
పోలీసుల అదుపులో గంజాయి నిందితులు
బొబ్బిలి: ప్రశాంతమైన బొబ్బిలిలో యువత గంజాయికి అలవాటు పడ్డారు. ఈ విషయమై పోలీసులు పెట్టిన నిఘాలో కీలక ఆధారాలు బయటపడ్డాయి. దీంతో ఆ దిశగా విచారణచేసిన పోలీసులకు ముగ్గురు బీటెక్ విద్యార్థులు పట్టబడినట్లు తెలిసింది. వారు ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడి కాలేజీలో చదువుకుంటున్న వారుగా గుర్తించారు. పోలీసులు జరుపుతున్న విచారణలో మొత్తం ఏడుగురిని ప్రాథమికంగా గుర్తించి విక్రేతలు, కొనుగోలుదారులే కాకుండా సాగు చేస్తున్న వారి వివరాలు కూడా సేకరించినట్లు సమాచారం. మరో ముఖ్యమైన విషయమేమంటే పోలీసులు గుర్తించిన నిందితుల్లో సుమారు 70ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం గంజాయిని వినియోగిస్తూ, విక్రయిస్తున్న వారిలో ముగ్గురు విద్యార్థులపై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మక్కువ మండలంలోని కంచేడువలస, కొయ్యాన పేట గ్రామాలకు చెందిన లక్ష్మ ణరావు, కాంతారావులు బొబ్బిలి పట్టణానికి చెందిన యువకులకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయమై ఎస్సై ఆర్ రమేష్‌ను వివరణ కోరగా పట్టణంలో విక్రయిస్తూ గంజాయి కలిగి ఉన్న ముగ్గురు బీటెక్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిపై బుధవారమే కేసు నమోదు చేశామని, ప్రస్తుతం విచారణ జరుగుతోందని పూర్తిస్థాయిలో నిందితులను అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు. త్వరలో పూర్తివివరాలను వెల్లడిస్తామన్నారు.
వన్‌టౌన్ పోలీసుల అదుపులో
మరో ఇద్దరు..
విజయనగరం క్రైమ్: గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను విజయనగరం వన్‌టౌన్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన సమాచారం మేరకు..నగరంలోని గూడ్స్ షెడ్‌వద్ద వన్‌టౌన్ ఎస్సై ప్రసన్నకుమార్ వెహికల్స్ తనిఖీ చేస్తుండగా ఓ యువకుడు తాను డ్రైవ్ చేస్తున్న బైక్‌ను ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో అనుమానం వచ్చి మ్యాన్ ఫ్యాక్ ద్వారా యువకుడితో పాటు బైక్‌పై వెళ్తున్న మరో వ్యక్తిని పట్టుకుని విచారణ చేసి రెండు కేజీల గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. నగరంలోని శాంతినగర్‌కు చెందిన వాసుపల్లి విజయ్(19)ను మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని రెవెన్యూ అధికారుల సమక్షంలో తనిఖీ చేసి స్కూటీని, వారు తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను కోర్టుకు తరలించగా రిమాండ్ విఽధించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.
ఏడుగురిని గుర్తించి ముగ్గుర్ని
అదుపులోకి తీసుకున్న పోలీసులు