సీనియారిటీలో నాలుగో స్థానం
రాజీవ్‌రతన్ మృతితో మూడో ప్లేస్‌లోకి
కీలక కేసుల నేపథ్యంలో సీవీ ఆనంద్‌కు బ్రేక్
శివధర్‌రెడ్డి పేరు వినిపించినా ఆయన అదనపు డీజీనే కావడంతో..
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి రాష్ట్ర డీజీపీ మార్పుపై కసరత్తులు జరుగుతున్నాయి. తెరపైకి కొందరు సీనియర్ అధికారుల పేర్లు వచ్చినా అవకాశం మాత్రం అనూహ్యంగా డాక్టర్ జితేందర్‌కు దక్కింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చివరిలో డీజీపీగా కొనసాగిన సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ గతేడాది డిసెంబర్ 4న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలోనే నాటి పీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డిని ఇంటికి వెళ్లి కలిసి అభినందించారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం అంజనీకుమార్‌ను సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో రవి గుప్తాను నియమిస్తూ మరసటి రోజు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏసీబీలో కీలకంగా మారిన ఆనంద్...
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఏడాది జనవరి నుంచి దఫదఫాలుగా పోలీసు బదిలీలు జరిగినా రవి గుప్తాను మాత్రం కొనసాగించారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో కొత్త అధికారిని డీజీపీగా నియమించడానికి కసరత్తులు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రానికి సంబంధించి డీజీపీ హోదాలో ఉన్న అధికారుల సీనియారిటీ జాబితాలో తొలి పేరు 1990 బ్యాచ్‌కు చెందిన రవి గుప్తాదే.
ఈ తర్వాతి స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌రతన్ ఉండగా... ఇటీవల ఆయన కన్ను మూయడంతో అదే బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్ ఆ స్థానంలోకి వచ్చారు. ఈ పరిణామంతో 1992 బ్యాచ్‌కు చెందిన జితేందర్ సీనియారిటీ జాబితాలో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి వచ్చారు. రవి గుప్తా తర్వాత సీనియర్ అయిన సీవీ ఆనంద్ ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్నారు. ఏసీబీ దర్యాప్తు చేస్తున్న గొర్రెల స్కామ్ సహా అనేక కేసులు కీలక దశలో ఉన్నాయి.
ఈ విభాగానికి డైరెక్టర్‌గా పని చేసిన ఏఆర్ శ్రీనివాస్ సైతం గత నెల ఆఖరున పదవీ విరమణ చేశారు. దీంతో ఏసీబీలో ఆనంద్ కీలకం కావడంతో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ.. ఆయనకు ఈసారి డీజీపీగా అవకాశం దక్కలేదు. ఇక అనుభవం, సమర్థతతో పాటు వివాదరహితుడు, మృదుస్వభావి కావడంతోనే జితేందర్‌ను డీజీపీ పోస్టు వరించింది.
పదోన్నతులు పూర్తి కాకపోవడంతోనే...
ప్రస్తుతం నిఘా విభాగాధిపతిగా ఉన్న 1994 బ్యాచ్‌కు చెందిన బి.శివధర్‌రెడ్డి పేరు కూడా డీజీపీ రేసులో వినిపించిది. అయితే ఆయన ప్రస్తుతం అదనపు డీజీ హోదాలో ఉన్నారు. డీజీపీ హోదాలో ఉన్న రాజీవ్‌రతన్ కన్ను మూయడం, సందీప్ శాండిల్య పదవీ విరమణ చేయడం రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. అదనపు డీజీల సీనియారిటీ జాబితాలో ముందున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డితో (హైదరాబాద్ పోలీసు కమిషనర్) పాటు శివధర్‌రెడ్డికీ డీజీలుగా పదోన్నతి రావాల్సి ఉంది. అయితే ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో లైన్ క్లియర్ కాలేదు.
పూర్తి స్థాయి డీజీపీని నియమించాలంటే...
రాజకీయ కారణాల నేపథ్యంలో కొన్నేళ్లుగా రాష్ట్ర పోలీసు విభాగానికి ఇన్‌చార్జ్ లేదా ఫుల్ అడిíÙనల్ చార్జ్ (ఎఫ్‌ఏసీ) డీజీపీలే నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి డీజీపీగా నియమించాలంటే సీరియారిటీ ఆధారంగా ఐదుగురు ఐపీఎస్ అధికారుల జాబితాను కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. సీనియారిటీ, గతంలో పని చేసిన స్థానాలు, అనుభవం, సెంట్రల్ డెప్యుటేషన్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకునే కేంద్రం వీటిలో మూడు పేర్లను వెనక్కు పంపుతుంది.
ఆ ముగ్గురి నుంచి ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించుకోవాల్సి ఉంటుంది. శ్రీనివాసరెడ్డి, శివధర్‌రెడ్డి పదోన్నతుల తర్వాత కేంద్రానికి సీనియారిటీ జాబితా పంపితే అందులో వీరితో పాటు రవి గుప్త, సీవీ ఆనంద్, జితేందర్‌ల పేర్లు ఉంటాయి. వీటిలో ఏ మూడు పేర్లు వెనక్కు వస్తాయి? వారిలో ఎవరిని డీజీపీగా నియమిస్తారు? లేదా గతంలో మాదిరిగా జితేందర్ పదవీ విరమణ చేసే వరకు, ఆ తర్వాత కూడా ఎఫ్‌ఏసీ డీజీపీతోనే నడిపిస్తారా? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు.
Comments
Please login to add a commentAdd a comment