
ఎర్రచెరువు ఆక్రమణల తొలగింపు
తెర్లాం: మండలంలోని పెరుమాళి గ్రామంలో ఉన్న ఎర్రచెరువు ఆక్రమణలను రెవిన్యూ అధికారులు శనివారం తొలగించారు. తహసీల్దారు కార్యాలయంలో ఇటీవల జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి గ్రామానికి చెందిన పలువురు చెరువు ఆక్రమణలపై తహసీల్దారు హేమంత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆక్రమణలను పరిశీలించాల్సిందిగా ఆర్‌ఐ, వీఆర్‌వోలను తహసీల్దారు ఆదేశించారు. దీంతో వారు క్షేత్రస్థాయికి వెళ్లి ఆక్రమణకు గురైన ఎర్రచెరువును పరిశీలించి, చూడగా ఆక్రమణలు జరిగినట్లు నిర్ధారించి తహసీల్దార్‌కు విషయం తెలియజేశారు. దీంతో ఆయన ఆక్రమణలు తొలగించాలని ఆదేశించడంతో జేసీబీతో చెరువు గర్భంలోని ఆక్రమణలను తొలగించారు. ప్రభుత్వ భూములు గానీ చెరువు గర్భాలను గానీ ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ కృష్ణమూర్తినాయుడు, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.