
ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య
● విశాఖపట్నంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఘటన
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన తీడ వేదాంత కార్తికేయ(16) విశాఖపట్నంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి ఆత్మహత్య ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఈనెల 7న విద్యార్థి కార్తికేయ ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం కోసం విశాఖపట్నంలోని శ్రీచైతన్య కళాశాలలో జాయిన్ అయ్యాడు. ఈ క్రమంలో విద్యార్థి నాలుగు రోజులుగా అసౌకర్యంగా ఉండడంతో కళాశాల యాజమాన్యం నుంచి తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఈ మేరకు తల్లిదండ్రులు అచ్యుతరావు, పార్వతి మంగళవారం కళాశాల హాస్టల్‌కు వెళ్లి విద్యార్థితో మాట్లాడారు. తరువాత విద్యార్థిని హాస్టల్‌లో ఉంచి ఇంటికి వెళ్లిపోయారు. మళ్లీ బుధవారం ఉదయం కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్ చేసి కార్తికేయ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందించగా తల్లిదండ్రులు కుమారుడి వద్దకు వెళ్లి కన్నీరుమున్నీరుగా విలపించారు.