
దారికాచి దోపిడీ.. జాగ్రత్త..!
శృంగవరపుకోట: ఎస్.కోట మండలంలోని బొడ్డవర నుంచి తాటిపూడి మీదుగా విజయనగరం వెళ్లే రోడ్డులో దారిదోపిడీ దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. రోడ్డు నిర్మానుష్యంగా ఉండడంతో ప్రయాణికులపై దాడిచేసి దోచుకుంటున్నారు. గంట్యాడ మండలం బోనంగి గ్రామానికి చెందిన ముప్పన సత్యనారాయణ బుధవారం ఉదయం జీడిపిక్కలు కొనుగోలుకు బొడ్డవర వైపు బైక్‌పై వెళ్తుండగా రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు ఆయనను ఆపారు. వారిలో ఇద్దరు సత్యనారాయణను పట్టుకుని సొమ్ము గుంజుకునే ప్రయత్నం చేశారు. ఆయన జేబు గట్టిగా పట్టుకుని కేకలు వేయడంతో పిడిగుద్దులు గుద్ది తుప్పల్లో తోసేశారు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాక్కొని పరారయ్యారు. కొద్ది నిమిషాలకు తేరుకున్న సత్యనారాయణ ముషిడిపల్లిలో సచివాలయ సిబ్బంది ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పడంతో అక్కడి మహిళా పోలీస్ ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. తాటిపూడి రోడ్డులో ఇటీవల ఈ తరహా దాడులు ఎక్కువయ్యాయని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు నిర్మానుష్యంగా ఉండడంతో బైక్‌లపై వచ్చేవారిని టారర్గెట్ చేస్తూ బైక్ రిపేర్ అయ్యిందని, లిఫ్ట్ కావాలని, పక్క ఉన్న వ్యక్తికి ఆరోగ్యం బాగులేదని.. ఇలా రోజుకో వేషంతో ఏమారుస్తూ దాడులకు పాల్పడుతున్నారు. తక్షణమే ఆ రోడ్డులో పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటుచేయాలని, సీసీ కెమెరాలు అమర్చి దొంగతనాలు అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.