‘మత్తు’ చిత్తుకు ద్విముఖ వ్యూహం | DGP Jitender Exclusive Interview with Sakshi: Telangana | Sakshi
Sakshi News home page

‘మత్తు’ చిత్తుకు ద్విముఖ వ్యూహం

Published Sat, Aug 10 2024 4:48 AM | Last Updated on Sat, Aug 10 2024 7:21 AM

DGP Jitender  Exclusive Interview with Sakshi: Telangana

డ్రగ్స్, గంజాయి సప్లై చైన్‌ కట్టడి..

యువతలో అవగాహనకు చర్యలు చేపడుతున్నాం 

పబ్బులు, క్లబ్బుల్లోనూ నిఘా పెంచాం 

సైబర్‌ నేరాలను సమర్థంగా ఎదుర్కొంటున్నాం.. మహిళా, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాం 

చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసు సిబ్బందిపైనా చర్యలు.. గత నెల రోజులుగా పదవీ బాధ్యతలు ఎంతో సంతృప్తినిచ్చాయి 

‘సాక్షి ’ప్రత్యేక ఇంటర్వ్యూలో డీజీపీ జితేందర్‌

సాక్షి, హైదరాబాద్‌: యువత భవిష్యత్తును చిత్తు చేసే ‘మత్తు’మహమ్మారి కట్టడికి ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు డీజీపీ జితేందర్‌ స్పష్టం చేశారు. ఒకవైపు డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల ముఠాల సప్లై చైన్‌ కట్టడి మరోవైపు మత్తు పదార్థాల వైపు యువత వెళ్లకుండా అవగాహన పెంచే వ్యూహంతో పనిచేస్తున్నామన్నారు. మత్తుదందాలో ఎంతటివారున్నా చట్టప్రకారం కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు.

అదేవిధంగా పౌరుల కష్టార్జితాన్ని దోచుకొనే సైబర్‌ ముఠాలను సమర్థంగా ఎదుర్కొంటున్నామని.. గత ఆరు నెలల్లోనే రూ. 150 కోట్లను బాధితులకు రీఫండ్‌ చేయించగలిగామని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని, మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టామ న్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రాష్ట్ర ఐదో డీజీపీగా జూలై 10న బాధ్యతలు స్వీకరించిన జితేందర్‌ శనివారంతో పదవీబాధ్యతలు చేపట్టి నెల రోజులు పూర్తవుతున్న సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన విజన్‌ను ఆవిష్కరించారు. 

ప్రశ్న: పోలీస్‌ బాస్‌గా మీ నెల రోజుల పనితీరు ఎంతమేర సంతృప్తినిచి్చంది? 
జవాబు: డీజీపీగా ఈ నెల రోజుల పనితీరు ఎంతో సంతృప్తినిచి్చంది. అసెంబ్లీ సమావేశాలు సజావుగా పూర్తి చేశాం. భారీ నేరాలేవీ జరగకుండా కట్టడి చేశాం. పోలీస్‌ కమిష నర్లు, జిల్లా ఎస్పీలతో ఓ రోజంతా సమావేశమై రాష్ట్రంలో పోలీసింగ్‌ తీరుతెన్నులు, దృష్టిపెట్టాల్సిన అంశాలు, మత్తుపదార్థాల రవాణా, సైబర్‌ నేరాల కట్టడికి తీసుకోవాల్సిన చర్య లపై స్పష్టత ఇవ్వగలిగాం. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఫలితాలు మెరుగయ్యాయి. ప్రజలకు అత్యవసర సేవలందించే డయల్‌ 100 సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టా. డయల్‌ 100 రెస్పాన్స్‌ టైం గతంలో కంటే సరాసరిన 5నిమిషాలు తగ్గింది. 

ప్రశ్న: మీ ప్రధాన ఫోకస్‌ ఏ అంశాలపై ఉండనుంది? 
జవాబు: శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ప్రజలను ఆర్థికంగా గుల్ల చేస్తున్న సైబర్‌ నేరాల కట్టడిపై, యువతను పెడదోవ పట్టించే డ్రగ్స్, గంజాయి వంటి మత్తు ముఠాల అణచివేతపై ప్రధానంగా దృష్టి పెడుతున్నా. అదే సమయంలో మహిళలు, చిన్నారుల భద్రతలో రాజీ ఉండదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారెవరైనా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు. 

ప్రశ్న: రాష్ట్రవ్యాప్తంగా హత్యలు, అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు మీరు తీసుకుంటున్న చర్యలేమిటి? 
జవాబు: రాష్ట్రంలో గతంతో పోలిస్తే నేరాల సంఖ్యలో చెప్పదగ్గ స్థాయిలో పెరగలేదు. హత్యలు, అత్యాచారాలు పెరిగాయని కొన్ని రకాల దు్రష్పచారాలు జరుగుతున్నాయి. ఈ విషయాలపై గణాంకాలతో సహా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం అసెంబ్లీలో ఇటీవలే స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణలో ఎంతో కఠినంగా ఉన్నాం. విజుబుల్‌ పోలీసింగ్‌ను పెంచాం. 

ప్రశ్న: డ్రగ్స్‌ కేసుల్లో శిక్షలు అంతంతమాత్రమేనన్న విమర్శలపై ఏమంటారు? 
జవాబు: కొన్ని సాంకేతిక కారణాలతో గతంలో ఎన్‌డీపీఎస్‌ చట్టాల కింద కేసుల్లో శిక్షలు తక్కువగానే ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టీజీ యాంటీనార్కోటిక్స్‌ బ్యూరోతో కలిసి దాదాపు 18 వేల మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పక్కాగా కేసుల నమోదు, దర్యాప్తుతో శిక్షలు పెరిగాయి. ఈ నెల రోజుల్లో నాలుగు ఎన్‌డీపీఎస్‌ కేసుల్లో శిక్షలు పడ్డాయి. ఇందులో రెండు కేసుల్లో దోషులకు పదేళ్ల చొప్పున జైలు శిక్ష ఖరారైంది. కొందరు విదేశీయులు అక్రమంగా ఇక్కడే ఉంటూ ఇక్కడ డ్రగ్స్‌ దందాలో దిగుతున్నారు. అలాంటి వారిపై దృష్టిపెట్టాం. డ్రగ్స్‌ కేసుల్లో దొరికిన వారిని స్వదేశాలకు పంపుతున్నాం. గత నెల రోజుల్లో ముగ్గురు విదేశీయులను వెనక్కి పంపాం. 

ప్రశ్న: దొంగతనం కేసులో ఇటీవల ఓ దళిత మహిళను పోలీసులు కొట్టడం వంటి ఘటనల్లో ఏం చర్యలు తీసుకుంటున్నారు?  
జవాబు: చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసు సిబ్బందిపైనా కఠినంగానే ఉంటాం. ఇందులో ఏ మినహాయింపు ఉండదు. క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సిందే. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో సిబ్బందిని ఎప్పటికప్పుడు సెన్సిటైజ్‌ చేస్తూనే ఉంటాం. 

ప్రశ్న: మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేంటి? 
జవాబు: కేవలం మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడంతోనే మార్పు రాదు. దీనిపై తల్లిదండ్రులు సైతం ఆలోచించాలి. తమ పిల్లలే ప్రమాదాల బారిన పడతారన్న విషయాన్ని వారు గుర్తిస్తేనే దీనికి సరైన పరిష్కారం దొరుకుతుంది. రోడ్డు ప్రమాదాల నియ ంత్రణకు అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాం. 

ప్రశ్న: అతిపెద్ద ముప్పుగా మారిన సైబర్‌ నేరాలను ఎలా ఎదుర్కొంటున్నారు? 
జవాబు: సైబర్‌ నేరాల కట్టడికి ప్రత్యేకంగా బ్యూరో ఏర్పాటు చేసిన ఏకైన రాష్ట్రం తెలంగాణ. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైబర్‌ నేర ముఠాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. గత ఆరు నెలల్లో సైబర్‌ బాధితులకు రూ. 150 కోట్లు రీఫండ్‌ చేయించడం గొప్ప ఏచీవ్‌మెంట్‌. ఒకవైపు సైబర్‌ కేసుల సత్వర దర్యాప్తు మరోవైపు మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం.  

ప్రశ్న: డ్రగ్స్, గంజాయిని ఎంత మేర కట్టడి చేశామనుకుంటున్నారు? 
జవాబు: మత్తు పదార్థాలపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. పూర్తిస్వేచ్ఛ ఉండటంతో డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోకి గంజాయి రవాణా కాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో మొబైల్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో తనిఖీలు పెంచాం. ఫలితంగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడుతోంది. గతానికి భిన్నంగా పబ్బులు, క్లబ్బుల్లోనూ జాగిలాలతో తనిఖీలు చేస్తున్నాం. కేసుల నమోదు పెరిగింది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ మాదిరిగానే గంజాయి కట్టడికి గంజాయి తాగిన వాళ్లను గుర్తించే కిట్లను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ వంటి కమిషనరేట్లతోపాటు అన్ని జిల్లాలకు పంపాం.

సైబర్‌ నేరాల కట్టడిలో యువత ముందుండాలి
సైబర్‌ సెక్యూరిటీ హ్యాకథాన్‌లో డీజీపీ జితేందర్‌

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరాల కట్టడిలో యువత ముందుండాలని డీజీపీ జితేందర్‌ పిలుపునిచ్చారు. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, యువత వారి ఆలోచన విధానాన్ని విస్తృతపర్చుకోవాలన్నారు. సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతోకలిసి టీజీ సైబర్‌ సెక్యూరిటీ  ‘ది గ్రేట్‌ యాప్‌సెక్‌ హ్యాకథాన్‌ 2024’ నిర్వహిస్తోంది. శుక్రవారం బంజారా హిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో నిర్వహించిన ఈ హ్యాకథాన్‌ ప్రారంభ కార్యక్రమానికి డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత, సామాజిక భద్రత విషయంలో సైబర్‌ భద్రత అత్యంత ప్రధానంగా మారిందని డీజీపీ అభిప్రాయపడ్డారు. 

టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖాగోయల్‌ మాట్లాడుతూ ౖఈ హ్యాకథాన్‌లో 20కి పైగా దేశాల నుంచి 10 వేల మంది పాల్గొంటున్నారని చెప్పారు. ఈనెల 22న ఈ హ్యాకథాన్‌ ఫలితాలు వెల్లడిస్తామని, తెలంగాణలో మొదటి ఐదుగురు, జాతీయస్థాయిలో తొలి ఐదుగురు, అంత ర్జాతీయ స్థాయిలో తొలి ఐదుగురిని విజేతలుగా ప్రకటిస్తామ న్నారు. వీరికి తెలంగాణ సైబర్‌సెక్యూరిటీ బ్యూరోతో కలిసి పనిచేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. 

ఐటీ ఎలక్ట్రానిక్స్‌ విభాగం డిప్యూటీ సెక్రెటరీ భవేశ్‌ మిశ్రా మాట్లాడుతూ  గతేడాది సైబర్‌ క్రైమ్‌ కారణంగా రూ. 7,500 కోట్లు కోల్పోగా, ఆ సొమ్మును టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కాపాడారని చెప్పారు. దీనికి సంబంధించి రీఫండ్‌ ఆర్డర్లను బాధితులకు ఈ సందర్భంగా డీజీపీ జితేందర్‌ చేతులమీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో సెబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీలు దేవేందర్‌సింగ్, హర్షవర్ధన్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటాం
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజా పరిణామాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు డీజీపీ జితేందర్‌ స్పందించారు. హైదరాబాద్‌లో ఉంటున్న బంగ్లా దేశీ యులపై నిఘా ఉంచామన్నారు. హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారమే నడుచుకుంటామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement