అభిప్రాయం
పార్లమెంట్ సమావేశాలు దేశ రాజధాని ఢిల్లీ వెలుపల, ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లోని ఏదైనా రాష్ట్రంలో నిర్వహించాలని ఇటీవల డిమాండు వస్తోంది. ఇది దేశానికి రెండో రాజధాని అవసరమనే వాదనకు దారి తీయవచ్చనేది ఒక అభిప్రాయం. రాజధాని ఢిల్లీలో తీవ్రమైన వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దక్షిణాదిలోనూ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని ఇటీవల వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీ, పార్లమెంటరీ వ్యవహా రాల శాఖ మంత్రి కిరణ్ రిజిజూలకు ఆయన లేఖ రాశారు. ఢిల్లీలోని వాతావరణం వల్ల ఎంపీల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతోందనీ, దక్షిణాదిన పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం వల్ల ఈ ఇబ్బంది తొలగడంతో పాటు, జాతీయ సమగ్రత వెల్లివిరుస్తుందనీ ఆయన చెబుతున్నారు.
దేశానికి మరో రాజధాని కావాలని ప్రత్యేకించి ఎవరూ ప్రస్తుతానికి డిమాండ్ చేయనప్పటికీ ఆ ప్రతిపాదన మాత్రం పాతదే. రాజధానిలోని పార్లమెంట్‌లో కాకుండా, బయట రాష్ట్రాల్లో సమావేశాలను నిర్వహిస్తే సాంకేతికంగా రెండో రాజధానిని అంగీకరించినట్లేనని కొందరు మేధావులు చెబుతున్నారు. అయితే ఈ అంశాన్ని మరికొందరు విభేది స్తున్నారు. కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రయోజనాల కోసం రాజధాని నగరాన్ని వినియోగిస్తార ని, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇతర రాష్ట్రాలు లేదా ప్రాంతాలను... వేర్వేరు ప్రయోజనాల కోసం వినియోగిస్తారనేది కొందరు మేధావుల అభిప్రాయం. ఈ విధంగా ప్రాధాన్యతనిచ్చే ఇతర నగరం మరో అధికారిక రాజధానిగా పరిగణించబడదని వారు చెబుతున్నారు.
చట్టబద్ధంగా నిర్వచించిన ఒక రాజధాని ఉన్న సంద ర్భంలో... రాజధాని అవసరాలు తీర్చేందుకు ప్రత్యేకంగా మరో రాష్ట్రంలోని నగరాన్ని రాజధానిగా పేర్కొని ఉపయో గించుకుంటే మాత్రం తప్పేమిటని మరికొందరు వాదిస్తు న్నారు. ఒకటికన్నా ఎక్కువ రాజధానులను కలిగి ఉన్న దేశాలు ప్రపంచంలో పదమూడు ఉన్నాయి. మూడు రాజ ధానీ నగరాలను కలిగి ఉన్న ఏకైక దేశంగా దక్షిణాఫ్రికా నిలి చింది. ‘ప్రిటోరియా’ పరిపాలన, కార్యనిర్వాహక రాజ ధానిగా;‘ కేప్ టౌన్’ శాసన రాజధానిగా, ‘బ్లూమ్ ఫోంటైన్’ న్యాయ రాజధానిగా ఉన్నాయి.
1950వ దశకం నుంచే దక్షిణ భారతదేశంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలి అన్న డిమాండ్ మొద లైందని ఎంపీ గురుమూర్తి చెబుతున్నారు. ఈ అంశంపై 1968లో స్వతంత్ర ఎంపీ ప్రకాశ్ వీర్ శాస్త్రి ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెట్టారనీ, నాడు 18 మంది ఎంపీలతో ఒక కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేశారనీ ఆయన గుర్తు చేస్తున్నారు. అప్పటి కేరళ, మైసూరు ప్రభుత్వాలు పార్లమెంటు సమావేశాలకు మౌలిక వసతులు కల్పిస్తామని ముందుకు వచ్చాయనీ, అయితే అప్పట్లో సాధ్యాసాధ్యాలు పరిశీ లించిన అనంతరం ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. అప్పటితో పోల్చితే వీడియో కాన్ఫ రెన్స్, ఇంట ర్నెట్ వంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఎంతో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ఢిల్లీ వెలుపల నిర్వహించడం సాధ్యమైన విషయమేనని మేధావులు, పార్లమెంటేరియన్లు అంటున్నారు.
ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభలు ఏడాదికి మూడు సార్లు సమావేశమవుతున్నాయి. జనవరి నెలాఖరున ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు మధ్యలో కొన్నాళ్ల విరామంతో రెండు విడతలుగా సాగుతాయి. జూలై–ఆగస్ట్ నెలల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, నవంబర్ – డిసెంబర్ మాసాల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతాయ నేది అందరికీ తెలిసిన విషయమే. ఈ మూడు సెషన్లలో కనీసం ఒకటైనా దక్షిణ భారతదేశంలో నిర్వహించా లని దక్షిణాదికి చెందిన వివిధ పార్టీల ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. వారిలో కొందరైతే రెండు సమావేశాలను దక్షిణాదిన నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
దేశంలో జమ్మూ కాశ్మీర్‌కు రెండు రాజధానులు ఉన్నాయి. శ్రీనగర్ వేసవి రాజధాని, జమ్మూ శీతాకాల రాజ ధాని. రాష్ట్రానికే పరిపాలనా సౌలభ్యం కోసం, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రెండు రాజధానులు ఉన్న నేపథ్యంలో... దేశానికి ఉండడం అభ్యంతరం చెప్పాల్సిన విషయం కాదని కొందరంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ–కశ్మీర్ వంటి పలు రాష్ట్రాల్లో/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండు నగరాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో... దక్షిణ భారతదేశంలో పార్లమెంట్ సమావేశాల్లో ఒకటీ రెండు సెషన్లను నిర్వహించాలన్న డిమాండ్ సహేతుకంగానే ఉందని చెప్పవచ్చు. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశ రెండో రాజధాని రేసులో ఉన్నాయి.
పగిడి రంగారావు
వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు
మొబైల్: 94401 38573
Comments
Please login to add a commentAdd a comment