నాన్నకు స్వాతిముత్యంలో అవకాశం రాలేదు | Special Interview With Sakshi Ranga Rao Son Siva | Sakshi
Sakshi News home page

నాన్నకి కారం అంటే ఇష్టం

Published Sun, Jan 17 2021 1:38 PM | Last Updated on Sun, Jan 17 2021 1:38 PM

Special Interview With Sakshi Ranga Rao Son Siva

రంగావఝల రంగారావు... ఈ పేరు ఎవ్వరికీ తెలియదు... సాక్షి రంగారావు... అందరికీ పరిచితులే...సినిమాలలో విలన్‌ పాత్రలు... జీవితంలో సౌమ్యతత్త్వం.. సినిమాలలో కరణీకం... జీవితంలో అప్పులంటే భయం.. బాపు సాక్షితో వెండితెరకు పరిచితులై సాక్షి రంగారావుగా మారారు. తనకు తానే పేరు పెట్టుకున్న, వారి కుమారుడు సాక్షి శివతో ఈ వారం సినీ పరివారం...

నాన్న ప్రకాశం జిల్లా కలవకూరు (అద్దంకి – సింగర కొండ మధ్య)లో పుట్టారు. మా తాతగారు లక్ష్మీనారాయణగారు కావిడి కట్టుకుని కాశీ దాకా నడిచి వెళ్లి వచ్చారు. తాతగారు... నాన్నగారి చిన్నవయసులోనే పోవడం వల్ల, మా మామ్మగారు రంగనాయకమ్మ గారి దగ్గర కాకుండా, మచిలీపట్నం దగ్గర పామర్రులో ఉంటున్న నాన్నగారి పెద్దమ్మ బుచ్చి రావమ్మగారి దగ్గర పెరగవలసి వచ్చింది. ఆవిడ వంటలు చేసి మా నాన్నను పెంచారు. అమ్మగారి పేరు బాలా త్రిపురసుందరి. మా తల్లిదండ్రులకు మేం ముగ్గురం పిల్లలం. అక్క కనక వరలక్ష్మిని అమ్ములు అని పిలిచేవారు. ఒకరోజు నాన్నకి ఒక స్వామిజీ కలలోకి వచ్చి, రామశివయ్య అని పేరు పెట్టమన్నారుట. అందుకని అన్నయ్యకు ఆ పేరు పెట్టి, నాకు ఆ పేరును తిరగేసి శివరామయ్య అని పెట్టారు. అన్నయ్య బిఎస్‌సి, అక్కయ్య ఏఎంఐఈ చదువుకుని మంచి స్థాయికి ఎదిగారు. నేను ప్లస్‌ టూ ఫెయిల్‌ కావటంతో, నా గురించి బెంగపెట్టుకున్నారు. మా వివాహ సమయానికి నాది చిన్న ఉద్యోగం. ప్రస్తుతం నేను సీరియల్స్‌లో నటిస్తున్నాను.

ఉంగరం ఇచ్చారు..
నాన్నగారి చదువు పూర్తి అయ్యాక వైజాగ్‌లో పనిచేశారు. ఆ తరవాత డిప్లొమా ఇన్‌ యాక్టింగ్‌ చేశారు. ప్రముఖ రంగస్థల నటులు కుప్పిలి వెంకటేశ్వరరావు గారి దగ్గర శిష్యరికం చేశారు. ఆయన నాన్నకి బంగారు ఉంగరం బహూకరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొంతమంది సన్నిహితులు, ఆరు నెలలకు సరిపడా డబ్బులు పోగు చేసి నాన్నను మద్రాసు పంపారు. డబ్బులు అయిపోతున్న సమయంలో భగవంతుడు బాపురమణల రూపంలో ప్రత్యక్షమై, వారు తీస్తున్న మొదటి సినిమా ‘సాక్షి’లో నటించే అవకాశం ఇచ్చారు. అక్కడ మొదలైన అదృష్ట ఘడియలు, తుది శ్వాస వరకు ఆయనను వరిస్తూనే వచ్చాయి. అమ్మ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయించి మద్రాసు రప్పించారు.

కారం అంటే ఇష్టం...
నాన్నకి కారం అంటే ఇష్టం. అల్లం, పచ్చిమిర్చి, వాము వంటి ఘాటైన పదార్థాలు వంటకాలలో ఉండాలి. అమ్మ కష్టపడి కారం వంటకాలు నేర్చుకుంది. ఇంటి భోజనమే చేసేవారు. ఇంటి దగ్గర ఉంటే పంచె, లాల్చీ కట్టుకునేవారు. చెప్పులు లేకుండానే బయటకు వెళ్లిపోయేవారు. మేం కొద్దిగా పెద్దవాళ్లం అయినప్పటి నుంచి నాన్న మాతో చాలా స్నేహంగా ఉండేవారు. అవకాశం కుదిరినప్పుడు క్యారమ్‌ బోర్డు, గోళీలు, చెస్, వీడియో గేమ్స్‌ ఆడేవారు. సినిమాలు చూపించేవారు. 

ఆయన సినిమా అంటే...
విశ్వనాథ్‌గారికి మా నాన్నగారంటే చాలా ఇష్టం. ఆయన తన ప్రతి సినిమాలోను నాన్నకి అవకాశం ఇచ్చారు. తెలుగు ‘స్వాతిముత్యం’ లో అవకాశం రాలేదు. హిందీ ‘ఈశ్వర్‌’లో వేషం ఇచ్చి కాంపెన్సేట్‌ చేశారు. బాపుగారు పద్మాలయ సంస్థ... అందరూ నాన్నకి అవకాశం ఇవ్వటం వల్లే, ఇన్ని వందల సినిమాలో నటించారు. డబ్బు సంపాదించుకోలేకపోయినా, గొప్ప పేరు వచ్చింది, నాన్న నటించిన ‘ఆడదే ఆధారం’ సినిమా చూసినప్పుడు ఏడుపు ఆపుకోలేకపోయాను. నాన్నగారితో కలిసి నేను నటించిన రెండుమూడు సీరియల్స్‌లోనూ ఆయనకు కొడుకుగా నటించడం నా అదృష్టం. శంకరాభరణం సినిమా టైమ్‌లో ఐదేళ్లు కాషాయం కట్టుకుని, సన్యాసం పుచ్చుకుంటానన్నారు. మాకు గుండు కొట్టేశారు. రాళ్లపల్లి గారు, ఇరుగుపొరుగు వారి మాట మీద ఆ ప్రయత్నం విరమించుకున్నారు. తెల్ల పంచె లాల్చీ వేసుకోవటం ప్రారంభించారు.

కన్యాశుల్కం అంటే కోపం..
‘కన్నాశుల్కం’ ఏడు గంటల నాటకంలో నటించాలనుకున్నారు. మరో వారం రోజుల్లో ప్రదర్శన అనగా ... ఉన్నట్టుండి కుప్ప కూలిపోయారు. ఆ బాధలో నేను, ‘కన్యాశుల్కం నాన్నగారిని బలితీసుకుంది’ అని కోపం తెచ్చుకున్నాను. నాన్నగారి కోర్కె నెరవేర్చడానికి సంకల్పించుకుంటున్నాను. 

ఆ భయం వల్లే...
నాకు ‘సాక్షి రంగారావు’ అని బాపు గారు పేరు పెట్టారు. నీకు నువ్వే పెట్టుకున్నావు. అందుకే ఆయనను క్షమించమని అడిగాను... అని నాన్న నన్ను స్నేహంగా మందలించారు. ‘ఏరా ఏం చదువుతున్నావు?’ అంటూ వెనకాల నుంచి తుండు గుడ్డతో కొట్టేవారు. ఆ దెబ్బలకు భయపడేవాడిని. నేను ఫీల్డ్‌లోకి రాగానే అప్పు చేసి కారు కొన్నానన్న కోపంతో, నా కారు ఎక్కలేదు. నాన్నగారు అప్పట్లో ఓ కోరిక కోరారు. ‘లక్షరూపాయలు బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చూపించు’ అని.  నాన్నకు అప్పు అంటే భయం. ఎవరు మోసం చేసినా పట్టించుకునేవారు కాదు. నాన్నగారు మొదటి సినిమా నుంచి ఆఖరి సినిమా వరకు ‘ఈ పాత్ర నేను చేయగలనా’ అనే భయంతోనే ఉండేవారు. కె. విశ్వనాథ్‌గారి సినిమాలో నటించవలసి వస్తే చాలు, ‘అమ్మో!’ అనుకునేవారు. ఆ భయం ఉంది కాబట్టే కళ్లు నెత్తికి ఎక్కకుండా మంచి పేరు తెచ్చుకున్నాను అంటుండేవారు.

అవమానంగా భావించారు..
నాన్నకి అరవై వసంతాలు పూర్తి కాగానే షష్టి పూర్తి ఘనంగా చేశాం. మనసు బాగోలేకపోతే రామకృష్ణ మఠానికి వెళ్లేవారు. ఒకసారి ఒక పెద్దావిడ రామకృష్ణ మఠంలో నాన్న సిగరెట్‌ కాల్చిన తరవాత, అదే చేత్తో ప్రసాదం తేవటం చూశారట. ఆయన తన దగ్గరున్న ప్రసాదం ఆవిడకు పెడితే, ఆవిడ ‘సిగరెట్‌ వాసన వస్తోంది’ అన్నారట. నాన్న అవమానంగా భావించి, ఆ రోజు నుంచి సిగరెట్‌ మానేశారు. పరిశ్రమలో షైన్‌ అవ్వడం ఎంత కష్టమో, ఎన్ని ఒత్తిడులు ఉంటాయో, ఇప్పుడు నాకు తెలుస్తోంది. సినిమాలలో బిజీగా ఉండటం వలన నాన్న చాలా సరదాలు వదులుకున్నారని అనుభవం మీద అర్థం అయ్యింది. 63 సంవత్సరాలు నిండకుండానే 2005లో కన్నుమూశారు. నాన్న ఇంకా నాలోనే ఉన్నారనుకుంటాను.
– సంభాషణ: వైజయంతి పురాణపండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement