
పగలు, రాత్రి తేడా లేకుండా..!
● అనధికార విద్యుత్ కోతలు
● ఎండ వేడమికి ఇబ్బంది పడుతున్న జనం
● ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా నిలిపివేత
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అనధికారిక విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయని పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. తరచూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండడంతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండవేడిమితో పాటు ఉక్కబోతను భరించలేక అవస్థలు పడుతున్నారు. ఫ్యాన్ కింద సేదతీరుదాం అంటే విద్యుత్ కోతల వల్ల ప్రజలకు అవకాశం లేని పరిస్థితి. కొద్దిమందికి మాత్రమే ఇన్వర్టర్స్ ఉన్నాయి. ఇన్వర్టర్స్ లేని పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ కోతలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా విధిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 10, 15 నిమిషాల పాటు పదేపదే విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో 20 నుంచి 30 నిమిషాల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన విద్యుత్ సరఫరా ఇస్తాం. విద్యుత్ కోతలే ఉండవు, చార్జీలు కూడా పెంచబోమని కూటమి నేతలు ఎన్నికల సమయంలో ప్రకటనలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పక్కన పెట్టేశారు. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఇవ్వాల్సిన సమయంలోనూ విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. పవర్‌కట్ అని కాకుండా రకరకాల కారణాలతో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. అధికారికంగా కాకుండా అనధికారికంగా ఇష్టానుసారం కోతలు పెడుతున్నారు. దీంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. విద్యుత్ సరఫరా ఎప్పడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
రైతులకు తప్పని ఇబ్బందులు
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అకాశంలో చిన్నపాటి మబ్బు వేసినా వ్యవసాయ విద్యుత్‌కు సరఫరా నిలిపివేస్తున్నారు. ప్రతిరోజూ గ్రామీణ ప్రాంతాల్లో పదేపదే విద్యుత్ నిలిపివేయడం వల్ల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ద్వారా పంటలకు సాగునీరు అందించే రైతులు ఇబ్బంది పడుతున్నారు. తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల పంటలకు సకాలంలో నీరు అందడం లేదు. రోజులో నాలుగు, ఐదుసార్లు అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల విద్యుత్ ఎప్పడువస్తుందో ఎప్పడు పోతుందో తెలియని పరిస్థితి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు నిరంతరాయంగా 9గంటల పాటు విద్యుత్ అందేది. గృహ వినియోగదారులకు కూడా 24 గంటల పాటు విద్యుత్ అందేది. అత్యవసరంగా విద్యుత్ కోత విధించాల్సి వస్తే అధికారికంగా ప్రకటించేవారు.
జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు 7,41,828
జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు 7, 41, 828 ఉన్నాయి. వాటిలో కేటగిరి–1 కి సంబంధించి 6,04,535, కేటగిరి–2 కనెక్షన్లు 65, 194 ఉన్నాయి. కేటగిరి–3 కనెక్షన్లు 2,822 ఉన్నాయి. కేటగిరి –4 కనెక్షన్లు 14,168, కేటగిరి–5 కనెక్షన్లు 55,109 ఉన్నాయి.
ప్రతిరోజూ విద్యుత్ సరఫరా నిలిపివేత
ప్రతిరోజూ పగలు లేదా రాత్రి పూట 10, నుంచి 15 నిమిషాల పాటు 2,3 పర్యాయాలు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. వేసవికాలం కావడంతో పగలు, రాత్రి కూడా ఉక్కబోత కారణంగా ఉండలేకపోతున్నాం. ఫ్యాన్ కిందికి వెళ్దామంటే విద్యుత్ సరఫరా ఉండడం లేదు.
ఆర్. నాగేశ్వరావు, వినియోగదారు, పెదవేమలి గ్రామం గంట్యాడ మండలం
విద్యుత్ కోతలు లేవు
అధికారికంగా ఎక్కడా విద్యుత్ కోతలు విధించడం లేదు. ఎండవేడిమికి కొన్ని చోట్ల ట్రిప్ అవడం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. రాత్రివేళ ఎక్కడైనా సమస్య తలెత్తితే విద్యుత్ సరఫరా నిలిపివేస్తాం. ఎక్కడ సమస్య వచ్చినా విద్యుత్ సిబ్బంది సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంటున్నారు.
మువ్వల లక్ష్మణరావు, ఎస్‌ఈ, ఏపీఈపీడీసీఎల్

పగలు, రాత్రి తేడా లేకుండా..!