
ప్రతి 3 నెలలకు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం
విజయనగరం అర్బన్: ఎస్సీ, ఎస్టీ కులాలు, షెడ్యూల్ తెగలపై జరుగుతున్న దాడులపై నిర్వహించే విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఇక నుంచి ప్రతి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. సమావేశం నిర్వహించిన అనంతరం మినిట్స్‌ను కలెక్టర్‌కు పంపాలని, అక్కడి అంశాలపై జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా 30న అన్ని మండలాల్లో ఎస్‌హెచ్‌ఓ, తహసీల్దార్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే జరపాలని, ఆ మీటింగ్ మినిట్స్‌ను పంపాలని ఆదేశించారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ కాలనీల్లో కొన్ని చోట్ల స్మశానాలు లేవని, మరికొన్ని చోట్ల ఆక్రమించుకున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ముగ్గురు ఆర్‌డీఓలు అన్ని ఎస్సీ కాలనీల్లో తనిఖీ చేసి శ్మశానాలు ఎక్కడెక్కడ లేవో, ఎక్కడెక్కడ ఆక్రమణకు గురయ్యాయో పరిశీలిలంచి నివేదిక పంపాలని ఆదేశించారు. కొన్ని చోట్ల 2 గ్లాస్‌ల విధానం ఇంకా అమలవుతోందని సమావేశం దృష్టికి తీసుకెళ్లగా చట్టంపై పోలీసులు అవగాహన కలిగించాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ రఘురాజు, డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఏఎస్పీ సౌమ్యలత, సోషల్ వెల్ఫేర్ డీడీ రామానందం, ఏపీజీఎల్‌ఐ ఎ.డి హైమవతి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ లక్ష్మణరావు, డీఎస్పీలు, ఆర్‌డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్