
రంగప్ప చెరువు వద్ద ఉద్రిక్తత
రాజాం సిటీ: పట్టణ పరిధిలోని రంగప్ప చెరువు ఆధునికీకరణ పనుల్లో భాగంగా అధికారులు శనివారం చర్యలు చేపట్టారు. జేసీబీతో అక్కడ ఉన్న ఆక్రమణలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సంబంధిత భూమిలో సాగుదారులు అక్కడకు చేరుకుని ఏళ్ల తరబడి తమ సాగులో ఉన్న భూములు లాక్కోవద్దంటూ ఆందోళనకు దిగారు. దీంతో ఒకింత ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అధికారులు చెరువు వద్ద ట్రెంచ్‌లు ఏర్పాటు చేస్తున్న జేసీబీకి అడ్డంగా నిలుచొని నినాదాలు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే నోటీసులు అందించామని, ఇది ప్రభుత్వ భూమి అని, ఈ చెరువుకు ఆనుకుని ఆక్రమణకు గురైనట్లు గుర్తించామని అధికారులు చెప్పడంతో బాదితులు నిరసన తెలిపారు. 114 సర్వే నంబర్‌లో దళితులకు, స్వతంత్ర సమరయోధులకు పేరిట ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని, దీంట్లో తాము సాగు చేసుకుంటున్నామని, పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఉన్నాయని, భూమి శిస్తు కూడా చెల్లిస్తున్నామని సాగుదారులు బి.అప్పారావు, ఎన్.ఆదియ్య, తవిటినాయుడు, ఎన్.గడ్డియ్య, శంకర్ తదితరులు అధికారుల ఎదుట వాపోయారు. ఇప్పుడు అధికారులు ఇలా తమ భూమిని లాక్కోవడం సమంజసం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో 70 కుటుంబాల వారు రోడ్డున పడతామని, పేదల భూములను కాపాడాల్సిందిపోయి తమ పొట్ట కొట్టొద్దంటూ జేసీబీలను అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక భూమికి సంబంధించి సరైన పత్రాలను చూపాలని పేర్కొంటూ అక్కడ నుంచి వెనుదిరిగారు.
భూ సాగుదారుల ఆందోళన