
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ప్రజాస్వామ్యానికే కళంకం
● సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కేసులు అక్రమం, అన్యాయం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రజాస్వామ్యమనే సౌధానికి నాలుగో స్తంభమైన పత్రికలను అణచివేసేందుకు క్రిమినల్ కేసులు పెట్టడం కూటమి ప్రభుత్వ పాలనలో సర్వసాధారణమైపోయిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అన్నారు. సాక్షి ఎడిటర్ ఆర్ ధనుంజయ రెడ్డితో పాటు ఆరుగురు పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమంటే ప్రజాస్వామ్యానికే కళంకం అని విమర్శించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోనూ ఇటీవల సాక్షి, ప్రజాశక్తి రిపోర్టర్లపైనా ఇక్కడి మంత్రుల ప్రోద్బలంతో వారి అనుచరులు స్వల్ప కారణాలకే ఫిర్యాదు చేయడం, అవెంతవరకూ న్యాయసమ్మతమో కనీసం పరిశీలన లేకుండానే పోలీసులు అత్యుత్సాహంతో కేసులు నమోదు చేస్తున్నారని ప్రస్తావించారు. ఇప్పటికై నా ప్రభుత్వం తీరు మారకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పాత్రికేయులపై కేసులు భేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.