
వెబ్‌సైట్‌లో మెరిట్ జాబితా
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ వైద్యకళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో లైబ్రరీ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ఎలక్ట్రికల్ హెల్పర్ పోస్టుల భర్తీకి ప్రొవిజినల్ మెరిట్ జాబితాను విజయనగరం.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిపై అభ్యంతరాలుంటే ఈ నెల 10, 11, 15, 16, 19, 21 తేదీల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉదయం 10 నుంచి సాయింత్రం 5 గంటలలోగా లిఖితపూర్వకంగా అందజేయాలని కోరారు.
ఐటీఐ పరికరాల కొనుగోలుపై విచారణ
బొబ్బిలి: పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐకు రూ.90లక్షల విలువైన యంత్ర పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఐటీఐ డిప్యూటీ డైరెక్టర్ ఆర్.వి.రమణారావు, విజిలెన్స్ అంధికారులు రెండు రోజులుగా డీడీ ఆధ్వర్యంలో సిబ్బందిని విచారణ చేస్తున్నారు. వర్చువల్ డ్రైవింగ్ సిస్టం, ఆన్‌లైన్ శిక్షణ తరగతులకు సంబంధించిన విలువైన పరికరాలను పరిశీలించి, ధరలపై ఆరా తీసినట్టు సమాచారం. పూర్తి వివరాలు గురువారం వెల్లడిస్తామని డీడీ తెలిపారు.
ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు సమస్యల ఏకరువు
సాలూరు: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు వద్ద గిరిజనులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. సాలూరు మండలంలోని మారేపా డు, తాడిలోవ, పాలికవలస గిరిశిఖర గ్రామాలకు డీవీజీ బుధవారం కాలినడకన వెళ్లారు. తొలుత మారేపాడు వెళ్లిన చైర్మన్‌కు అక్కడి గిరిజనులు తమ సమస్యలను తెలియజేశారు. తాగునీటికి ఇబ్బందు లు పడుతున్నామని, గ్రామానికి రోడ్డు సదుపా యం లేదని, పిల్లల ఆధార్ నమోదు సమస్యలు అధికంగా ఉన్నాయని, పోడు పట్టాలు అందజేయలేదని వివరించారు. అనంతరం ఆయన అంగన్‌వా డీ కేంద్రంలో పిల్లలకు వండిపెడుతున్న భోజనాన్ని పరిశీలించారు. మరో తాగునీటి పథకం, పోడు పట్టాలు మంజూరు చేయాలని తాడిలోవ గిరిజనులు విజ్ఞప్తి చేశారు. పాలికవలసలో అంగన్‌వాడీ కేంద్రం టీచర్ పోస్టు భర్తీ చేయాలని, శ్మశానానికి రోడ్డు మంజూరుచేయాలని, పోడు పట్టాలు ఇవ్వాలని గ్రామస్తులు కోరారు. పెదపదంలో గిరిజనులు సాగుచేస్తున్న అటవీ భూములు సర్వే చేశారే తప్ప పట్టాలు మంజూరు చేయలేదన్నారు. దీనిపై డీవీజీ స్పందిస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్.వి.రమణ, ఎంపీడీఓ పార్వతి, వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

వెబ్‌సైట్‌లో మెరిట్ జాబితా