
లాకౌట్ దిశగా జిందాల్ !
కొత్తవలస: మండలంలోని అప్పన్నపాలెం గ్రామ సమీపంలోని జిందాల్ స్టెయిన్‌లెస్ స్టీల్ కర్మాగారం లాకౌట్ దిశగా నడుస్తుండడంతో కార్మికులు బుధవారం ఆందోళనకు దిగారు. ఎ–షిప్టు, జనరల్ షిప్టుకు వెళ్లిన కార్మికులు విధులను బహిష్కరించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కర్మాగారానికి చేరుకుని కార్మికులను శాంతింప జేశారు. ఈ పరిశ్రమలో శాశ్వత కార్మికులుగా 57 మంది, కాంట్రాక్టు కార్మికులుగా 249 మంది పని చేస్తున్నారు. గడిచిన మే నెలలో కర్మాగారానికి అవసరమైన ముడిసరుకు లభ్యం కావడం లేదని, ఉత్పత్తికి గిరాకీ లేకపోవడం వంటి కారణాలతో నష్టాలు వస్తున్నాయిని, తప్పనిసరి పరిస్థితుల్లో కర్మాగారం మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. కార్మికులకు, యాజమాన్యానికి మధ్య కుదిరిన ఒప్పందంతో ఆగస్టు నెలలో కర్మాగారాన్ని పునఃప్రారంభించారు. మళ్లీ గడిచిన 20 రోజల నుంచి కర్మాగారానికి ముడిసరుకు తేవడం ఆపేశారు. ఉత్పత్తి చేసిన సరుకును పూర్తిస్థాయిలో ఎగుమతి చేస్తున్నారు. గతంలో ఇదే పద్ధతిలో ముడిసరుకు లేని కారణంగా కర్మాగారానికి లే ఆఫ్ ప్రకటిస్తున్నట్టు నోటీస్‌లు అతికించి అర్ధాంతరంగా కర్మాగారాన్ని మూసేశారని కార్మిక సంఘం నాయుకులు లగుడు వామాలు వాపోయారు. భవిష్యత్ కార్యాచరణను గురువారం తెలుపుతామన్నారు. ఈ విషయమై కర్మాగారం హెచ్‌ఆర్ మేనేజర్ గోపాలకృష్ణను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
విధులను బహిష్కరించిన కార్మికులు
ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వాలని డిమాండ్
అర్ధాంతరంగా కర్మాగారం మూసేస్తే
కార్మికుల పరిస్థితి ఎంటి?