
జిల్లాలో న్యాయ సేవలు సంతృప్తికరం
● జిల్లా జడ్జి సాయి కల్యాణ్ చక్రవర్తి
బొబ్బిలి: జిల్లాలో న్యాయమూర్తిగా అందజేసిన సేవలు తనకు సంతృప్తినిచ్చాయని జిల్లా జడ్జి బి.సాయికల్యాణ్ చక్రవర్తి అన్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక కోర్టులో న్యాయమూర్తులు, న్యాయవాదులు జడ్జి సాయి కల్యాణ్ చక్రవర్తి దంపతులను ఘనంగా సత్కరించారు. శాఖాపరమైన బదిలీలో భాగంగా గుంటూరు జిల్లా జడ్జిగా వెళ్తున్నందున ఆయనను సత్కరించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.మోహన్ మురళీ కుమార్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు సీనియర్ న్యాయమూర్తి దామోదర రావు, స్థానిక సీనియర్ సివిల్ జడ్జి ఎస్.అరుణశ్రీ, ఏజేఎఫ్‌సీఎం రోహిణీరావు, న్యాయవాదులు కొల్లి సింహాచలం, ఎం.బెనర్జీ, ఎ.రామకృష్ణ, ఎం.సింహాచలం, డి.లక్ష్మి దీపవల్లి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు సీజ్
బొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామం వద్ద వేగావతి నదిలో ఇసుకను తవ్వి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆర్‌డీఓ జేవీవీ రామ్మోహనరావు బుధవారం సీజ్ చేశారు. బొబ్బిలి నుంచి విజయనగరం వెళ్తున్న ఆయన వేగావతి నదిలో ఇసుకను లోడ్ చేస్తుండగా గమనించి ట్రాక్టర్ డ్రైవర్లను తవ్వకాలపై ప్రశ్నించారు. ఎక్కడికి తరలిస్తున్నారని ,అనుమతులు, పర్మిట్లు ఉన్నాయా అని ఆరాతీసిన ఆర్డీఓకు అవేమీ లేవని బొబ్బిలికి తరలిస్తున్నామని డ్రైవర్లు తెలపగా వెంటనే రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేయాలని తహసీల్దార్ శ్రీనుకు ఆర్డీఓ ఆదేశాలు జారీచేశారు.
ఎస్సైపై దాడికేసులో వ్యక్తి అరెస్టు
రాజాం సిటీ: సంతకవిటి ఎస్సైపై దాడిచేసి ఘటనలో నిందితుడిని అరెస్టు చేశామని రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 13న సంతకవిటి మండలం జావాం గ్రామదేవత పగడాలమ్మ జాతర నిర్వహించారు. ఈ జాతరలో మద్దూరుశంకరపేట, జావాం గ్రామాల యువకుల మధ్య కొట్లాట జరిగింది. ఈ కొట్లాటను నివారించే క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్సై ఆర్.గోపాలరావుపై మద్దూరుశంకరపేట గ్రామానికి చెందిన యడ్ల రమణ దాడిచేసి మెడలో రెండు తులాల బంగారు చైను తీసుకుపోయాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసి నిందితుడిని మద్దూరుశంకరపేట గ్రామంలో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామని సీఐ చెప్పారు. సమావేశంలో ఎస్సై ఆర్.గోపాలరావు, హెచ్‌సీ ప్రసాదరావు, పీసీ కృష్ణ తదితరులు ఉన్నారు.

జిల్లాలో న్యాయ సేవలు సంతృప్తికరం

జిల్లాలో న్యాయ సేవలు సంతృప్తికరం