ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ విడుదలచేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేదల కోస చేసిందేమీ లేదని విమర్శించారు. గత ఎన్నికల సందర్భంగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఆ హామీని కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. మరోవైపు.. పంటల మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ.. దేశవ్యాప్తంగా రైతులు రోడ్డు ఎక్కి ధర్నా చేశారని విషయాన్ని ఖర్గే గుర్తుచేశారు.
‘యువతకు ఉద్యోగాల కల్పన కోసం ఎదురు చూస్తోంది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుతోంది. అయినా ఈ సమస్యలు మాత్రం ప్రధాని మోదీకి పట్టడం లేదు. మోదీ ప్రధానిగా కొనసాగిన ఈపదేళ్ల కాలంలో దేశంలోని ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చే ఒక్క మంచి పని కూడా చేయలేదు. మోదీ దేశ ప్రజలకు ఏం చేయలేదని కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇక.. ఈసారి బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో నమ్మదగినది కాదు’ అని మల్లికార్జున ఖర్గే విమర్శలు చేశారు.
ప్రధాని మోదీ ఇవాళ ‘సంకల్ప పత్ర’ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘‘మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ. 70 ఏళ్లు పైబడిన వారికి ఉచిత వైద్యం అందిస్తాం. పేదల జీవితాలు మార్చడమే మోదీ ఇచ్చే గ్యారెంటీ. ఇచ్చిన ప్రతీ హామీని బీజేపీ నెరవేరుస్తుంది. ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు. ముద్ర పథకం ద్వారా కోట్ల మందికి ఉపాధి దక్కింది. మహిళలను లక్షాధికారులుగా చేయడమే మా లక్ష్యం. వ్యవసాయంలో టెక్నాలజీని పోత్సహిస్తున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment