సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సీపీ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలు, ఓ శాఖ కార్యదర్శి, మరో శాఖ డైరెక్టర్, ఇంకో శాఖ కమిషనర్లపై బదిలీ వేటు వేసింది.
వీరిలో 18 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలకు శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని ఆంక్షలు విధించింది. బదిలీ అయిన అధికారులు సత్వరమే బాధ్యతల నుంచి తప్పుకొని తమ తర్వాతి స్థానంలో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ మూడు శాఖలకు కొత్త ముఖ్య కార్యదర్శులతోపాటు బదిలీ వేటుపడిన 20 మంది అధికారుల స్థానంలో ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోగా కొత్త అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది
ఈ క్రమంలో నూతన సీపీలు, ఎస్పీల నియామకంపై డీజీపీ అంజనీకుమార్ కసరత్తు ప్రారంభించారు. సీఈసీకి పంపే లిస్ట్‌ను డీజీపీ సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ సీపీ రేసులో మహేష్ భగవత్, షికా గోయల్, శివధర్‌రెడ్డి, కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, నాగిరెడ్డి, సజ్జనార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ముగ్గురి పేర్లతో సీఈసీకి ప్రభుత్వం లిస్ట్ పంపనుంది. ప్రతి పోస్టుకు ముగ్గురు పేర్లతో జాబితాను ప్రభుత్వం పంపనుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ఆయా పోస్టుల్లో ఈసీ ఎంపిక చేయనుంది.
రాష్ట్ర సర్కార్ పంపిన ముగ్గురి జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు ఉంటే ఈసీ తిరస్కరించే అవకాశం ఉంది. మళ్లీ కొత్తగా పేర్లు ప్రతిపాదన చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ కోరనుంది. ఈసీ ఫైనల్ చేసిన తర్వాత ఆయా నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment