
అంబేడ్కర్ దార్శనికత దేశానికే మార్గనిర్దేశం
విజయనగరం అర్బన్: సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్య విలువల కోసం అంబేడ్కర్ అవిశ్రాంతంగా కృషిచేశారని, ఆయన దార్శనికత దేశానికి మార్గనిర్దేశం ఇస్తోందని కేంద్ర మాజీ మంత్రి, విద్యావేత్త ప్రొఫెసర్ సంజయ్ పాశ్వాన్ అన్నారు. విజయనగరం కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో ‘జాతి నిర్మాణం మరియు మహిళా సాధికారతలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్ర’ అనే అంశంపై గురువారం నిర్వహించిన ఒక రోజు జాతీయ సెమినార్‌లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అణచివేత, సాధికారత వంటి సమస్యల పరిష్కారంలో అంబేడ్కర్ చొరవను కొనియాడారు. మాజీ ఎంపీ ప్రొఫెసర్ ఐజీ సనాది మాట్లాడుతూ మహిళలకు చట్టపరమైన సమాన త్వాన్ని స్థాపించడానికి ప్రయత్నించిన హిందూ కోడ్ బిల్లుకు ఆయన చేసిన కృషిని వివరించారు. వివాహం, వారసత్వం, ఆస్తి హక్కు విషయాలపై చట్టపరమైన స్పష్టత ఇచ్చారన్నారు. గౌరవ అతిథి ప్రొఫెసర్ ప్రమాణ్ణి జయదేవ్ మాట్లాడుతూ సామాజిక పనిలో అంబేడ్కర్ తత్వశాస్త్రం ప్రాముఖ్యతను, సమ్మిళిత విధాన రూపకల్పనపై ఆయన ప్రభావాన్ని వివరించారు. యూనివర్సిటీ వీసీ టీవీ కట్టిమణి మాట్లాడుతూ సమాజహితమైన అంశాలపై కళాశాల స్థాయి విద్యాలయాల్లో సెమినార్లు నిర్వహించడం వల్ల చైతన్యవంతమై సమాజాన్ని నిర్మించుకోవచ్చన్నారు. అనంతరం ముఖ్య అతిథులను వీసీ సత్కరించారు. డాక్టర్ ఎం.నగేష్ ఆధ్వర్యంలో సాగిన సెమినార్‌లో ప్రొఫెసర్లు జె.ఎం.మిశ్రా, ఎం.శరత్చంద్రబాబు, ఎల్.వి.అప్పసాబా, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
కేంద్ర మాజీ మంత్రి సంజయ్ పాశ్వాన్