కాళ్లుపట్టుకుంటేనే ఉపాధి పని
జియ్యమ్మవలస రూరల్: ‘సుమారు 500 మంది వేతనదారుల మధ్య కాళ్లపై పడి క్షమాపణ చెబితేనే ఉపాధిహామీ పనికల్పిస్తాం.. లేదంటే పనికి రానివ్వం’ అంటూ ఫీల్డు అసిస్టెంట్, మేట్‌ల వేధింపులకు ఓ వేతనదారు మనస్థాపానికి గురైంది. గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జియ్యమ్మవలస మండలం జోగులమ్మ పంచాయతీలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థాని కులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్, మేట్‌లుగా పనిచేస్తున్న టీడీపీ నాయకులు ఎలకల శంకర బాబు, కాబోతుల ఇల్లంనాయుడు కొన్ని రోజులుగా వైఎస్సార్‌సీపీ ముద్రవేసి వేతనదారుల ను ఇబ్బంది పెడుతున్నారు. ఇదే కోవలో వేతన దారు బూరి గౌరమ్మ, భర్త త్రినాథరావును వేధింపులకు గురిచేశారు. ఉపాధి పని ఇవ్వకుండా.. పనికి వెళ్లినా ఒక గ్రూప్ నుంచి వేరే గ్రూప్‌లోకి మార్పు చేస్తూ, హాజరు వేయకుండా మనోవేదనకు గురిచేశారు. ఈ విషయమై పలుమార్లు జియ్యమ్మవలస పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు కూడా చేశారు. కాళ్లు పట్టుకుంటేనే పని ఇస్తామని వేధించడంతో మనస్థా పానికి గురైన బూరి గౌరమ్మ శుక్రవారం మధ్యాహ్నం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు వెంటనే ఆమెను చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ల గా డాక్టర్ ఎల్.వంశీకృష్ణ చికిత్స అందించారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ తాము వైఎస్సార్‌సీపీ మద్దతుదారులమని ముద్రవేసి కొన్నాళ్లుగా పని కల్పించడంలేదని వాపోయారు.
కూటమి ప్రభుత్వంలో కొత్త సంస్కృతి
విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గౌరమ్మను పరామర్శించారు. కూటమి ప్రభుత్వం నాయకులు కొత్త సంస్కృతిని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. కలెక్టర్, ఎస్పీ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
టీడీపీ నాయకుల వేధింపులు
మనస్థాపంతో వేతనదారు ఆత్మహత్యాయత్నం
మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పరామర్శ


