బొబ్బిలిలో అవిశ్వాస రాజకీయం! | - | Sakshi
Sakshi News home page

బొబ్బిలిలో అవిశ్వాస రాజకీయం!

Published Wed, Apr 9 2025 1:03 AM | Last Updated on Wed, Apr 9 2025 1:03 AM

బొబ్బ

బొబ్బిలిలో అవిశ్వాస రాజకీయం!

బొబ్బిలి: పౌరుషానికి, వీరత్వానికి ప్రతీకగా నిలిచే బొబ్బిలి గడ్డ.. నేడు కుటిల రాజకీయాలకు కేరాఫ్‌గా మారింది. నిండా ఏడాది పదవీ కాలం లేని మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం కోసం బొబ్బిలి రాజులు బెదిరింపు, ప్రలోభ రాజకీయాలకు తెరతీయం చర్చనీయాంశంగా మారింది. ఓ పార్టీ గుర్తుతో గెలిచి మంత్రి పదవి కోసం పార్టీ మారిన నాయకుడు... ఇప్పుడు ఆ మచ్చను కౌన్సిలర్లకు అంటగట్టే ప్రయత్నాన్ని బొబ్బిలి ప్రజలు ఛీకొడుతున్నారు. పార్టీ మారిన కౌన్సిలర్ల తీరును దుమ్మెత్తిపోస్తున్నారు. విశాఖ కేంద్రంగా బొబ్బిలి రాజులు నడుపుతున్న కుటిల రాజకీయాలకు అవిశ్వాస తీర్మానం రోజున భంగపాటు తప్పదని బహిరంగంగా చెబుతున్నారు.

ఇదీ పరిస్థితి...

బొబ్బిలి మున్సిపాలిటీలో 31 వార్డులకు టీడీపీకి 10 మంది కౌన్సిలర్లుండగా వైఎస్సార్‌సీపీ నుంచి 21 మంది కౌన్సిలర్లు గెలిచారు. దీంతో చైర్మన్‌ పీఠాన్ని అప్పట్లో వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైర్మన్‌ పీఠంపై బొబ్బిలి రాజులు కన్నేశారు. బలం లేకున్నా... వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను బెదిరించి, ఎరవేసి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని కౌన్సిలర్లతో కలెక్టర్‌ అంబేడ్కర్‌కు నోటీసు ఇప్పించారు. అయితే, కొందరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు మాత్రం ఓ పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరే నీచపు పనికి ఒడిగట్టమని స్పష్టంచేస్తూ నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడ్డారు. రాజుల మాయమాటల్లో పడిన కౌన్సిలర్లకు హితబోధ చేసేందుకు మాజీ మంత్రి, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణతో పాటు జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. రాజులను వీడి వాస్తవాలను గ్రహించాలని కౌన్సిలర్లకు వారి కుటుంబ సభ్యులతో చెప్పిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 29న నిర్వహించే అవిశ్వాస తీర్మానం రోజున పార్టీకి వ్యతిరేకంగా చెతులెత్తే పరిస్థితి లేదన్నది సమాచారం. రాజులు ఎన్ని శిబిరాలు నిర్వహించినా ధర్మమే గెలుస్తుందని, చివరకు రాజులకు భంగపాటు తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, స్థానిక సీనియర్‌ కౌన్సిలర్లు రేజేటి ఈశ్వరరావు, చోడిగంజి రమేష్‌ నాయుడు కౌన్సిల్‌ను కాపాడుకునే అంశంపై న్యాయవాదుల సూచనల మేరకు ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్సీ బొత్స, జెడ్పీ చైర్మన్‌ చిన్న శ్రీనుల సలహాలు పాటిస్తున్నారు. టీడీపీ కోరి తెచ్చుకున్న ఈ ముప్పుతో వారే అవస్థల పాలవుతారని, దగాకు పాల్పడిన కౌన్సిలర్లు కర్మ సిద్ధాంతానికి లోబడి ముప్పు ఎదుర్కోక తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కౌన్సిలర్లు, నాయకులతో చర్చిస్తున్న మాజీ ఎమ్మెల్యే శంబంగి

నిలకడలేని నైజం..

వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన నాలుగో వార్డు కౌన్సిలర్‌ అమ్మన్నమ్మ నిజాయితీగా ఉన్నా ఆమె కుమారుడు మాత్రం నిలకడలేని నైజం ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. అటుఇటు రెండు వైపులా ఉన్నట్టు నటించడంపై ఆ వార్డు ప్రజలు మండిపడుతున్నారు. నీచపుబుద్ధిని పక్కన పెట్టాలంటూ వార్డు పెద్దలు హెచ్చరికలు చేసినట్టు సమాచారం. టీడీపీ నిర్వహిస్తున్న శిబిరంలో కొంత మంది మహిళా కౌన్సిలర్లను వారి భర్తలు, కుమారులకు చెప్పకుండా నేరుగా పలు ప్రాంతాలకు తిప్పుతుండడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తుండగా సుజయ్‌కృష్ణరంగారావు నచ్చచెబుతున్నట్టు తెలిసింది. టీడీపీకి నమ్మకంగా ఉంటున్న వారిలో ఇద్దరు వైఎస్సార్‌ సీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై టీడీపీ కూడా వారిని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. సంవత్సరం కూడా లేని పదవి కోసం అర్రులు చాచడం, డబ్బుకు కక్కుర్తిపడి సొంత వార్డులోని ఓటర్ల వద్ద పరువు పోగొట్టుకోవడం, ఆపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావడం అవసరమా అన్న ఆలోచనతో కొందరు కౌన్సిలర్లు రాజుల చెర నుంచి బయటకు వచ్చేందుకు దారులు వెతుకుతున్నారనే ప్రచారం సాగుతోంది.

బొబ్బిలిలో అవిశ్వాస రాజకీయం! 1
1/1

బొబ్బిలిలో అవిశ్వాస రాజకీయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement