
ప్రవర్తన మారకుంటే జైలుకే
● రౌడీషీట్లర్లకు ఎస్పీ హెచ్చరిక
విజయనగరం క్రైమ్: జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు ఎస్పీ వకుల్ జిందల్ ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో తమ తమ స్టేషన్‌ల పరిధిలో ఉన్న పాత నేరస్తులను శనివారం పిలిపించి క్లాస్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ఆదేశాలతో సంబంధిత స్టేషన్ల ఎస్సైలు హిస్టరీ,రౌడీషీట్లు కలిగిన నేరస్తులను స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లాలోని పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, చీపురుపల్లి, గరివిడి, గజపతినగరం, ఎస్.కోట, వల్లంపూడి ఇలా 34 స్టేషన్లలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. రౌడీషీటర్ల ప్రవర్తన, వారు రోజువారీ నిర్వర్తించే పనులపై ఓ కన్నేసి ఉంచాలని ఎస్పీ వకుల్ జిందల్ సిబ్బందికి సెట్ కాన్పరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. రౌడీలు మళ్లీ దురుసుగా నేరాలకు పాల్పడే విధంగా ఉంటే ప్రత్యేకంగా వారిపై నిఘా తీవ్రతరం చేయాలని సూచించారు.
25 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్
తెర్లాం: అనధికారికంగా బెల్ట్ దుకాణం నడుపుతున్న వ్యక్తి వద్ద 25 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు తెర్లాం ఎస్సై సాగర్‌బాబు శనివారం తెలిపారు. దీనికి సంబంధించి ఎస్సై మాట్లాడుతూ మండలంలోని నందబలగ గ్రామంలో బమ్మిడి నారాయణరావు అనే వ్యక్తి అనధికారికంగా బెల్ట్ దుకాణం నడుపుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు గ్రామానికి వెళ్లి దాడి చేశామన్నారు. ఈ దాడిలో 25 మద్యం సీసాలతో పట్టుబడిన నారాయణరావును అరెస్ట్ చేసి బొబ్బిలి కోర్టుకు తరలించామని చెప్పారు.
సమగ్ర శిక్షలో సెక్టోరల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
● 21 నుంచి తరఖాస్తుల స్వీకరణ
విజయనగరం అర్బన్: జిల్లా విద్యాశాఖలోని సమగ్ర శిక్ష విభాగంలో ఖాళీగా ఉన్న సెక్టోరల్ పోస్టుల భర్తీకి కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ ఉత్తర్వుల మేరకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశామని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఏఎల్‌ఎస్ కో–ఆర్డినేటర్, అసిస్టెంట్ స్టాటస్టికల్ అధికారి, అసిస్టెంట్ ఏఎంఓ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత పోస్టులకు అర్హతగల ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్‌లు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల నుంచి ఈ నెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, కలెక్టరేట్‌లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించనున్నామని తెలిపారు. దరఖాస్తు తదితర వివరాలను ‘విజయనగరం.ఎన్‌ఐసీ.ఐఎన్’ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు.
ఆర్టీసీ కాంప్లెక్స్‌ను
సందర్శించిన ఈడీ
గజపతినగరం : ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో అన్ని మౌలికవసతులు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం గజపతినగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల రాకపోకల్లో ఆర్టీసీ కాంప్లెక్స్ వచ్చి వెళ్లే ఏర్పాట్లు చేశామన్నారు. ఏవైనా బస్సులు విజయనగరం నుంచి గజపతినగరం మీదుగా సాలూరు వెళ్లేవి, సాలూరు నుంచి గజపతినగరం మీదుగా విజయనగరం వెళ్లేవి గజపతినగరం ఆర్టీసీ కాంప్లెక్స్(డిపోకు)కు రాకుండా డైరెక్ట్‌గా వెళ్లిపోయినట్లయితే తమకు సమాచారం ఇస్తే సంబంధిత డ్రైవర్‌లు, కండక్టర్‌లపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.అనంతరం కాంప్లెక్స్‌లో తాగునీరు, ప్రయాణికుల మరుగుదొడ్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీపీడీఓ అప్పలనాయుడు, డీఎం శ్రీనివాసరావు, ఆర్టీసీ కాంప్లెక్స్ కంట్రోలర్ ఆరిక తోట జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రవర్తన మారకుంటే జైలుకే