
మృత్యు ఒడిలోకి...
శుభలేఖ ఇచ్చేందుకని బయలుదేరి..
పాలకొండ రూరల్: తన పెద్దనాన్న కుమారుడు వివాహం తొలి శుభలేఖను తమ ఇంట పేరంటాళ్లకు చూపించేందుకు వెళ్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. దీంతో మరో మూడు వారాల్లో ఆ ఇంట జరగాల్సిన వివాహ వేడుకలో విషాదం నెలకొంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. పాలకొండ మండలం కోటిపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయదారుడు గొర్ల కృష్ణ, భాను దంపతులకు ఓ కుమార్తెతో పాటు కుమారుడు మోహనరావు ఉన్నారు. కుమార్తెకు వివాహం కావడంతో కుమారుడిని తమ రెక్కల కష్టంతో చదివిస్తున్నారు. మోహనరావు పెద్దనాన్న కుమారుడికి మే 9వ తేదీన వివాహం నిశ్చయమైంది. దీంతో మోహనరావు అలియాస్ మణి(20) అన్నీ తానై వివాహ ఏర్పాట్లను చూస్తున్నాడు. ఇందులో భాగంగా పెండ్లి శుభలేఖను తొలిత పేరంటాళ్లకు, దేవతలకు చూపించి తరువాత బంధువులకు ఇచ్చేందుకు తన పెద్దనాన్న విశ్వేశ్వరరావుతో కలిసి శనివారం సిద్ధమయ్యాడు. తన బైక్‌పై పెద్దనాన్నతో కలిసి దుగ్గి – నక్కపేట వెళ్లేందుకు శనివారం ఉదయం 7.30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో స్థానిక రాజుపేట ఖానాల దాటి వీరఘట్టం రోడ్డుకు తన బైక్‌ను తిప్పే సమయంలో వీరఘట్టం నుంచి సురేష్ స్కూల్‌కు చెందిన బస్సు ఢీకొంది. దీంతో బైక్ పైనుంచి మోహనరావుతో పాటు పెద్దనాన్న తుళ్లిపడ్డారు. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న మోహనరావు తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్పృహ కోల్పోయాడు. ఇంతలోనే తేరుకున్న పెద్దనాన్న విశ్వేశ్వరరావు కేకలు వేశాడు. స్థానికులు గుర్తించి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. ఇంతలోనే అక్కడి యువకులు మోహనరావును ఆస్పత్రికి వేరొక బైక్‌పై తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలో 108 వాహనం రావడంతో క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మోహనరావు మృతి చెందినట్టు వైద్యులు గుర్తించారు. విశ్వేశ్వరరావు స్వల్ప గాయాలతో కోలుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కె.ప్రయోగమూర్తి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్సును స్టేషన్‌కు తరలించారు.
కోటిపల్లిలో విషాదం
మోహనరావు అలియాస్ మణి మృతితో కోటిపల్లిలో విషాదం నెలకొంది. పెళ్లి సందడితో ఉండాల్సిన ఆ ఇంట కన్నీటి రోదనలు వినిపిస్తున్నాయి. తమ ఒక్కగానొక్క కుమారుడిపై విధికి కన్ను కుట్టిందని తల్లిదండ్రులు కృష్ణ, భాను గుండెలవిసెలా రోదిస్తున్నారు. వీరి రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మరొకరికి గాయాలు
రాజుపేట వద్ద ఘటన

మృత్యు ఒడిలోకి...

మృత్యు ఒడిలోకి...