
అనుభవానికి పెద్దపీట
● వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులుగా రాజన్నదొర, బెల్లాన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: అత్యంత కీలకమైన వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ)లో సీనియర్ నాయకులైన మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లకు చోటుదక్కింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేకు పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించి కొత్తగా రూపొందించిన పీఏసీ సభ్యుల జాబితాను శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. మొత్తం 33 మంది సభ్యుల ఈ జాబితాలో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి పీడిక రాజన్నదొరకు, విజయనగరం జిల్లా నుంచి బెల్లాన చంద్రశేఖర్‌కు అవకాశం కలిగింది.
పీడిక రాజన్నదొర..
ప్రభుత్వ ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలేసి 2004లో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాజన్నదొర అడుగుపెట్టారు. తొలుత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యేగా, తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి విజయనగరంలో సీనియరు నాయకులైన బొత్స సత్యనారాయణ, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్, సూర్యనారాయణ దేవ్ ఆశీస్సులతో ప్రజానేతగా ఎదిగారు. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
బెల్లాన చంద్రశేఖర్...
గ్రామ స్థాయి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బెల్లాన చంద్రశేఖర్ తర్వాత జిల్లా స్థాయి దాటి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 2004 నుంచి 2008 వరకూ చీపురుపల్లి ఎంపీటీసీ సభ్యుడిగా, తర్వాత 2008లో చీపురుపల్లి జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారు. అనూహ్యంగా 2011లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. 2019లో విజయనగరం ఎంపీగా గెలుపొందారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా 2015 నుంచి 2016 వరకూ సేవలందించారు. ఎంఏ, బీఎల్ చదివిన చంద్రశేఖర్ తొలుత న్యాయవాదిగా పనిచేశారు. చీపురుపల్లి కోర్టులో ప్రాక్టీస్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్నారు.

అనుభవానికి పెద్దపీట