
గురువారం రాత్రి నుంచి లేఆఫ్ ప్రకటించిన యాజమాన్యం
విద్యుత్ చార్జీలు, ముడిసరుకు ధరలు పెరగడమే కారణం
రోడ్డున పడిన 450 కుటుంబాలు
ఆందోళనకు దిగిన కార్మికులు.. చెదరగొట్టిన పోలీసులు
కొత్తవలస: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నపాలెం సమీపంలోని జిందాల్ స్టెయిన్‌లెస్ స్టీల్ కర్మాగారం గురువారం అర్ధరాత్రి లేఆఫ్ ప్రకటించింది. విద్యుత్ చార్జీలు, ముడిసరుకు ధరలు పెరగడమే దీనికి కారణమంటూ నోటీస్‌లో పేర్కొంది. కూటమి పాలనలోకి వచ్చిన ఏడాదిలోనే రెండోసారి కర్మాగారం మూతపడింది. గతేడాది మే 17న మూసివేసిన పరిశ్రమను కార్మికుల ఆందోళనతో ఆగస్టులో తెరిచారు. ఇప్పుడు మళ్లీ మూతపడింది. పని కోసం శుక్రవారం తెల్లవారుజూమున వెళ్లిన కార్మికులు కంపెనీకి లేఆఫ్ ప్రకటించినట్టు అతికించిన నోటీస్‌ను చూసి కంగుతిన్నారు.
అరకు–విశాఖ రోడ్డుపై బైఠాయింపు
కర్మాగారానికి లేఆఫ్ ప్రకటించారన్న వార్తతో కార్మికులు ఆందోళనకు గురై కర్మాగారం వద్దకు చేరుకున్నారు. అరకు–విశాఖ రోడ్డుపై బైఠాయించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్మాగారాన్ని వెంటనే తెరిపించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కొత్తవలస సీఐ సీహెచ్ షణ్ముఖరావు ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు కర్మాగారం వద్దకు చేరుకుని ఆందోళన కారులను చెదరగొట్టారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బలగాలను మోహరించారు.
ఆవేదనలో కార్మికలోకం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచీ రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. కర్మాగారాలకు గత ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ రాయితీలను ప్రస్తుతం నిలిపివేయడంతో బిల్లుల భారం భరించలేకపోతున్నాయి. దీంతో మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. జిందాల్ స్టీల్స్‌ను ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూస్తారో తెలియక కార్మికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కర్మాగారంలో రెగ్యులర్ కార్మికులు 57 మంది, కాంట్రాక్టు పద్ధతిలో 247 మంది, ఇతర విభాగాల్లో మరో వందమంది వరకు విధులు నిర్వహిస్తున్నారు.
కర్మాగారం మూతపడడంతో వీరి కుటుంబాలు వీధినపడ్డాయి. ఈ కర్మాగారాన్ని 1987 ఆగస్టు 31వ తేదీన ప్రారంభించారు. నాటినుంచి నేటి వరకు 8 పర్యాయాలు కర్మాగారానికి యాజమాన్యం తాళాలు వేసింది. తాజా లేఆఫ్ నేపథ్యంలో యాజమాన్యంతో తాడోపేడో తేల్చుకునేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు. శనివారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు.