
డిజిటల్ అరెస్ట్ కేసులో ఏబీసీడీ అవార్డు
● డీజీపీ చేతుల మీదుగా అందుకున్న
వన్‌టౌన్ సీఐ
విజయనగరం క్రైమ్: విజయనగరం పోలీస్ సబ్ డివిజన్ పరిధి విజయనగరం వన్‌టౌన్ స్టేషన్ సీఐగా ఎనిమిది నెలల క్రితం చార్జ్ తీసుకున్న శ్రీనివాస్ ముంబై, పుణెలకు వెళ్లి మరీ నిందితులను పట్టుకున్నందుకు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా మంగళగిరిలో బుదవారం అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్‌ను అందుకున్నారు. వివిధ పోలీస్‌స్టేషన్‌లలో ప్రతి మూడు నెలలకోసారి పలు కేసుల ఛేదనలో స్థానిక స్టేషన్‌హౌస్ ఆఫీసర్లు చూపిన ప్రతిభను డీజీపీ ఆఫీస్ పరిశీలనలోకి తీసుకుంటుంది. అందులో భాగంగా గతేడాది దాదాపు కోటిన్నర పైగా డబ్బులు పొయాయని వన్‌టౌన్ పోలీసులు ఫిర్యాదు అందుకున్నారు. ఎస్పీ వకుల్ జిందల్ అదేశాలతో అప్పుడే విజయనగరం వన్‌టౌన్ పోలీసులు డిజిటల్ అరెస్ట్‌గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ కేసులో విజయనగరం వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్సై లక్ష్మీప్రసన్నకుమార్‌లు జమ్ము, ముంబై, పుణె ప్రాంతాల్లో ఉండి మరీ ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఏబీసీడీ అవార్డు పరిశీలనలోకి వెళ్లారు. రాష్ట్ర డీజీపీ కార్యాలయం పరిశీలనలో విజయనగరం వన్‌టౌన్ సీఐ, ఎస్‌ఐల పేర్లు రావడం, మంగళగిరి నుంచి పిలుపు రావడంతో ఎస్పీ వకుల్ జిందల్‌తో కలిసి వెళ్లి వారు ఈ అవార్డును అందుకున్నారు.