
మెప్మా ఆర్పీల ఆందోళన
బొబ్బిలి: మెప్మా ఆర్పీలు బొబ్బిలిలో గురువారం ఆందోళనకు దిగారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ శాఖ పీడీ చిట్టిరాజుకు వివరించారు. కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్నా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపకపోవడంపై మండిపడ్డారు. నెలకు ఇచ్చే రూ.8వేలు వేతనం ఖాతాలకు జమచేయకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. శ్రమకు తగిన వేతనం ఇవ్వడంలేదంటూ వాపోయారు. గిన్నిస్ బుక్ రికార్డులో పేరు నమోదుకోసం వేలాది రూపాయల ఖర్చుతో మహిళాభివృద్ధి కార్యక్రమాలు, ఉత్పత్తుల ప్రదర్శనలను నిర్వహించి మెప్నా డీఎం ఏర్పాటుచేసిన యాప్‌లో నమోదు చేశామన్నారు. వాటికి పైసా డబ్బులు ఇవ్వలేదన్నారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలంటూ బొబ్బిలి మున్సిపాలిటీలోని మెప్మా కార్యాలయంలో పీడీకి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడంపై మండిపాటు
కనీస వేతనాలు చెల్లించాలంటూ
మెప్మా పీడీకి వినతి
ఆర్పీల ప్రధాన డిమాండ్లు ఇవే..
ఉద్యోగ భద్రత కల్పించాలి.
కనీస వేతనం నెలకు రూ.18,600 చెల్లించాలి.
ఇరవయ్యేళ్ల సీనియార్టీ ఉన్న ఆర్పీలను సీఓలుగా ప్రమోట్ చేయాలి.