
సత్తా చాటిన గిరిబాలలు
సీతంపేట: కార్పొరేట్ తరహా కళాశాలను తలదన్నేలా కనిపిస్తున్న ఈ భవనం మల్లి గిరిజన గురుకుల ప్రతిభా కళాశాల. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో దీన్ని అభివృద్ధి చేసి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ఈ సంవత్సరం విద్యార్థులు 99 శాతం ఫలితాలు సాధించారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 71 మంది హాజరు కాగా 70 మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 67 మంది విద్యార్థులు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణత సాధించారు.
● సీతంపేట బాలికల గురుకుల కళాశాలలో 163 మంది ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరు కాగా 160 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో 19 మంది పరీక్షలకు హాజరుకాగా అందరూ ఉత్తీర్ణత చెందారు. ద్వితీయ సంవత్సరంలో 165 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా అందరూ పాసయ్యారు. వృత్తివిద్యాకోర్సులో 25 మందికి 25మంది పాసయ్యారు. సీతంపేటలోని బాలురు గురుకులంలో 165 మంది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు హాజరు కాగా 159 మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 157 మందికి 153 పాసయ్యారు.
ఫలితం ఇచ్చిన మౌలిక సదుపాయాల కల్పన
విద్యార్థులకు గత ప్రభుత్వ హయాంలో సమకూర్చిన సౌకర్యాలు, స్టడీ మెటీరియల్, ప్రత్యేక తరగతులు, పూర్తిస్థాయిలో బోధన సిబ్బంది నియామకం వంటి చర్యలతో ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా మొదటిస్థానం సాధించిందని చెప్పవచ్చు. కేజీబీవీతో పాటు పలు కళాశాలల్లో నాడు–నేడు వంటి పనులు జరగడం విద్యార్థులకు చదువుకోవడానికి తగిన సదుపాయాలు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అప్పటి ప్రభుత్వం కల్పిండంతో పాటు అమ్మఒడి పేరుతో ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చెల్లించడం తదితర కారణాలతో గిరిజన విద్యార్థులు ఎక్కువగా ప్రభుత్వ కళాశాలల్లో చేరడానికి మొగ్గుచూపారు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాలల్లో అయితే పరిమితంగా ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ వంటి గ్రూపుల్లో 40 సీట్లు మాత్రమే ఉంటాయి. తమ పిల్లలకు రెసిడెన్షియల్ కళాశాలల్లో సీట్లు కావాలని తల్లిదండ్రులు ఐటీడీఏ పీఓకు మొరపెట్టుకోవడంతో ఆయన చొరవతో రెండు, మూడేళ్లుగా అదనంగా మరో 10 సీట్లు కూడా పెంచుతూ వచ్చారు. ఈ ఫలితాల్లో సీతంపేట ఐటీడీఏ పరిధిలో 11 మందికి పైగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 900లకు పైబడి మార్కులు సాధించారు. అలాగే 20 మందికి ఫస్టియర్‌లో 400లకు పైబడి మార్కులు వచ్చాయి.
ఇంటర్ ఫలితాల్లో అద్భుతం

సత్తా చాటిన గిరిబాలలు