
అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే కారణమా..?
ఇలా ఈ ముగ్గురే కాదు. జిల్లాలోని వందలాది మంది ప్రజలు
ఎన్ని ఆపసోపాలు పడినా..ఆధార్ కష్టాలు తీరేలా కనిపించడం లేదు. జిల్లాలోని ఏ సచివాలయానికి వెళ్లినా, ఎవరిని అడిగినా జిల్లా కేంద్రంలో పెదపోస్టాఫీసుకు, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయానికి వెళ్లండి, అక్కడైతేనే చేస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం జిల్లాలో సరైన ఆధార్ కేంద్రాలు లేకపోవడమేనని తెలుస్తోంది. గతప్రభుత్వం సచివాలయాల్లో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోక పోవడం, సచివాలయాల్లో సరైన పరికరాలు లేకపోవడం, పరికరాలు ఉన్నా సిబ్బంది అందుబాటులో లేకపోవడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో హెడ్‌్‌పోస్టాఫీసు, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆధార్ కేంద్రాల్లో వారం రోజులకు సరిపడా టోకెన్లు ముందుగానే బుక్ అవుతున్నాయి. దీంతో జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలకు నిరాశే మిగులుతోంది. ఒక రోజుకు వందటోకెన్లకు పైగా బుక్ అవుతున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
వేకువ జామునుంచే పడిగాపులు
హెడ్‌పోస్టాఫీసు, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాల్లో ఆధార్ మార్పుల కోసం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు వేకువ జామునుంచే టోకెన్ల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురువారం ఈ కార్యాలయాల వద్ద సుమారు 150మందికి పైగా ఒకేసారి వచ్చారు. టోకెన్లు ముందే బుక్ అయ్యాయని తెలియక పడిగాపులు కాశారు. ఈ విషయం ఆలస్యంగా అధికారులు చెప్పడంతో ఉసూరుమంటూ వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొందరు టోకెన్ల కోసం క్యూలో వేచి ఉన్నారు.
జిల్లాలో ఆధార్, సెంటర్లు ఏర్పాటు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీ సేవా కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో దాదాపు పదుల సంఖ్యలో బ్యాంకుల్లో ఆధార్ కేంద్రాలు ఉన్నా ఎక్కడా సేవలు అందించడం లేని తెలుస్తోంది. గతంలో సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిబ్బంది కొరత, పరికరాలను మూలపడేసిన కారణంగా మారుమూల గ్రామస్తులు జిల్లా కేంద్రంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్, హెడ్‌పోస్టాఫీసుకు రావాల్సిన దుస్థితి నెలకొంది.