ఏసీపీ రంగారావును అభినందిస్తున్న కొత్వాల్ అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్: నేరాలు నిరోధించడం... నిందితుల్ని పట్టుకోవడం... కోర్టులో దోషులుగా నిరూపించడం... ఈ మూడూ పోలీసుల ప్రాథమిక విధులుగా చెబుతుంటారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో మొదటి రెండూ ఆశించినస్థాయిలో ఉంటున్నాయి. అయితే, అనేక కేసులు కోర్టుల్లో వీగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడానికి కేంద్రం నడుం బిగించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుసహా అన్ని దర్యాప్తు సంస్థల్లో ఉన్న అధికారుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన దర్యాప్తు అధికారులకు ప్రత్యేక అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాదిలోనే ప్రారంభించింది. తొలి అవార్డును హైదరాబాద్ పోలీసు విభాగంలోని ఏసీపీ ఎస్.రంగారావు గెల్చుకున్నారు. ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఈయన బేగంపేట ఏసీపీగా ఉండగా 2016లో తొమ్మిదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసు దర్యాప్తునకు ఈ అవార్డు లభించిందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో రంగారావును అభినందించారు. మీడియాతో మాట్లాడిన రంగారావు కేసు వివరాలు వెల్లడించారు.
కల్లు కాంపౌండ్ నుంచి కిడ్నాప్ చేసి...
బొల్లారం కళాసినగర్‌కు చెందిన చిన్నారి(9) తల్లిదండ్రులతో కలసి ఉండేది. తల్లి ఆశావర్కర్ కాగా తండ్రి పెయింటర్. 2016 జూలై 2న సాయంత్రం తల్లిదండ్రులు తమతోపాటు చిన్నారిని బొల్లారంలోని కల్లు కాంపౌండ్‌కు తీసుకువెళ్లారు. అక్కడ ఆ చిన్నారితో పాత నేరగాడైన అనిల్ ఆడుకుంటున్నట్లు కాసేపు నటించాడు. తర్వాత తల్లిదండ్రులిద్దరూ కల్లుమత్తు లో జోగుతున్నట్లు గుర్తించాడు. బొమ్మలు, తినుబండారాలు కొనిస్తానంటూ మాయమాటలు చెప్పి చిన్నారిని అపహరించాడు. బొల్లారం బజార్ రైల్వేస్టేషన్ మీదుగా అల్వాల్‌లోని కాలవేరి బ్యారెక్‌గా పిలి చే మిలటరీ ఏరియాలోకి తీసుకువెళ్లి లైంగిక దాడి చేసి గొంతు నులిమి చంపేశాడు. సమాచారం అందుకున్న అప్పటి బేగంపేట ఏసీపీ రంగారావు రంగంలోకి దిగారు. బొల్లారం ఠాణాలో కేసు నమోదు చేయించి నిందితుడి కోసం ఆరా తీశా రు. బొల్లారానికి చెందిన అనిల్‌పై అల్వాల్ పోలీసుస్టేషన్‌లో 15 చోరీలు, రెండు హత్యకేసులు ఉన్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఓ లైంగికదాడి కేసులో జైలుకు వెళ్లిన ఇతడు 2016 జూలై 1న (చిన్నారిపై అఘాయిత్యానికి ఒకరోజు ముందు) బయటకు వచ్చాడు.
కామాంధుడికి కఠిన శిక్ష పడాలనే..
‘చిన్నారిని పాశవికంగా చిది మేసిన, ఇలాంటి నేరచరిత్ర ఉన్న ఆ కామాంధుడికి కఠినశిక్ష పడాలని భావించా. దర్యాప్తులో ఎక్కడా చిన్నలోపం కూడా లేకుండా ఉండాలని అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ వచ్చా. నేరస్థలానికి వెళ్లి అక్కడ ఉన్న నిందితుడి చెప్పులు, కొన్ని వస్త్రాలు సీజ్ చేశాం. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీకి పంపడంతోపాటు నిందితుడి నుంచి నమూనాలు సేకరించాం. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి డీఎన్‌ఏ శాంపిల్స్ ద్వారా నేరం చేసింది అతడే అని నిర్ధారణ పొందాం. ఈ వివరాలతోపాటు చట్టంలో ఉన్న అవకాశం సద్వినియోగం చేసుకుంటూ అతగాడి నేర చరిత్రను సవివరంగా కోర్టు దృష్టిలో ఉంచాం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కోర్టు అనిల్‌ను దోషిగా నిర్ధారిస్తూ అరుదైన తీర్పు ఇచ్చింది. అనిల్‌కు జీవితఖైదు విధిస్తూ చనిపోయే వరకు జైల్లోనే ఉంచాలని స్పష్టం చేసింది. 2017 జూలై 26న వెలువడిన ఈ తీర్పు నేపథ్యంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కొత్వాల్ అనుమతి, ప్రోత్సాహంతో కేంద్రానికి పంపాం. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును అందుకోవడం బాధ్యతను మరింత పెంచింది’
– ఎస్.రంగారావు, ఏసీపీ
Comments
Please login to add a commentAdd a comment