సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారుల బదిలీలకు త్వరలో మోక్షం కలగనుంది. అదనపు డీజీపీల నుంచి ఎస్పీ ర్యాంకు అధికారుల వరకు భారీ స్థాయిలో బదిలీలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కీలక విభాగాలు మొదలుకొని 80 శాతం జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్లలో ఉన్న డీసీపీలను బదిలీ చేసేందుకు ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలుస్తోంది.
తెలంగాణ పోలీస్ శాఖకు ఆయువుపట్టు లాంటి హైదరాబాద్ కమిషనరేట్‌కూ కొత్త బాస్‌ను నియమించేందుకు కసరత్తు జరిగినట్టు తెలిసింది. అంజనీకుమార్ స్థానంలో ఇటీవల కేంద్ర డిప్యుటేషన్ పూర్తిచేసుకున్న అదనపు డీజీపీ సీవీ ఆనంద్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అదేవిధంగా మరో అదనపు డీజీపీ జితేందర్ పేరూ ప్రతిపాదనలో ఉన్నట్లు తెలిసింది. ఇకపోతే రాచ కొండ కమిషనరేట్‌కూ కొత్త చీఫ్‌ని నియమించనున్నారు. మహేష్ భగవత్ స్థానంలో ఐజీ నాగిరెడ్డి లేదా ఐజీ డీఎస్ చౌహాన్ ఉండనున్నట్టు సమాచారం.
దర్యాప్తు విభాగాలకు కొత్త బాస్‌లు
రాష్ట్రంలో ఉన్న రెండు దర్యాప్తు విభాగాలకు నూతన బాస్‌లను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు డైరెక్టర్ జనరల్‌గా అదనపు డీజీపీ జితేందర్ లేదా అంజనీకుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది.
అదేవిధంగా నేర పరిశోధన విభాగానికి (సీఐడీ) చీఫ్‌గా మహేష్ భగవత్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. విజిలెన్స్‌తోపాటు అవినీతి నియంత్రణనూ ఒకే విభాగం కిందకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నందున రెండింటికీ కలిపి ఒకే డీజీని నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సీఐడీ చీఫ్‌గా ఉన్న గోవింద్‌సింగ్‌ను జైళ్ల శాఖకు డైరెక్టర్ జనరల్‌గా నియమించే అవకాశం ఉంది.
లాంగ్ స్టాండింగ్‌కు స్థాన చలనం
చాలాకాలంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీపీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డితోపాటు సిబ్బంది విభాగం అదనపు డీజీపీగా ఉన్న బి.శివధర్‌రెడ్డిని సైతం బదిలీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. వీరిలో ఒకరిని శాంతి భద్రతల అదనపు డీజీపీగా నియమిస్తారని, మరొకొరిని ప్రొవిజినల్ అండ్ లాజిస్టిక్ అదనపు డీజీపీగా బదిలీచేసే అవకాశాలున్నట్టు తెలిసింది. రాచకొండలో అదనపు సీపీగా ఉన్న సుధీర్‌కుమార్‌ను ఒక జోన్‌కు ఐజీగా నియమించే అవకాశముంది.
అదేవిధంగా నగర కమిషనరేట్లలో డీఐజీలుగా ఉన్న ఎం.రమేష్‌రెడ్డి, ఏఆర్.శ్రీనివాస్, విశ్వప్రసాద్‌లను కొత్తగా ఏర్పడబోతున్న రేంజులకు డీఐజీలుగా లేదా జాయింట్ సీపీలుగా బదిలీ చేయనున్నట్టు తెలిసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రవిగుప్తాకు సైతం స్థానచలనం కలిగే అవకాశముంది.
కాగా, ప్రస్తుతం డీఐజీ పదోన్నతి కోసం వేచిచూస్తున్న సీనియర్ ఎస్పీలను దర్యాప్తు విభాగాల్లోకి తీసుకొని కీలక కేసుల పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తారన్న చర్చ జోరుగా నడుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం జిల్లాల నుంచి బదిలీ అయ్యే అవకాశం ఉన్న అధికారులను సీఐడీతోపాటు ఏసీబీలో నియమించే అవకాశం ఉంది.
జిల్లాలకు కన్ఫర్డ్ ఐపీఎస్‌లు
కన్ఫర్డ్ ఐపీఎస్ జాబితాలోకి వచ్చిన 23 మంది అధికారులను వివిధ జిల్లాలతోపాటు ఎస్పీ హోదా ఉన్న కమిషనరేట్లకు బదిలీ చేయా లని పోలీస్ శాఖ ప్రతిపాదించినట్టు సమాచారం. అదేవిధంగా జిల్లాల్లో లాంగ్ స్టాండింగ్‌లో ఉన్న ఐపీఎస్, నాన్‌కేడర్ అధికారులను రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్‌లోని జోన్లకు డీసీపీలుగా నియమించేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment