
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
డెంకాడ: మండలంలోని చొల్లంగిపేట జంక్షన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని ఎన్‌జీఆర్ పురం గ్రామానికి చెందిన జిగిలి రాములప్పడు(54) అక్కడికక్కడే మృతి చెందగా మృతుడి భార్య మహలక్ష్మి తీవ్ర గాయాలపాలైంది. దీనిపై ఎస్సై ఎ.సన్యాసినాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాములప్పడు, భార్య మహలక్ష్మి తమ కుమార్తె వివాహ విషయమై మాట్లాడేందుకు విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని గంగచోళ్లపెంట గ్రామానికి వెళ్తున్నారు. కుమిలి–విజయనగరం రోడ్డులోని చొల్లంగిపేట జంక్షన్‌కు వచ్చేసరికి బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడిపోయింది. దీంతో బైక్ నడుపుతున్న రాములప్పడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, బైక్ వెనుక కూర్చున్న మహలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం విజయనగరం తరలించారు. మృతుడి సోదరుడు జిగిరి రాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు.
చికిత్స పొందుతూ వివాహిత..
గరుగుబిల్లి: రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనికి సంబంధించి హెచ్‌సీ ఈశ్వరరావు బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా రాజాం పట్టణానికి చెందిన సవలాపురపు సంజీవు, భార్య కొండమ్మ పార్వతీపురం మండలంలోని గోపాలపురంలో చింతాడ కామేశ్వరి (కొండమ్మ చెల్లి) పెళ్లిరోజు వేడుకలకు హాజరై 15న సాయంత్రం ద్విచక్రవాహనంపై గోపాలపురంనుంచి స్వగ్రామం రాజాం వెళ్తురన్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో గరుగుబిల్లి మండలంలోని రావివలస జంక్షన్ సమీపంలో వెనుక కూర్చున్న కొండమ్మ ప్రమాదవశాత్తు బైక్‌నుంచి జారిపడగా తలకు బలమైన గాయమైంది. దీంతో మెరుగైన చికిత్సకోసం విజయనగరం తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ మేరకు మృతురాలు కొండమ్మ, తండ్రి రేజేటి పైడిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ తెలిపారు.
మృతుడి భార్యకు తీవ్రగాయాలు

బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి