
అటకెక్కుతున్న ఇటుక
● పడిపోయిన విక్రయాలు
● ముందుకు సాగని పరిశ్రమ
రాజాం: మట్టి ఇటుకల తయారీ పరిశ్రమ గతేడాది వరకూ మూడు ఇటుకలు ఆరు బట్టీలు అన్న చందంగా నడిచింది. రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో పుట్టగొడుగుల్లా ఇటుక పరిశ్రమలు పుట్టుకొచ్చేవి. ఒక్కో బట్టీ వద్ద నాలుగు నుంచి ఐదు కుటుంబాలు జీవనం సాగించేవి. ఏటా ఇటుకల ధరలు పెరుగుతూ వచ్చేవి. వేసవితో పాటు అన్ని కాలాల్లో వాటి సీజన్ నడిచేది. మట్టి ఆధారంగా ఈ ఇటుకలకు డిమాండ్ కూడా అధికంగా ఉండేది. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. కొంతకాలంగా ఇటుకల వ్యాపారం మందగించింది. ఇటుకలు కొనే నాథుడే కరువయ్యాడు. ఫలితంగా వాటి ధర పతనమైంది. నిర్మాణాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఇటీవల ఈ పరిశ్రమలు ఎత్తేసి, వేరే పనులకు కుటుంబాలు వలసపోతున్నాయి. వాటిని నమ్ముకుని పెట్టుబడి పెట్టిన వ్యాపారులు సొమ్ముచేసుకోలేక తంటాలు పడుతున్నారు.
అమాంతం పడిపోయిన ధర
గతంలో ట్రాక్టర్ (2000) ఇటుకల ధర రూ.10 వేలు ఉండేది. ఈ ధర ఆయా ఇటుక బట్టీల వద్ద పలికేది. రవాణా చార్జీలు అదనంగా రూ.1500లు నుంచి రూ.2500లు వరకూ ఉండేవి. రాజాం మండలంలోని పొగిరి, కొత్తపేట, పెనుబాక తదితర ప్రాంతాల్లో ఇటుకకు డిమాండ్ ఉండేది. రేగిడి మండలంలోని కుమ్మరి అగ్రహారం, తాటిపాడు, లక్ష్మణవలస, ఖండ్యాం ప్రాంతాల వద్ద ఇటుక తయారీ అధికంగా ఉండడంతో పాటు తరలింపు కూడా చాలా ఎక్కువగా ఉండేది. సంతకవిటి మండలంలోని రంగారాయపురం, మేడమర్తి, పోడలి, తాలాడ ప్రాంతాల్లో ఇటుక బట్టీలకు మంచి డిమాండ్ ఉండేది. ఇటుక ధరల్లో తగ్గేది లేదన్నట్లుగా వ్యాపారులు విక్రయాలు చేసేవారు. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఇటుక పరిశ్రమలు ముందుకు నడవడంలేదు. బట్టీల వద్ద ట్రాక్టర్ ఇటుక ధర ఒక్కసారిగా రూ.7,500లు, రూ.8వేలకు పడిపోయింది. కొన్ని పరిశ్రమల వద్ద ఇటుకలను కొనుగోలు చేయని పరిస్థితి ఉంది. నిర్మాణాలు మందగించడంతో ఇటుక పరిశ్రమల వద్ద ఇటుకలు అలానే దర్శనమిస్తున్నాయి. నెలల తరబడి ఇటుకల విక్రయాలు జరగకపోవడంతో వాటి నిమిత్తం పెట్టిన పెట్టుబడికి వడ్డీలు చెల్లించలేక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షాల కారణంగా ఇటుకబట్టీలు తడిసిముద్దవుతున్నాయి. లక్షలాది రూపాయల పెట్టుబడులతో పెట్టిన ఇటుకబట్టీలు వ్యాపారం లేక వెలవెలబోతుండగా, ఇటుక పరిశ్రమలు పెట్టిన వ్యాపారులు, రైతులు దివాలా తీసే పరిస్థితి కనిపిస్తోంది. రాజాం నియోజకవర్గంలో 210కి పైగా ఇటుక పరిశ్రమలు ఉన్నాయి.
ఇటుక బట్టీ నిలిపివేశాం
మండలంలోని అగ్రహారం వద్ద మాకు ఇటుకల బట్టీ ఉండేది. గత ఏడాదికాలంగా డిమాండ్ తగ్గిపోయింది. దీంతో చేసేదిలేక ఇబ్బందులు పడ్డాం. అప్పులకు వడ్డీలు చెల్లించలేక వేరే పనులు చేస్తూ అప్పులు తీర్చే ప్రయత్నాలు చేస్తున్నాం. కె. వెంకటరమణ,
ఇటుకల వ్యాపారి, అగ్రహారం, రేగిడి మండలం
పెట్టుబడి లేక నష్టపోతున్నాం
గతంలో ఇటుకలకు డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఈ డిమాండ్ లేదు. మండలంలోని ఓ గ్రామం వద్ద రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టి నాలుగు ఇటుకబట్టీలు పెట్టాం. పెట్టుబడికి వడ్డీలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.
ఎం.అప్పలనాయుడు,
ఇటుకల వ్యాపారి, రాజాం

అటకెక్కుతున్న ఇటుక