న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సహా కొత్తగా ఎన్నికైన సభ్యులంతా ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకముందు పార్లమెంట్ ప్రాంగణంలో మోదీ మీడియాతో మాట్లాడారు.
దేశానికి మూడోసారి సేవచేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పనిచేస్తామని ఈ సందర్భంగా మోదీ పునరుద్ఘాటించారు.
’స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు అవ్వడం ఇది రెండోసారి. 60 ఏళ్ల తర్వాత ఈ అవకాశం వచ్చింది... ప్రజలు మూడోసారి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటే దాని ఉద్దేశం, దాని విధానాలు, అంకితభావంపై ముద్ర పడుతుందని, ఇందుకు ప్రజలకు కృతజ్ఞతలు’ తెలిపారు
అనంతరంపై కాంగ్రెస్‌పై మోదీ విరుచుకుపడ్డారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ సమయంలో ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ.. విమర్శలు గుప్పించారు. రేపటికి(జూన్ 25) ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు నిండుతాయని, ఇది దేశ ప్రజాస్వామ్యానికి నల్ల మచ్చగా ఆయన అభివర్ణించారు. భారత రాజ్యాంగాన్ని ఎలా రద్దు చేశారో, దేశాన్ని జైలుగా ఎలా మార్చారో కొత్త తరం మరచిపోదని తెలిపారు. 50ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు మళ్లీ పునరావృతం కాకూడదని మోదీ అన్నారు.
‘ఈ దేశానికి మంచి, బాధ్యతాయుతమైన విపక్షం అవసరం. ప్రజాస్వామ్య మర్యాదను కాపాడేలా, సామాన్య పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిపక్షాలు నడుచుకుంటాయని ఆశిస్తున్నా. డ్రామాలు, ఆటంకాలను ప్రజలు కోరుకోవట్లేదు. నినాదాలు ఆశించట్లేదు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు విపక్షాలు కూడా సహకరించాలి. జనహితం కోసం సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. 18వ లోక్‌సభలో విపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలను ప్రధాని మోదీ హెచ్చరిస్తున్నారని అన్నారు. ఎమర్జెన్సీ గురించి మోదీ ఇంకెన్నిసార్లు మాట్లాడతారని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతూ ఇంకెనెళ్లు పాలిస్తారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను మోదీ దెబ్బతీస్తున్నారు, గత పదేళ్లుగా ప్రధాని అప్రకటిత ఎమర్జెన్సీ విధించారని విమర్శించారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్న తమ ప్రయత్నానికి ప్రజలు మద్దతు పలికారని ఖర్గే తెలిపారు.పార్లమెంటు లోపల, వెలుపల ప్రజల గొంతును ఇండియా కూటమి పెంచుతుందని అన్నారు. నీట్ చుట్టూ జరుగుతున్న నిరసనలు, పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం, మణిపూర్‌లో కొనసాగుతున్న హింస గురించి ప్రధాని మాట్లాడితే బాగుంటుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment