
వల్లంపూడి ఎస్‌ఐని సస్పెండ్ చేయాలి
వేపాడ: వల్లంపూడి ఎస్‌ఐ బి.దేవిని తక్షణమే సస్పెండ్ చేయాలని, గుడివాడలో జరిగిన సంఘటనలో తప్పుడు కేసులను రద్దు చేయాలని కోరుతూ దళితులు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం ఆందోళన చేశారు. ఏపీ దళిత కూలీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి గాలి ఈశ్వరరావు, దళిత నాయకుడు కిరణ్ ఆధ్వర్యంలో ముందుగా అక్కడి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్‌ఐ తీరుపై నిరసన తెలిపారు. అనంతరం స్టేషన్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం, యాతపేట, వల్లంపూడి మీదుగా ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్ జె.రాములమ్మకు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
దళితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా బాధితులు గుడివాడ మోహన్, గాలి ఈశ్వర్వవు మాట్లాడుతూ గుడివాడలో మార్చి 11న రాత్రి జరిగిన ఘటనలో నమోదు చేసిన తప్పుడు కేసులను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ వీరాకుమార్, ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు, ఎల్.కోట ఎస్‌ఐ నవీన్‌పడాల్ బందోబస్తు నిర్వహించారు.
పోలీస్ స్టేషన్ ముందు దళితుల ధర్నా
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత