
ఆయుర్వేద వైద్యశాలలో మందుల కొరత
● ప్రైవేట్ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్న రోగులు
విజయనగరం ఫోర్ట్: ● గంట్యాడ మండలానికి చెందిన వి. నారంనాయుడు మోకాళ్ల నొప్పులతో విజయనగరంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు కొద్ది రోజుల క్రితం వెళ్లాడు. అక్కడ మందులు లేక పోవడంతో ప్రైవేట్ ఆయుర్వేద ముందుల దుకాణంలో కొనుగోలు చేశాడు.
● విజయనగరం మండలానికి చెందిన పి.లక్ష్మి చర్మ సంబంధిత వ్యాధితో విజయనగరంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు వెళ్లగా అక్కడి వైద్యుడు రాసిన మందులు లేకపోవడంతో ప్రైవేట్ ఆయుర్వేద మందుల దుకాణంలో మందులు కొనుగోలు చేసింది.
వీరిద్దరే కాదు. అనేక మంది రోగులకు ఎదురువుతున్న పరిస్థితి ఇదే. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని. ప్రజారోగ్యానికి కోట్లాది రుపాయలు ఖర్చు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అల్లోపతి వైద్యం తర్వాత ఆయుర్వేద వైద్యానికి అంత ప్రాధాన్యం ఉంది. అయితే ప్రస్తుతం ఆయుర్వేద వైద్యశాలలో మందులు లేక పోవడంతో వైద్యం కోసం వచ్చిన వారు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి.
సాధారణ వ్యాధులకు కూడా లేని మందులు
ఆయుర్వేద వైద్యశాలలో సొరియాసిస్, మధుమేహం, కీళ్లనొప్పులు, గైనిక్ సమస్యలు, జీర్ణ కోశ వ్యాధులు, మూత్ర వ్యాధులు, న్యూరాలజికల్ సమస్యలు, గుండెజబ్బులు, రుమటైడ్ ఆర్థరైటిస్, శ్వాసకోశసమస్యలకు సంబంధించిన మందులు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ప్రస్తుతం లేవు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వైద్యుడికి చూపించిన తర్వాత మందుల గది వద్దకు వెళ్లిన రోగులకు అక్కడ మందులు లేక పోవడంతో ప్రైవేట్ మందుల దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. కొంత కాలంగా ఇదే పరిస్థితి ఉంది.
ఇండెంట్ పెట్టాం
చాలావరకు మందులు అయిపోయాయి. మందులు పంపించాలని ఇండింట్ పెట్టాం. ఇంకా రాలేదు.
ఎం.ఆనంద్‌రావు, వైద్యాధికారి,
ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల

ఆయుర్వేద వైద్యశాలలో మందుల కొరత

ఆయుర్వేద వైద్యశాలలో మందుల కొరత