
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్‌ను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే 21 నుంచి 31 వరకు పోలీసు ఫ్లాగ్‌డే పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు గురువారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు, విధినిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలు, పోలీసుల నుంచి ప్రజలు ఇంకా ఏ రకమైన సేవలు ఆశిస్తున్నారన్న అంశాలపై ఈ పది రోజులలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు వివరించారు. రాష్ట్రంలోని ప్రతీ పోలీసు స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించి, పోలీసు శాఖ కృషిని, సేవలను పౌరులకు తెలియచెబుతామన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
‘పోలీసులకు–పని జీవిత సమతుల్యత’, ’సమాజంలో లింగ సమానత్వాన్ని కాపాడటంలో పోలీసుల పాత్ర’ అనే అంశాలపై ఎస్సై, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ స్థాయి అధికారులకు కూడా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సీనియర్ పోలీసు అధికారులు అమరుల ఇళ్లను సందర్శించి వారి కుటుంబాల బాగోగులు, వారి అవసరాలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలని డీజీపీ ఆదేశించారు.