
రేగిడి ఘటనపై విచారణకు కమిటీ
● ముగ్గురు జిల్లా అధికారులతో ఏర్పాటు
● నివేదిక ఆధారంగా చర్యలు
● సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ
సాక్షి, పార్వతీపురం మన్యం:
గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాత్సవ తెలిపారు. ఈ నెల 9న ’సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ’బాలికా ఆశ్రమం భద్రమేనా?’ శీర్షికన ప్రచురితమైన కథ నానికి ఆయన స్పందించారు. పాఠశాలలో చదువుతున్న బాలికను ఓ ఉపాధ్యాయుడు ద్విచక్ర వాహనంపై కురుపాం తీసుకెళ్లి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించడంపై జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు వివరించారు. ఇందుకోసం ముగ్గురు జిల్లా అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలి పారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, మహిళా శిశు సంక్షేమశాఖ పథక అధికారిణి, ఎస్సీ సంక్షేమం–సాధికారత అధికారి విచారణ కమిటీ సభ్యులుగా ఉంటారని వివరించారు. మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు చెప్పారు.
సమగ్ర విచారణ జరపాలి:
గిరిజన సంఘాల డిమాండ్
రేగిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో వైద్యం పేరిట పురుష ఉపాధ్యాయులు గిరిజన బాలికలను బయటకు.. ప్రైవేట్ ఆస్పత్రికి, ఆర్‌ఎంపీ వద్దకు తీసుకుని వెళ్లారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని గిరిజన సంఘాలు పేర్కొన్నాయి. గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం, గిరిజన అభ్యుదయ సంఘం, ట్రైబల్ రైట్స్ ఫోరం, ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ సంఘాల నాయకులు శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, పార్వతీపురం ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాత్సవకు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు పాలక రంజిత్‌కుమార్, పల్ల సురేష్, మువ్వల అమర్‌నాథ్, ఆరిక చంద్రశేఖర్, ఇంటికుప్పల రామకృష్ణ, చెల్లూరు సీతారాం, కోలక గౌరమ్మ, బి.రవికుమార్, బీటీ నాయుడు తదితరులు మాట్లాడుతూ.. బాలికల పాఠశాలల్లో పురుష ఉపాధ్యాయులను నియమించడమే అనేక సమస్యలకు కారణమన్నారు. రేగిడి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులు, మహిళా డిప్యూటీ మేట్రిన్ ఉండగా.. పురుష ఉపాధ్యాయులు బాలికలను వైద్యంపేరిట బయటకు ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. తక్షణమే మహిళా అధికారులతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

రేగిడి ఘటనపై విచారణకు కమిటీ