
నోటిఫికేషన్ ఇచ్చారు... పోస్టుల భర్తీ మరిచారు..!
విజయనగరం ఫోర్ట్:
అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని గొప్పలు చెప్పిన కూటమి నేతలు... ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారు. చిరుద్యోగులకు వేదన మిగుల్చుతున్నారు. మరోవైపు నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టుల భర్తీలోనూ నెలల తరబడి జాప్యం చేస్తున్నారు. పోస్టులను భర్తీ చేస్తారా, లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఐసీడీఎస్ పరిధిలోని డీసీపీయూ, శిశుగృహ, చిల్డ్రన్ హోమ్‌లలో పోస్టుల భర్తీకి 2023 నవంబర్ 20వ తేదీన అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. పోస్టుల భర్తీ పక్రియ చేపడుతున్న తరుణంలో ఎన్నికలకోడ్ రావడంతో భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కా రు పాత నోటిఫికేషన్‌ను రద్దుచేసి 2024 సెప్టెంబర్ 4న కొత్తగా 23 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో కాంట్రాక్టు పద్ధతిన భర్తీచేసే పోస్టులు 5, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేవి 9, పార్ట్‌టైమ్ పోస్టులు 9 ఉన్నాయి. వీటికోసం 640 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా పోస్టుల భర్తీకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదే అంశంపై ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం మాట్లాడుతూ కొద్ది రోజుల కిందటే పీడీగా బాధ్యతలు స్వీకరించానని, పోస్టుల భర్తీ పక్రియపై ఆరా తీసి భర్తీకి చర్యలు తీసుకుంటానన్నారు.
శిశుగృహ, బాలసదన్‌లలో పోస్టుల భర్తీకి
2024 సెప్టెంబర్‌లో నోటిఫికేషన్
23 పోస్టులకు 640 మంది అభ్యర్థులు దరఖాస్తు
ఇప్పటికీ భర్తీ చేయని వైనం

నోటిఫికేషన్ ఇచ్చారు... పోస్టుల భర్తీ మరిచారు..!