
వలంటీర్లను మోసం చేయడం తగదు
విజయనగరం: వలంటీర్లను మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి తగదని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. అంబేడ్కర్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో వలంటరీ వ్యవస్థ వంచన దినోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రూపొందించిన కరపత్రాలను ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. 2024 ఏప్రిల్ 9న అప్పటి టీడీపీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వలంటీర్ల జీతం రూ. 5 వేల నుంచి పదివేల రూపాయలకు పెంచుతామని ప్రకటించారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకు జీతం పెంచకపోవడం దారుణమన్నారు. పైగా ఆ వ్యవస్థే లేదని చెబుతున్న నాయకులు బుడమేరు వరదల సమయంలో వారి సేవలను ఎలా వినియోగించుకున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత పాలకులు స్పందించి వలంటీర్లకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అంబేడ్కర్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొంగ భానుమూర్తి, దారాన వెంకటేష్, లోపింటి రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు, వేముల వంశీ, ఈర్ల రవిరాజ్, ఉపమాక సంతోష్, తదితరులు పాల్గొన్నారు.