
సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురంటౌన్: సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షల ఆన్‌లైన్ శిక్షణకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికారత అధికారి ఇ.అప్పన్న తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీఈటీ ఉత్తీర్ణులై, సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు అర్హులైన స్థానికులైన వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనకబడిన తరగతుల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిగ్రీ మార్క్స్ లిస్ట్, కుల, ఆదాయ, స్థానికత తెలిపే ధ్రువీకరణ పత్రాలు, డీఎస్సీకి ఎంపికై న అభ్యర్థులు టీఈటీ మార్క్స్ లిస్ట్ జిరాక్స్, పాస్ పోర్ట్ ఫొటోలు 2 దరఖాస్తుతో జత చేయాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ఆర్‌సీఎం స్కూల్, రూం నంబర్ 8, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా పార్వతీపురం కార్యాలయంలో పని వేళల్లో సమర్పించాలని సూచించారు.