
ప్రతి కుటుంబం లక్ష ఆదాయం పొందాలి
పార్వతీపురంటౌన్: జిల్లాలోని ప్రతికుటుంబం కనీసం రూ.లక్ష ఆదాయం పొందాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి జీవనోపాధి కల్పనలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో గురువారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబం కనీసం రూ.లక్ష ఆదాయం సంపాదించాలని ఇందుకు వ్యవసాయ, ఉద్యాన పంటలు, వశుసంవర్థక సంబంధిత ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్లు పెంపకాల యూనిట్ల ఏర్పాటు వల్ల పొందే ఆదాయ మార్గాలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. జిల్లాలో 110 ఎకరాల్లో పనస పంట వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఒక కుటుంబం రూ.లక్ష ఆదాయం పొందేందుకు అవసరమైన పెట్టుబడి, వేతనాలు, చెల్లింపు, ఖర్చులు తదితర అంశాలతో స్పష్టమైన కార్యాచరణ రూపొందించి ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అభిప్రాయ పడ్డారు. కార్యక్రమంలో నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి డీఎస్ దినేష్ కుమార్ రెడ్డి, డీఆర్‌డీఎ పీడీ ఎం.సుధారాణి, జిల్లా ఉద్యానశాఖాధికారి బి. శ్యామల, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి వి.రాధాకృష్ణ, జిల్లా అగ్రిట్రేడ్ మార్కెటింగ్ అధికారి అశోక్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్