రోగనిరోధకశక్తి పెంపుదలతో వ్యాధులు దూరం
● త్వరలో దేశంలో ఇమ్యునో థెరపీ డ్రగ్స్
● వరల్డ్ అలెర్జీ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్
నెల్లిమర్ల/నెల్లిమర్ల రూరల్: ఇమ్యునో థెరపీ డ్రగ్స్‌తో శరీరం ఏ వ్యాధికి గురైనా దానిని అదుపు చేయడానికి అవకాశం ఉంటుందని వరల్డ్ అలెర్జీ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ అన్నారు. ఈ మేరకు బుధవారం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ మెడికల్ స్కిల్స్ అనే వర్క్‌షాపును వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ప్రశాంత కుమార్ మహంతి ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగేశ్వర్ మాట్లాడుతూ రానున్న కాలంలో వివిధ రకాల వ్యాధులకు మాత్రలు, ఇంజక్షన్లకు బదులుగా ఇమ్యూనో థెరపీ డ్రగ్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇతర దేశాల్లో ఆ విధానం ఇప్పటికే కొనసాగుతోందని తెలిపారు. ఇదిలా ఉండగా అనేక వ్యాధులను నియంత్రించాలంటే ఇమ్యూనో థెరపీ డ్రగ్స్ చికిత్స కీలక పాత్ర పోషించనుందని చెప్పారు. వ్యాధుల నియంత్రణ యాంటిజన్, యాంటిబాడీ ప్రతి చర్యలపై ఆధారపడి ఉంటుందన్నారు. అందువల్లనే కోవిడ్ సమయంలో యాంటిబాడీ కణాలు ఎక్కువగా చనిపోవడం వల్ల రోగనిరోధకశక్తి తగ్గి ఎక్కువ మంది మత్యువాతపడ్డారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇమ్యునాలజీకి ప్రాధాన్యం పెరిగిందని వివరించారు. అంతేకాకుండా మన దేశంలో వివిధ రకాల అలెర్జీలతో బాధపడుతున్న వారి సంఖ్య 35 శాతం ఉందని, వాటికి చికిత్సనందించే వైద్యులు మాత్రం దేశ వ్యాప్తంగా కేవలం 800 మంది మాత్రమే ఉన్నారన్నారు. త్వరలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం, వరల్డ్ అలెర్జీ ఫౌండేషన్ సంయుక్తంగా మెడికల్ స్పెషలిస్ట్ అసిస్టెంట్ ప్రోగ్రాం అనే కొత్త కోర్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రొపెసర్ శాంతమ్మ, రిజిస్ట్రార్ డాక్టర్ పి.పల్లవి, కన్వీనర్ ప్రొఫెసర్ ఎంఎల్‌ఎన్ ఆచార్యులు, డాక్టర్ చైతన్య, ఫోరెన్సిక్, అనస్థీషియా విద్యార్థులు పాల్గొన్నారు.


