
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి
విజయనగరం గంటస్తంభం: కూటమి ప్రభుత్వం వివిధ రకాల కారణాల చెబుతూ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం చేయడం తగదని డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్ హరీష్ అన్నారు. కోట జంక్షన్ వద్ద విలేకరులతో మంగళవారం మాట్లాడుతూ.... రాష్ట్ర వాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమా ణ స్వీకారం సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై తొలిసంతకం చేశారన్నారు. నేటికీ నోటిఫికేషన్ వెలువడలేదని, నోటిఫికేషన్ రాక లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు వెచ్చించి శిక్షణ తీసుకుంటూ తీవ్ర నిరాశకు గురువుతున్నారన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రోజుకో ప్రకటన చేస్తూ విద్యార్థిలోకాన్ని అయోమ యానికి గురిచేస్తున్నారన్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక, అసలు వస్తుందో రాదో అన్న పరిస్థితిలో పలువురు అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు గురుజాడ గ్రంథాలయంలో ఈనెల 17వ తేదీన జరగబోయే సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంతోష్, రాము, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం చేయొద్దు
దత్తిరాజేరు: వైద్యసేవల్లో నిర్లక్ష్యం చేయొద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఎస్.జీవనరాణి దత్తిరాజేరు పీహెచ్‌సీ సిబ్బందికి సూచించారు. ఆస్పత్రిని ఆమె సోమవారం పరిశీలించారు. మందులు నిల్వ చేయడంలో ఫార్మసిస్టు నిర్లక్ష్యం చేయడంపై ప్రశ్నించారు. ఆస్పత్రిలో మెరుగైన ప్రసవ సేవలు అందించాలని వైద్యాధికారి సతీష్‌కు సూచించారు. గర్భిణులకు నెలవారీ తనిఖీలు చేయాలన్నారు.
వెబ్ సైట్‌లో
టీచర్ల సీనియార్టీ జాబితా
విజయనగరం అర్బన్: జిల్లాలోని ఉపాధ్యాయుల సమాచార వ్యవస్థ (టీఐఎస్) ఆధారంగా తయారు చేసిన వివిధ కేడర్ టీచర్ల సీనియార్టీ జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై ఇప్పటికే రెండు సార్లు అభ్యంతరాలను స్వీకరించామని, మరో అవకాశం ఇస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ జోన్–1 పరిధిలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల గ్రేడ్–2 పదోన్నతులతో పాటు సెకెండరీ గ్రేడ్ టీచర్ల నుంచి స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల పదోన్నతులకు అవసరమైన సీనియార్టీ జాబితాను ‘ఆర్‌జేడీఎస్‌ఈవీఎస్‌పీ.కాం’ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. జాబితాపై ఎలాంటి అభ్యంతరాలున్నా ఈ నెల 17వ తేదీలోగా జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఆధారాలతో సమర్పించుకోవాలని కోరారు. గడువు తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేదిలేదన్నారు.