న్యూఢిల్లీ: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎన్డీయే పక్షాల ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) తొలిసారి సమావేశమయ్యారు. ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ సమావేశంలో మిత్రపక్ష ఎంపీలను ఉద్ధేశించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ సమావేశాల్లో రాహుల్ గాంధీ, విపక్షాల దాడి నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన విధానాలపై ఎన్డీయే కూటమి ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలంతా కచ్చితంగా హాజరుకావాలని ఆదేశించారు. ఎన్డీయే కూటమి ఎంపీలు పార్లమెంట్ నిబంధనలను పాటించాలని, సభలో వారి ప్రవర్తన ఆదర్శప్రాయంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు నిబంధనల విషయంలో సీనియర్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, రాహుల్‌గాంధీపై మోదీ విమర్శలు గుప్పించారు. వరుసగా మూడోసారి కాంగ్రేసేతర పార్టీకి చెందిన నేత ప్రధాని కావడాన్ని విపక్షాలు సహించలేకపోతున్నట్లు విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి రాహుల్ గాంధీ సభలో అవమానకర ప్రసంగం చేశారని మండిపడ్డారు. ఆయనలా ఎవరూ ప్రవర్తించొద్దని.. ఎన్డీయే ఎంపీలంతా పార్లమెంటరీ విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలని ప్రధాని సూచించారు.
సమావేశంలో మోదీ ప్రసంగం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాకు వెల్లడించారు. దేశసేవ చేసేందుకు ఎంపీలంతా పార్లమెంట్‌కు రావాలని మోదీ సూచించారని తెలిపారు. సభలో ఎలా నడుచుకోవాలో కూడా మార్గనిర్దేశం చేశారని చెప్పారు. తమ నియోజకవర్గానికి చెందిన అంశాలను పార్లమెంట్‌లో రెగ్యులర్‌గా ప్రస్తావించాలని, పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించాలని చెప్పినట్లు పేర్కొన్నారు.
‘నిన్న పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ ప్రవర్తించిన తీరు అమర్యాదకరం. స్పీకర్ స్థానాన్ని ఆయన అవమానించారు. రాహుల్‌గా ఎన్డీయే సభ్యులెవరూ ప్రవర్తించొద్దు. కొన్ని దశాబ్దాల పాటు ప్రధాని కుర్చీని ఓ కుటుంబం తన గుప్పిట్లో ఉంచుకుంది. కానీ మా ప్రభుత్వం దేశ నేతలందరికీ సమాన గౌరవం ఇస్తుంది.
పార్టీలకు అతీతంగా దేశంలోని ప్రతీ ఎంపీ తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రధానమంత్రి సంగ్రహాలయ్ (గతంలోని నెహ్రూ మ్యూజియం)ను సందర్శించాలి. అందులో మాజీ ప్రధాని నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రధానుల ప్రయాణాన్ని అందంగా ప్రదర్శించారు. వారి జీవిత విశేషాలను మనమంతా తెలుసుకోవాలి’ అని ప్రధాని ఎంపీలకు సూచించినట్లు రిజిజు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రసంగానికి కౌంటర్ మోదీ ఇస్తారని, ఆ సందేశం ప్రతి ఒక్కర్నీ ఉద్దేశించి ఉంటుందని రిజిజు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment