితో పాటు మొక్కజొన్న, వేరుశనగ, పెసలు, మినుములు వంటి అపరాలు వర్షాలకు పాడైపోవడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతున్నారని తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పంట నష్టపోతే ఉచితంగా ఇన్సూరెన్స్ చేసి పంటకు తగిన నష్టపరిహారం చెల్లిస్తే కూటమి సర్కారు ఆ దిశగా ఆలోచన చేయకపోవడం అన్యాయమన్నారు. కనీ సం పంట నష్టం అంచనాలు వేయడంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 3.50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లా అధికారులు సేకరించారన్నారు. ప్రస్తుతం వర్షాలకు తడిచిన ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీలు వర్రి నర్సింహమూర్తి, గార తవుడు, కొప్పలవెలమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సంగంరెడ్డి బంగారునాయుడు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టివీరవెంకట రాజేశ్వరరావు, పార్టీ నాయకులు సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్ చార్జీల రూపంలో ఏకంగా రూ.15,485 కోట్ల భారాన్ని రాష్ట్రప్రజలపై మోపిందని మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన చంద్రబాదుడుగా మారిందని దుయ్యబాట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు విఫలమైందని తూర్పారబట్టారు. ప్రజలకు ఇస్తామన్న సూపర్ సిక్స్ హమీలు ఊసేలేదని ఆరోపించారు. చంద్రబాబుకు అబద్ధపు హమీలు ఇచ్చి ప్రజలను మోసగించటం వెన్నతో పెట్టిన విద్యగా పేర్కొన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద, మద్యతరగతి ప్రజలు ఆర్థికంగా కుదేలవుతుంటే.. కరెంట్ చార్జీలు కూడా పెంచి వారి నడ్డి విరిస్తున్నారని విమర్శించారు. మొదటి విడతలో రూ.6072 కోట్లు, రెండవ విడతలో రూ.9412 కోట్లు విద్యుత్ భారం మోపారని చెప్పారు. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ హయాంలో రూ.4.85 ఉన్న యూనిట్ ధరను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.2.69 కు తగ్గించిందన్నారు. -
విత్తన డీలర్లపై కేసుల నమోదు
విజయనగరం ఫోర్ట్: పంట దిగుబడికి విత్తనమే మూలం. నాణ్యత లేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. రైతులు నష్టపోతారు. ఏటా వ్యవసాయ శాఖ అధికారులు విత్తన, ఎరువులు, పురుగుమందులు శాంపిల్స్ సేకరించి, నాణ్యత లేనివిగా తేలితే కేసులు నమోదు చేస్తారు. 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కూడా పలువురు డీలర్లపై కేసులు నమోదు చేశారు. 488 విత్తన శాంపిల్స్‌ను వ్యవసాయ అధికారులు సేకరించగా వాటిలో ఆరు విత్తన శాంపిల్స్ నాసిరకమైనవిగా నిర్ధారణ అయ్యాయి. వేపాడ, విజయనగరం, గరివిడి, జామి మండలాల్లో ఒక్కో డీలర్‌పైన, రాజాంలో ఇద్దరిపైనా కేసులు నమోదుచేశారు. 304 ఎరువుల శాంపిల్స్ సేకరించగా, దత్తిరాజేరు మండలంలో సేకరించిన శాంపిల్స్ నాణ్యత లేనిదిగా నిర్ధారించారు. సంబంధిత డీలర్‌పై కేసు నమోదు చేశారు. పురుగు మందుల శాంపిల్స్ 147 సేకరించగా, గరివిడి మండలంలో సేకరించిన శాంపిల్ నాణ్యత లేదని నిర్ధారణ అయింది. దీంతో సంబంధిత డీలర్‌పై కేసు నమోదు చేశారు. -
క్రీస్తు మార్గం అనుసరణీయం
విజయనగరం అర్బన్: ఏసు క్రీస్తు ప్రబోధించిన ప్రేమ, కరుణ, సహనం, దయ, త్యాగ గుణాలు సర్వమానవాళికి అనుసరణీయమని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ఈ సుగుణాలను ప్రతి ఒక్కరూ అలవాటు చేసు కుని జీవితాన్ని శాంతిమయం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధికారుల సంఘం కలెక్టర్‌ను కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపింది. బిషప్ డాక్టర్ సత్యరాజ్ క్రీస్తు సందేశాన్ని చదివి వినిపించి అందరికీ దీవెనలు అందజేశారు. కలెక్టర్ క్రిస్మస్ కేక్నుకట్చేసి జేసీ సేతు మాధవన్‌కు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, డీఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, సీపీఓ బాలాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రేమ, కరుణకు ప్రతిరూపం ఏసు విజయనగరం రూరల్: ప్రేమ, కరుణ, దయకు ప్రతిరూపం ఏసయ్యని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నా రు. ఏసు చూపిన మార్గం మానవాళికి అనుసరణీయమన్నారు. క్రైస్తవులకు మంగళవారం ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినతుల పరిష్కారంలో వెనుకంజలో ఉన్నాం ● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజయనగరం అర్బన్: రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన వినతుల పరిష్కారంలో జిల్లా వెనుకంజలో ఉందని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. కలెక్టర్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినతుల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఇకపై ప్రతి రోజూ సాయంత్రం రెవెన్యూ సదస్సులపై సమీక్ష నిర్వహించాలని జేసీకి సూచించారు. కార్యక్రమంలో జేసీ సేతు మాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి, తహసీల్దార్లు, డీటీలు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. జనవరిలో సామూహిక గృహప్రవేశం విజయనగరం అర్బన్: జనవరి మొదటి వారంలో సామూహిక గృహప్రవేశాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, జిల్లాలో వారంలోగా 1,492 గృహ నిర్మాణాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని గృహనిర్మాణ సంస్థ ఈఈ, డీఈ, ఏఈలతో గృహనిర్మాణాలపై మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సమీక్షించారు. వాటిని పూర్తి చేయించి ఆన్లైన్లో సమాచారాన్ని అప్లోడ్ చేయించాలన్నారు. సమావేశంలో గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కూర్మినాయుడు, ఈఈ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. నిరసన విజయనగరం అర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కించపరుస్తూ కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోము రాంబాబు ఖండించారు. తక్షణమే అమిత్‌షా తన పదవికి రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం బాలాజీ కూడలిలోని అంబేడ్కర్ విగ్ర హం వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బహజన సమాజ్ పార్టీ జిల్లా శాఖ సభ్యులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు పరీక్షా సమయం
ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. శాఖాపరమైన ఉన్నతాధికారుల సూచనలతో సంకల్ప్ కార్యక్రమం ప్రతి కళాశాలలో అమలయ్యేలా చర్యలు చేపడుతున్నాం. క్షేత్రస్థాయిలో జూనియర్ కళాశాలలను పర్యవేక్షించి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నాం. ప్రభుత్వ కళాశాలల్లో సరైన బోధన, శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణత పెంచేందుకు కృషి చేస్తున్నాం. – దుంగ మంజులవీణ, ఇంటర్మీడియట్ జిల్లా విద్యాఽధికారిణి ● శతశాతం ఫలితాల సాధనకు ‘సంకల్పం’ ● విడుదలైన పరీక్షల షెడ్యూల్.. మార్చిలో నిర్వహణ ● జిల్లాలో 84 కళాశాలల నుంచి 17,403 మంది పరీక్షలకు సంసిద్ధంపాలకొండ రూరల్: సగటు విద్యార్ధికి ఇంటర్మీడియట్ విద్య కీలక దశ. ఇక్కడే అధిక సంఖ్యలో విద్యార్థులు వెనుకబడి పోతుంటారు. ఈ పరిస్థితిని అధిగమించి ఉత్తమ ఫలితాల సాధనకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్యార్థుల హాజరుపెంపుతో పాటు వ్యక్తిగత ప్రమాణాలను పెంచేలా చర్యలకు ఉపక్రమించింది. ఈ విద్యా సంవత్సరం పార్వతీపురం మన్యం జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన 84 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 8968మంది, ద్వితీయ సంవత్సరం 8435 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటి నుంచి పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులు తప్పనిసరిగా కళాశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. గైర్హాజరవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని, ప్రతి విద్యార్ధిపై దృస్టి పెట్టాలని డీఐఈఓ జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. పాఠ్యాంశాల వారీగా.. ఇంటర్మీడియట్ పరీక్షలకు మూడు నెలల సమయం ఉండడంతో విద్యాశాఖాధికారులు పాఠ్యాంశాల వారీగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రస్తుత నెలలో పరీక్షలు నిర్వహించి ప్రతి విద్యార్థి స్థాయిని అంచనా వేయనున్నారు. వెనుకబడిన వారిని, ముందున్న వారితో సనూనం చేసేందుకు ప్రణాళిక రూపొందించుకుని రెండో నెలలపాటు ఈ విధానం అమలు చేయనున్నారు. ఇలా పబ్లిక్ పరీక్షల సమయం వరకు అందరూ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. శ్రద్ధగా చదువుకునేలా.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులను బృందాలుగా విభజించి, ఒక్కో బృందం బాధ్యతలను ఒక్కో అధ్యాపకుడితో అనుసంధానం చేశారు. విద్యార్థులు రోజూ కళాశాలకు వచ్చేలా, అన్ని పాఠ్యాంశాల్లో ఉత్తీర్ణత సాధించేలా చేయడం ఆ అధ్యాపకుడి బాధ్యతే. ఇందులో భాగంగా కళాశాలలోనే కాకుండా ఇంటికి వెళ్లిన తర్వాత చదువుకునేలా ఉదయం త్వరగా నిద్రలేచేలా చూస్తున్నారు. ఆ సమయంలో చదువుకుంటున్నారా లేదా అనే అంశాన్ని సెల్ ఫోన్ ద్వారా వాకాబు చేస్తున్నారు. స్థానికంగా ఉంటే నివాసాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురికాకుండా ఉండడంతో పాటు మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రతి కళాశాలలో ఒక అధ్యాపకుడిని కౌన్సిలర్‌గా నియమించారు. సంకల్ప్ కార్యక్రమం.. ప్రతి జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత పెంచేందుకు సంకల్ప్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో విద్యార్థులను వారి అభ్యసన సామర్థ్యం, అక్టోబర్‌లో నిర్వహించిన క్వార్టర్లీ పరీక్షల్లో మార్కుల ఆధారంగా 3 కేటగిరీలుగా విభజిస్తారు. మెరుగైన విద్యార్థులను ఎ కేటగిరీ, మధ్యస్థంగా ఉన్న వారిని బి కేటగిరీ, తక్కువ మార్కులు వచ్చిన వారిని సి కేటగిరీగా విభజిస్తారు. అర్ధ సంవత్సరం పరీక్షలు, ప్రీ ఫైనల్స్ పరీక్షల మార్కులను ఆధారంగా వారి కేటగిరీల్లో కూడా మార్పులు చేస్తారు. మధ్యాహ్నం 3గంటల నుంచి 5 గంటల వరకు ప్రత్యేకశిక్షణ తరగతులు నిర్వహిస్తారు. -
ప్రభుత్వ భూములను గుర్తించాలి
పార్వతీపురం: జిల్లాలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వ భూములను గుర్తించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో పలు వసతులు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున అందుకు అవసరమైన భూమిని మండలాల్లో గుర్తించాలని సూచించారు. 100 విద్యుత్ కనెక్షన్ల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో సోలార్ పవర్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని గుర్తించాలని చెప్పారు. గ్రామ పంచాయతీ భ భవనాల నిర్మాణానికి, ఫిష్ మార్కెట్ ఏర్పాటు, నగర వనాలు నెలకొల్పేందుకు, పారిశ్రామిక వాడల ఏర్పాటుకు అవసరైన స్థలాలను గుర్తించాలని స్పష్టం చేశారు. ఫిష్ హ్యాచరీస్ నిర్మాణానికి ఐదు హెక్టార్ల భూమి అవసరమని అభిప్రాయ పడ్డారు. అడంగల్‌ను సక్రమంగా నిర్వహించాలని కోరారు. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలపై పూర్తిస్థాయిలో విచారణ చేసి పరిష్కరించాలని స్పష్టం చేశారు. సమావేశంలో పార్వతీపురం, పాలకొండ సబ్కలెక్టర్లు అశుతోష్ శ్రీవాత్సవ, సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, డీఆర్ఓ కె.హేమలత తదితరులు పాల్గొన్నారు. -
16 తులాల బంగారు ఆభరణాలు చోరీ
విజయనగరం క్రైమ్: ఇంట్లో ఎవరూ లేనిసయంలో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ వమహిళ ఇంట్లో చొరబడి బీరువాలో ఉన్న 16 తులాల బంగారు ఆభరణాలను చోరీచేసింది. దీనికి సంబంధించి బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వన్‌టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం కాళీఘాట్ కాలనీలో నివసిస్తున్న కొట్టక్కి జగన్మోహనరావు మంగళవారం ఉదయం 11 గంటలకు టైలర్ వద్దకు బట్టలు కొలతకు వెళ్లి అక్కడ అరగంట ఉన్నారు. అదే సమయంలో భార్య వకులాదేవి ఇంటితలుపులు దగ్గరకు వేసి ఎదురుగా ఉన్న గాజులషాపుకు వెళ్లింది. ఇంతలో ఇంటి ఎదురుగా ఉన్న మటన్ షాపు నడుపుతున్న బేగం వకులాదేవి వద్దకు వచ్చి మీ ఇంట్లో ఒక ఆడమనిషి వెళ్లి తిరిగి వెళ్లిపోతోందని చెప్పారు. ఆమెను ఎందుకు వెళ్లావని నిలదీయడంతో ఆమె గాబరాపడుతూ వర్షం పడుతున్నందున వెళ్లానంటూ తన ఇద్దరు పిల్లలను పట్టుకుని నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఇంట్లోకి వెళ్లి బీరువాను పరిశీలించగా బీరువాలో ఉన్న నాలుగు తులాల కాసులపేరు, నాలుగు తులాల హారం, మూడు గోల్డ్ చైన్లు, చెవుదిద్దులు మూడు జతలు, రెండు గాజులు, ఐదు ఉంగరాలు, నెక్లెస్, బ్రాస్లెట్ ఇలా 16 తులాల వరకూ బంగారు ఆభరణాలు పోయినట్లు గుర్తించారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
పార్వతీపురం: వినియోగదారుల చట్టాలపై ప్రజలందరికీ అవగాహన ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వినియోగదారుల దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పౌరుడు చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థి దశనుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించేందుకు వినియోగదారుల క్లబ్‌లను నిర్వహిస్తున్నామన్నారు. పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ బాక్సుల్లోని తినుబండారాలు, రోడ్లపై బండ్ల వద్ద తయారయ్యే కలుషిత ఆహారా న్ని తినడం వల్ల క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ఆస్కారం ఉంటుందని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇటీవల సైబర్ క్రైం, ఈ–కామర్స్ మోసాలకు గురవుతున్నారని, దీనిపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా కళాశాల, పాఠశాల స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను, సర్టిఫికెట్లను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా మేలుకొలుపు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వినియోగదారులను చైతన్యపరిచే పలు సంస్థల వలంటీర్లను సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖల ప్రదర్శన స్టాల్స్‌ను తిలకించారు. కార్యక్రమంలో కేఆర్ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ టి.ధర్మ చంద్రారెడ్డి, వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి టి. జగన్మోహన్రావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి. శ్రీనివాసరావు, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ కె. రత్నరాజు, జిల్లా ఆహార తనిఖీ అధికారి ఎ.రామయ్య పాల్గొన్నారు. -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ113 శ్రీ196 శ్రీ206పుష్పాలంకరణలో పైడితల్లి అమ్మవారువిజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్‌లు శాస్త్రోక్తంగా నిత్య పూజాదికాలు చేశారు. అమ్మవారికి తీపిపదార్థాలు, పండ్లతో నివేదన చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెనుక ఉన్న వేప, రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. అధికసంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి, తరించారు. సీనియర్ మహిళల కబడ్డీలో పట్టణ విద్యార్థిని ప్రతిభవిజయనగరం అర్బన్: ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఇటీవల జరిగిన 71వ ఆంధ్ర సీనియర్ పురుషులు, మహిళల కబడ్డీ చాంపియన్‌షిప్‌లో విజయనగరం మహిళల జట్టు ద్వితీయస్థానం సాధించాయి. ఆ జట్టులో సత్య కళాశాల విద్యార్థిని బి.నీలిమ విజయంలో కీలకపాత్ర వహించింది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయిదేవమణి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విజేతను కళాశాల యాజమాన్యం అభినందించింది. 290 మద్యం బాటిల్స్ స్వాధీనంగుర్ల: మండలంలోని కోటగండ్రేడులో 290 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఒక వ్య క్తిని ఆరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై నారాయణ రావు మంగళవారం తెలిపారు. కోటగండ్రేడు సమీపంలో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని తనిఖీ చేయగా 290 మద్యం బాటిల్స్ పట్టుబడినట్లు ఎస్సై చెప్పారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్సై హెచ్చరించారు. మెంటాడలో 122 మద్యం బాటిల్స్మెంటాడ: అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తినుంచి 122 మద్యం సీసాలను పట్టుకున్నట్లు మెంటాడ ఎస్సై కె.సీతారాం తెలిపారు. ఈ మేరకు మండలంలోని అమరావలస నుంచి జయతి గ్రామం మధ్య టీవీఎస్ ఎక్సెల్ వాహనంతో 122 మద్యం సీసాలను తీసుకువెళ్తున్న వ్యక్తిని మంగళవారం అదుపులోకి తీసుకోవడంతో పాటు వ్యక్తి దగ్గర ఉన్న 122 మద్యం బాటిల్స్‌ను సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచామన్నారు. బొబ్బిలిలో 80 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు బొబ్బిలి: పట్టణంలోని మద్యం దుకాణం నుంచి అక్రమంగా మద్యం సీసాలను బెల్ట్ షాపులకు తరలిస్తుండగా ఎస్సై ఆర్.రమేష్ సిబ్బందితో దాడి చేసి ఓవ్యక్తిని మంగళవారం పట్టుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి 80 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి నిందితుడిని కోర్టుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతివిజయనగరం క్రైమ్: విజయనగరం, కోరుకొండ రైల్వేస్టేషన్ల మధ్య సారిక గ్రామసమీపంలో రైల్వేట్రాక్పక్కన అనుమానాస్పదరీతిలో మహిళ మృతి చెందినట్లు గుర్తించామని జీఆర్పీ ఎస్సై వి.బాలాజీరావు మంగళవారం తెలిపారు. మహిళ మృతదేహం పడి ఉన్నట్లు అందిన సమాచారంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా సుమారు 25 నుంచి 30 ఏళ్ల వయసు కలిగి, ఐదు అడుగుల రెండు అంగుళాల ఎత్తుకలిగి, ఛామనచాయ రంగు, తెలుపురంగుపై నలుపు రంగు పువ్వులు కలిగిన టాప్, నీలం రంగు ఫ్యాంట్ ధరించి ఉందన్నారు. అకస్మాత్తుగా రైల్లోంచి జారిపడిపోయిందా? ఇంకేమైనా జరిగి ఉంటుందా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించామని ఆచూకీ తెలిసిన వారు ఫోన్ 9490617089 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.