
అన్నీ బొంకులే..!
బంకుల్లో
● పెట్రోల్ బంకుల్లో కానరాని సౌకర్యాలు ● జిల్లావ్యాప్తంగా 44 చోట్ల ఏర్పాటు ● అందుబాటులో లేని మరుగుదొడ్లు, ప్రథమ చికిత్సకిట్లు, తాగునీరు ● ఆపద సమయాల్లో లేని ఫోన్ సౌకర్యం, నాణ్యత తనిఖీ పరికరాలు, ఫిర్యాదుల పెట్టె ● మరమ్మతుల బారిన గాలియంత్రాలు
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లావ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో యాజమాన్యాలు ఇష్టానుసారం వ్యవహరిస్తూ వినియోగదారులకు అందించాల్సిన సేవలను అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. తమను ఎవరూ ప్రశ్నించరనే భావనతో వారు వ్యవహరిస్తున్న తీరు కానరాని సౌకర్యాల పట్ల తేటతెల్లమవుతోంది. బంకుల్లో నిబంధనల మేరకు ఏర్పాటు చేయాల్సిన మౌలిక సదుపాయాలు దాదాపు ఏ బంకులోనూ కానరావడం లేదు. వాటిని విధిగా పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీ చేయాల్సి ఉన్నప్పటికీ మొక్కుబడిగా ఒకటి రెండు బంకులను తనిఖీ చేసి మమ అనిపించేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి ట్యాక్స్‌లను వసూలు చేస్తున్న యాజ మాన్యాలు సౌకర్యాలు కల్పించడంలో తాత్సారం వహిస్తున్నాయి. వినియోగదారులకు అందాల్సిన సేవలు అందకపోవడంతో యాజమాన్యాలు ట్యాక్స్ లను అప్పనంగా వసూలు చేసి వినియోగదారులకు సేవలు దూరం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో హెచ్‌పీ, బీహెచ్‌పీఎల్, ఇండియన్ ఆయిల్, నయారా సంస్థలకు సంబంధించి 44 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటిని ఆయా ప్రాంతాల్లోని యాజమాన్యాలు నిర్వహిస్తున్నాయి.
ఈ సౌకర్యాలు ఉండాలి
స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రథమ చికిత్స కిట్లు, ఉచితంగా గాలినింపే యంత్రాలు, ఆపద వేళ సమాచారం ఇచ్చేందుకు ఫోన్, నాణ్యత తనిఖీ చేసే బ్లాటింగ్ పేపర్లు, ఫిర్యాదుల పెట్టె తదితరమైన సౌకర్యాలు పెట్రోల్ బంకుల్లో ఉండాలి.
అలంకరణకే..
పెట్రోల్ బంకుల్లో ఎక్కడ చూసినా గాలినింపే యంత్రాలు మరమ్మతుల బారిన పడి నిరుపయోగంగా దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. మరికొన్ని బంకుల్లో తాగునీరు సౌకర్యం ఏర్పాటు కానరావడం లేదు. పెట్రోల్, డీజిల్ కోసం వచ్చే వాహనదారులు టైర్లలో గాలి నింపమని సిబ్బందిని అడిగితే పనిచేయడం లేదని బదులిస్తున్నారు.
మరుగుదొడ్లకు తాళాలు
బంకుల్లో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లకు తాళం వేసి అందుబాటులో లేకుండా చేస్తున్నారు. కేవలం సిబ్బంది మాత్రమే ఉపయోగించుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల కనీస స్థాయిలో మూత్రశాలలు పరిశుభ్రత లేకుండా అధ్వానంగా, అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి.
కానరాని ప్రథమ చికిత్స కిట్లు
ప్రథమ చికిత్స కిట్లు ఏ చోట కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కొన్ని చోట్ల పెట్టెమాత్రమే ఉండి లోపల ఔషధాలు, ప్రథమ చికిత్స పరికరాలు కనిపించడం లేదు. అలాగే వినియోగదారులకు ఫిర్యాదుల పెట్టె, నాణ్యత తనిఖీకి కావాల్సిన పరికరాలు అత్యవసర సమయాల్లో సమాచారం ఇచ్చేందుకు ఫోన్ సౌకర్యం వంటివి కనిపించడం లేదు.
మా దృష్టికి వస్తే సమస్య పరిష్కారం
బంకుల్లో అందాల్సిన సేవలపై కానీ యాజమాన్యం వినియోగదారుల పట్ల వ్యవహరిస్తున్న శైలిపై కానీ ఫిర్యాదులు వస్తే సంబంధిత బంకు యాజమాన్యంపై చర్యలు చేపడతాం. పార్వతీపురం మన్యం జిల్లాకు సివిల్ సప్‌లైస్ జీఎంగా కొద్దిరోజుల క్రితం బాధ్యతలు స్వీకరించాను. సిబ్బందితో సమన్వయం చేసుకుని బంకుల్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలపై తనిఖీ చేసి అవసరమైన చర్యలు తీసుకుంటాం.
– ఐ.రాజేశ్వరి, జీఎం సివిల్ సప్‌లైస్,
పార్వతీపురం మన్యం జిల్లా

అన్నీ బొంకులే..!

అన్నీ బొంకులే..!