
పీఎంశ్రీ రాష్ట్ర బృందం పర్యటన
పార్వతీపురం టౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో పీఎంశ్రీ పథకం రాష్ట్ర బృందం సభ్యులు డాక్టర్ ఎస్.ప్రసాద్, జి.మహేశ్వర్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా 19 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇంజినీరింగ్ సహాయకులతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ పీఎంశ్రీ పథకం కింద మన్యం జిల్లాలో 19 పాఠశాలలు ఎంపికై నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా పాఠశాలలో మౌలిక వసతులు, క్రీడామైదానం, ల్యాబ్‌లు, మరుగుదొడ్లు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఆ పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ 19 పాఠశాలలు మోడల్ పాఠశాలలుగా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా నిధులు మంజూరు చేసిందన్నారు. నిర్మాణ, అభివృద్ధి పనులన్నీ సమగ్ర శిక్ష ఇంజినీరింగ్ అధికారుల సహకారం, సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేస్తే మరిన్ని నిధులు జిల్లాకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అనంతరం పనులు జరుగుతున్న తీరు, సమస్యలను 19 పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఈ.రమాజ్యోతి, సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త ఆర్.తేజేశ్వరరావు, ఇంజినీరింగ్ సహాయకులు, సెక్టోరల్ సిబ్బంది 19 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.