
గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు.. గ్రీన్‌సిగ్నల్
గ్రేహౌండ్స్ పోలీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కేటాయించిన భూములు
కొత్తవలస:
కొత్తవలస మండలంలోని రెల్లి రెవెన్యూ పరిధి అప్పన్నదొరపాలెం గ్రామ సమీపంలో రాష్ట్ర హోంశాఖ ఆధ్వర్యంలో గ్రేహౌండ్స్ పోలీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గిరిజన వర్సిటీ కోసం గతంలో గిరిజనుల నుంచి సేకరించిన భూముల్లో పోలీస్ శిక్షణ కళాశాల ఏర్పాటుకు ఆమోదముద్రవేసింది. ప్రభుత్వ నిర్ణయంపై అప్పన్నదొరపాలెం, జోడుమెరక, తమ్మన్నమెరక గ్రామాల గిరిజనులు పలువురు నిరసన తెలుపుతున్నారు. కనీసం తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా, 2017లో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా శిక్షణ కేంద్రంఏర్పాటుకు పూనుకోవడం తగదంటున్నారు. అప్పన్నదొరపాలెం గ్రామంలో మార్చి 20, 24వ తేదీల్లో విజయనగరం ఆర్డీఓ దాట్ల కీర్తి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సభలను ఏర్పాటుచేశారు. తమ పిల్లలకు ఉద్యోగాలు, చదువు అవకాశాలు కలుగుతాయన్న ఆశతో వర్సిటీకోసం అప్పట్లో భూములు ఇచ్చామని, భూమికి భూమి, ఇళ్ల స్థలాలు, యువతకు ఉపాధి తదితర ఏడు హామీల్లో నేతలు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని గిరిజనులు బహిరంగంగానే విమర్శించారు. శిక్షణ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకించారు. వందమంది పోలీస్‌లతో సభ నిర్వహించడాన్ని తప్పుబట్టారు. తాము ఉగ్రవాదులమా? అంటూ స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో పాటు అధికారులను నిలదీశారు. సభను బహిష్కరించారు.
ఇదీ పరిస్థితి...
2017 సంవత్సరంలో రెల్లి రెవెన్యూ పరిధిలోని అప్పన్నదొరపాలెం, జోడుమెరక, తమ్మన్నమెరక గ్రామాల సమీపంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సర్వేనంబర్ 1–8లో 527 ఎకరాల కొండపోరంబోకు, గెడ్డవాగు భూములతో కలిపి 178 గిరిజన కుటుంబాలకు చెందిన 144 ఎకరాల భూములను సేకరించారు. అప్పట్లో గిరిజనులకు 7 రకాల హామీలు ఇచ్చారు. కనీసం అందులో ఏ ఒక్క హామీని నెరవేర్ఛకుండా హడావిడిగా 2019 ఎన్నికలకు ముందు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంతో ఆందోళనకు దిగారు. వాటిని పట్టించుకోకుండా రూ.10 కోట్ల ఖర్చుతో కొంతమేర ప్రహరీని నిర్మించారు. అనంతరం 2019 లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం కేంద్ర ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ గిరిజన యూనివర్సిటీని సాలూరు–మెంటాడ మండలాల సమీపంలోని గిరిజన ప్రాంతానికి తరలించింది. వర్సిటీ పనులు అక్కడ శరవేగంగా సాగుతున్నాయి.
ఆందోళనలు చేసినా...
పోలీస్ శిక్షణ కేంద్రం వద్దని, తమ భూములు వెనుకకు ఇవ్వాలంటూ గిరిజనులు విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ప్రజావినతుల పరిష్కారవేదికలో అధికారులకు ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన అన్యా యా న్ని, అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ఏడు హామీలు నెరవేర్చని విషయాన్ని అధికారులకు వివరించారు. అయితే, ఇవేవీ పోలీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటు ను అడ్డుకోలేకపోయాయి. ప్రభుత్వం స్పందించి గిరిజనులకు న్యాయంచేయాలని, అప్పట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నారు.