
సురక్షిత ప్రసవాలే లక్ష్యం
పార్వతీపురంటౌన్: మాతా, శిశు ఆరోగ్య శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఆశా నోడల్ అధికారులతో ఎన్జీఓ హోమ్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ భాస్కరరావు పలు ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష చేశారు. మాతా, శిశు ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, గర్భిణిగా నమోదు చేసినప్పటి నుంచి ప్రసవానంతరం వరకు పూర్తిస్థాయిలో ఆరోగ్య తనిఖీలు, వైద్యపరీక్షలు, నెల వ్యవధిలో రెండు డోసుల టిడి ఇంజక్షన్, ప్రతిరోజూ ఐరన్, కాల్షియం మాత్రలు, నిర్దేశించిన కాల వ్యవధిలో కనీసం నాలుగు తనిఖీలు తప్పనిసరి అని తెలిపారు. గర్భిణుల్లో ఆరోగ్య సమస్యలు సత్వరమే గుర్తించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని, సురక్షిత ప్రసవమే ధ్యేయంగా కృషి చేయాలని కోరారు. సాధారణ ప్రసవాలు పీహెచ్‌సీల్లో జరిగేలా చూడాలని చెప్పారు. గిరిశిఖర, మారుమూల గిరిజన గ్రామాల్లో గర్భిణులను నెల/రెండు నెలలు ముందుగానే వసతి గహాల్లో చేర్చాలని సూచించారు. పిల్లలకు షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయడం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రక్తహీనత ఉన్నట్లు గుర్తించిన గర్భిణుల్లో హీమోగ్లోబిన్ శాతం వృద్ధి చెందేలా పర్యవేక్షించాలని సూచించారు. వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం ఆశ కార్యకర్తలకు ఆరోగ్యశాఖ పంపిణీ చేసిన యూనిఫాంను ప్రోగ్రాం అధికారులతో కలిసి అందజేశారు. కార్యక్రమంలో డీఐఓ డా.ఎం.నారాయణరావు,ప్రోగ్రాం అధికారులు డాక్టర్ టి.జగన్మోహనరావు, డా.రఘుకుమార్, డీపీహెచ్‌ఎన్‌ఓ ఉషారాణి, డీపీఓ లీలారాణి, డీసీఎం విజయలత, డెమో సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కరరావు